
చేపల మార్కెట్‌పై తెలుగు తమ్ముళ్ల కన్ను
తెల్లదొరల కాలం నాటి ఏలూరు చేపల మార్కెట్‌పై పచ్చచొక్కా దొరల కన్నుపడింది. నివాస గృహాల నడుమ ఉందన్న సాకుతో, కంపు నెపంతో దీనిని ఊరికి దూరంగా తరలించేందుకు
ఏలూరు, సెంట్రల్ : తెల్లదొరల కాలం నాటి ఏలూరు చేపల మార్కెట్‌పై పచ్చచొక్కా దొరల కన్నుపడింది. నివాస గృహాల నడుమ ఉందన్న సాకుతో, కంపు నెపంతో దీనిని ఊరికి దూరంగా తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఇది ఏ పెద్దలకు ఇంపు కలిగించేందుకో తెలియదు కానీ, మాదేపల్లిరోడ్డులోని డంపింగ్ యార్డు పక్కకు దీన్ని తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. ఏలూరులోని గ జ్జెలవారి చెరువు సమీపంలోని చేపల మార్కెట్ 1936లో ఏర్పడింది. తొలుత చిన్న పాకలతో మొదలైన మార్కెట్ క్రమేపీ ఆధునికతను సంతరించుకుంటూ ప్రస్తుతమున్న రూపుకు వచ్చింది. గతేడాది అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల నాని దీనిని రూ.మూడు కోట్లతో మరింత ఆధునీకరించి కొత్త సొబగులు అద్దారు.
అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర రాజధాని కూడా పొరుగునే ఉన్న విజయవాడలో ఏర్పాటయ్యే అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో ఏలూరులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగు తమ్ముళ్ల కన్ను ఖరీదైన స్థలాలపై పడింది. ఇవేకాక ఉపయోగంలో ఉన్న స్థలాలను కూడా కబ్జా చేసేందుకు వల పన్నారు. దీనిలో భాగంగానే చేపల మార్కెట్‌పై దృషి సారించినట్టు తెలిసింది. కౌన్సిల్‌లో ఎలాగూ ఆధిపత్యం ఉండటంతో ఒక తీర్మానంతో గుట్టు చప్పుడు కాకుండా దాన్ని ఊరి చివరికి నెట్టేందుకు చకచకా పావులు కదిపారు. దీంతో ఈ చేపల మార్కెట్‌నే నమ్ముకుని తరతరాలుగా బతుకుతున్న వందలాది కుటుంబాలు వీధిన పడే దుస్థితి నెలకొంది.
సుమారు నాలుగు ఎకరాల స్థలంలోని ఈ మార్కెట్‌లో సుమారు 23 రకాలైన సంఘాల వారు పలు రకాల వ్యాపారాలు నిర్వహించుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ చేపలు అమ్మే వారిలో అత్యధికులు మహిళలే కావడం విశేషం. ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా సంక్షేమమే ధ్యేయమని, మహిళల స్వావలంభనే లక్ష్యమని చంద్రబాబునాయుడు కూడా ప్రకటించారు. నిజమే కాబోలని నమ్మి తెలుగుదేశానికి ఓట్లేశారు అత్యధిక శాతం మహిళలు. అందులో చేపల అమ్మకమే ప్రధాన వృత్తిగా బతుకుతున్న ఏలూరులోని ఈ మహిళలు సైతం ఉన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇలాంటి పనులు చూస్తుంటే బాబు చెప్పిం దంతా భూటకమని తేలిపోతుందని, ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుతో తాము ఉపాధి కోల్పోతామని చేపల మార్కెట్‌లోని పలువురు మహిళలు కలవరపడుతున్నారు.
చేపల మార్కెట్‌ను తరలిస్తే ప్రతిఘటిస్తాం
చేపల మార్కెట్ తరలిస్తే ప్రతిఘటిస్తామని బహుజన్ సమా జ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నేతల రమేష్‌బాబు స్పష్టం చేశారు. కొత్తరోడ్డులోని ఎఫ్‌ఆర్‌ఈఈ కార్యాలయంలో బుధవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇది పూర్తిగా అవగాహనా రాహిత్యంతో కూడుకున్న అప్రజాస్వామికమైన చర్యగా ఖండించారు. దీనికి వ్యతిరేకంగా ప్రజల సహకారంతో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సయ్యద్ జానీ, ఎమ్.గిరిబాబు, డి.నాగేంద్రకుమార్, బుంగా నాగరాజు, స్వామిదాసు పాల్గొన్నారు.
మాయదారి ప్రభుత్వం
చంద్రబాబుది మహిళా ప్రభుత్వం కాదు.. మాయదారి ప్రభుత్వం. నిజంగా వారిది మహిళా ప్రభుత్వమే అయితే చేపల అమ్మకంతోనే బతుకుతున్న తమను ఊరికి దూరంగా గెంటేయిస్తారా? ఆయన చెప్పింది నిజమని నమ్మి ఓట్లేసి గెలిపించినందుకా మాకీ శిక్ష?
- బచ్చా మణెమ్మ, చేపల అమ్మకందారు
తరతరాలుగా ఇక్కడే ఉన్నాం
తరతరాలుగా ఈ చేపల మార్కెట్‌నే నమ్ముకుని బతుకుతున్నాం. మాకీ చేపల అమ్మకం తప్ప మరోకటి తెలియదు. అలాంటిది ఇప్పటికిప్పుడు మమ్మల్ని ఊరికి దూరంగా నెట్టేస్తే మా వ్యాపారం సాగేదెలా? మా వద్ద చేపలెవరు కొంటారు?
- జయమ్మ, చేపల అమ్మకందారు
చూస్తూ ఊరుకోం
కొత్త ప్రభుత్వం వ స్తే మా తలరాత మారుతుందనుకున్నాం. తీరా చూస్తే అసలుకే ఎసరు పెట్టేలా ఉన్నారు. మొత్తం మార్కెట్‌నే కబళించాలని చూస్తున్నారు. మా కడుపు కొడితే మేము చూస్తూ ఊరుకోం. ఉద్యమాలతో మా మార్కెట్‌ను కాపాడుకుంటాం.
- బోను చక్రధర్, హోల్‌సేల్ అండ్ రిటైల్ వర్తక సంఘం నేత
మార్కెట్ తరలింపును సహించం
చావనైనా చస్తాం కానీ చేపల మార్కెట్‌ను ఇక్కడి నుంచి తరలిస్తే మాత్రం సహించం. ఎవరికో లబ్ది చేకూర్చేందుకు మమ్మల్నిక్కడి నుంచి పొమ్మంటే పోయేది లేదు. తొలుత శాంతియుతంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు మా గోడు వెళ్లబోసుకుంటాం.
- వై.గణేష్, చేపల మార్కెట్ అధ్యక్షుడు