నందమూరి తారక రామారావు తెలుగుజాతి ఖ్యాతి కోసం తెలుగుదేశం పార్టీని పెడితే చంద్రబాబు నాయుడు తెలుగుజాతి విచ్ఛిన్నానికి కుట్రపన్నాడని మైలవరం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే జోగిరమేష్ ఆరోపించారు.
పెనమలూరు, న్యూస్‌లైన్ :
నందమూరి తారక రామారావు తెలుగుజాతి ఖ్యాతి కోసం తెలుగుదేశం పార్టీని పెడితే చంద్రబాబు నాయుడు తెలుగుజాతి విచ్ఛిన్నానికి కుట్రపన్నాడని మైలవరం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే జోగిరమేష్ ఆరోపించారు. పెనమలూరు సెంటర్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీ జిల్లా మహిళా విభాగం కన్వీనర్ తాతినేని పద్మావతి చేస్తున్న 72 గంటల దీక్షకు మద్దతుగా మంగళవారం దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి ప్రసంగించారు. తెలుగుజాతి గుండెలపై తన్ని... తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇచ్చి చంద్రబాబు తీరని ద్రోహం చేశారన్నారు.
సీడబ్ల్యూసీ తెలంగాణ ప్రకటించగానే చంద్రబాబు కొత్త రాజధానికి రూ 4 లక్షల కోట్లు ఇవ్వాలని ప్రకటించటం విడ్డూరంగా ఉందని,తెలుగుజాతిని అవమానపర్చేలా వ్యవహరించారని విమర్శించారు. నేడు సీమాంధ్ర భగభగమంటుంటే కాంగ్రెస్, టీడీపీ మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు పదవులు పట్టుకుని వేలాడుతున్నారని ఇంతకన్నా సిగ్గు చేటైన విషయం మరొకటి లేదన్నారు. వైఎస్.జగన్‌మోహనరెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా జైల్లో ఆమరణదీక్ష చేశారని, ఇప్పుడు రెండోసారి దీక్ష చేపట్టినందున ఆయన సమైక్య నాయకుడని రుజువు చేసు కున్నారని చెప్పారు. జిల్లా మహిళా విభాగం కన్వీనర్ తాతినేని పద్మావతి మాట్లాడుతూ చంద్రబాబు తన వాదనేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపిన చంద్రబాబు చరిత్రహీనుడవుతాడని హెచ్చరించారు. వంగవీటి శ్రీనివాసప్రసాద్ ,కాకర్లవెంకటరత్నం, మాదు వసంతరావు , చంద్రమోహన్, వంగూరుబాబి, చింతావెంకటేశ్వరరావు, మరీదువిజయ్, నందేటికమల్‌రాజ్,వరదీష్,సొంటిరాంబాబు పాల్గొన్నారు.
నేడు దీక్ష విరమణ...
కాగా తాతినే ని పద్మావతి చేపట్టిన 72 గంటల దీక్ష బుధవారం ఉదయంతో ముగుస్తుంది. ఇప్పటికే ఆమెకు బీపీ,షుగర్ లెవల్స్ తగ్గాయని వైద్యులు చెప్పారు. ముగింపు సభలో రాష్ట్రస్థాయి, జిల్లాకు చెందిన ప్రముఖ నేతలు పాల్గొంటారని పద్మావతి తెలిపారు.