పట్టణాల్లో ఖాళీగా ఉన్న దేవుడి భూములు దీర్ఘకాలిక లీజుకు
మార్గదర్శకాల రూపకల్పనకు అధికారుల కమిటీ
అస్మదీయులకు ఆలయభూముల పందేరానికి కూటమి ప్రభుత్వం మరో జీవో జారీ
రాష్ట్రంలో 4,67,283 ఎకరాల ఆలయ భూములు
వీటిలో పట్టణ ప్రాంతాల్లో 2.05 కోట్ల చదరపు గజాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విలువైన భూముల్ని ఏదో ఒకరకంగా అస్మదీయులకు అప్పగిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం దృష్టి ఇప్పుడు ఆలయ భూములపై పడింది. ఆ భూములను కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు శుక్రవారం మరో జీవో జారీచేసింది. దేవదాయ శాఖకు సంబం«ధించి పట్టణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను దీర్ఘకాలిక లీజుకు ఇవ్వాలన్న అంశంపై సమీక్షించడంతో పాటు అందుకు మార్గదర్శకాల రూపకల్పనకు నలుగురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది.
దేవదాయశాఖ కార్యదర్శి, కమిషనర్, చీఫ్ ఇంజినీరు, ఆయా భూములకు సంబంధించిన ఆలయ ఈవో లేదా దేవదాయశాఖ ప్రాంతీయ జాయింట్ కమిషనర్ ఈ కమిటీలో ఉంటారని జీవోలో పేర్కొంది. రాష్ట్రంలో దేవదాయశాఖ పరి«ధిలో ఆలయాలు, సత్రాలు, మఠాల పేరిట 4,67,283 ఎకరాల భూములున్నాయి. వీటిలో 4,244 ఎకరాలకుపైగా అత్యంత విలువైన భూములు పట్టణాల్లో ఉన్నాయి. ఇవి 1.55 కోట్ల చదరపు గజాల ఖాళీ భూములుగాను, 50 వేల చదరపు గజాల కట్టడాలుగాను ఉన్నాయి. అంటే మొత్తం 2.05 కోట్ల చదరపు గజాలు.
ఈ ఏడాది మే నెలలో ఇలాంటిదే ఒక జీవో
దేవదాయశాఖ నిబంధనల ప్రకారం ఆలయ భూములను లీజుకివ్వాలంటే.. వేలం పాట నిర్వహించి, హెచ్చుపాటదారుకి నిర్ణీత మొత్తానికి ఇవ్వాలి. లీజు గడువు ముగియగానే మళ్లీ వేలం నిర్వహించాలి. దీనికి తూట్లు పొడుస్తూ 20 సంవత్సరాల పాటు లాభాపేక్ష లేకుండా సేవాకార్యక్రమాలు నిర్వహించే సంస్థలకు వ్యవసాయేతర ఆలయ భూములను బహిరంగ వేలంతో సంబంధం లేకుండానే లీజు రూపంలో ఇవ్వడం లేదా పొడిగించడానికి వీలుగా దేవదాయశాఖ నిబంధనల్లో మార్పులు చేస్తూ కూటమి ప్రభుత్వం ఈ ఏడాది మే 2వ తేదీన ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసింది.
ఈ నోటిఫికేషన్‌పై 30 రోజుల పాటు ప్రజల అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు పేర్కొంది. ఆ నోటిఫికేషన్‌పై రాష్ట్ర మాజీ ప్రభుత్వ కార్యదర్శి సహా భక్తుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ‘దీన్ని గట్టిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. వేలం విధానం లేకుండా తమకు కావాల్సినవాళ్లకు ఆలయ భూములు కట్టబెట్టడానికి ఈ ఉత్తర్వులు పనికొస్తాయి. న్యాయపరంగా కూడా నిలువరించాల్సిన అవసరం ఉంది..’ అని అప్పట్లో ఆయా భక్తసంఘాలు సోషల్ మీడియా వేదికలపై పేర్కొన్నాయి.

ఈ అంశంపై అప్పట్లో సాక్షి ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఈ ప్రాథమిక నోటిఫికేషన్.. ప్రజల నుంచి అభ్యంతరాలు, పూర్తిస్థాయి నోటిఫికేషన్‌పై పరిశీలన ప్రక్రియలోనే ఆగిపోయింది. తాజాగా పట్టణ ప్రాంతాల్లో ఆలయభూములను కూడా లీజుకిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం జీవో జారీచేయడాన్ని భక్త సమాజం తప్పుపడుతోంది. ఇలాంటి జీవోలు ప్రభుత్వం అనుకున్న వారికి నామమాత్రం ధరకు కావాల్సినంత కాలం లీజుకు ఇవ్వడానికి ఉపయోగపడతాయని, తద్వారా ఆలయాల మనుగడ ప్ర«శ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


