మారిన వేదిక? | Telangana Congress Jaitra Yatra at Siddipet | Sakshi
Sakshi News home page

మారిన వేదిక?

Nov 7 2013 12:28 AM | Updated on Mar 18 2019 9:02 PM

‘జైత్రయాత్ర’ సభ నిర్వహణపై కాంగ్రెస్ జిల్లా నేతల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. తొలుత ఈ నెల 21న జిల్లాలో కాంగ్రెస్ సభను నిర్వహించేలా షెడ్యూలు రూపొందించారు.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘జైత్రయాత్ర’ సభ నిర్వహణపై కాంగ్రెస్ జిల్లా నేతల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. తొలుత ఈ నెల 21న జిల్లాలో కాంగ్రెస్ సభను నిర్వహించేలా షెడ్యూలు రూపొందించారు. ఆ తర్వాత షెడ్యూలును ఒక రోజు ముందుకు జరిపి 20వ తేదీనే సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే జైత్రయాత్ర నిర్వహణ ఈ నెల 25వ తేదీ తర్వాతే ఉంటుందనేది తాజా సమాచారం. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రాతినిథ్యం వహిస్తున్న అందోలు నియోజకవర్గం కేంద్రం జోగిపేటలో జైత్రయాత్ర సభ నిర్వహణపై తొలుత చర్చలు సాగాయి. అధికార పార్టీ జిల్లా నేతలు కూడా సుముఖత వ్యక్తం చేశారు. తాజాగా సభ నిర్వహణ వేదికను జోగిపేటలో కాకుండా మరోచోటకు మార్చాలని  నేతలు నిర్ణయించారు.
 
 పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న సిద్దిపేటలో సభ ఏర్పాటు చేసే దిశగా చర్చలు సాగుతున్నాయి. సమీప బంధువు వివాహ వేడుక ఏర్పాట్లలో మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నిమగ్నమై ఉండటంతో సభ నిర్వహణ తేదీని వాయిదా వేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తిరిగి వచ్చిన తర్వాత కాంగ్రెస్ జిల్లా నేతల భేటీ జరుగుతుందని తెలుస్తోంది. కాగా సిద్దిపేటలో సభ ఏర్పాటు వెనుక తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల వ్యూహం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్‌లో పార్టీ విలీనం ఉండబోదంటూ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటిస్తుండటంతో టీఆర్‌ఎస్ పురిటిగడ్డ సిద్దిపేట కేంద్రంగా సభ నిర్వహించాలనే నిర్ణయానికి  తెలంగాణ కాంగ్రెస్ నేతలు వచ్చారు. సిద్దిపేటలో జరిగే సభకు జిల్లాతో పాటు పొరుగునే ఉన్న కరీంనగర్ నుంచి కూడా జన సమీకరణ జరపాలనే యోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అయితే పార్టీ బలహీనంగా ఉన్న చోట జన సమీకరణలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అభాసుపాలవుతామనే ఆందోళన కాంగ్రెస్ నేతలను వెన్నాడుతోంది.
 
 సంగారెడ్డిలో భారీ సభ?
 ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి సొంతంగా జిల్లా కేంద్రంలో భారీ సభ నిర్వహించే యోచనలో ఉన్నారు. జైత్రయాత్ర సభకు ఆయన హాజరయ్యే అవకాశం లేకపోవడంతో నియోజకవర్గంలో తన ఉనికి చాటుకునే రీతిలో సభ నిర్వహణ ఉంటుందని ఎమ్మెల్యే సన్నిహితులు చెబుతున్నారు. సోనియా అభినందన పేరిట నిర్వహించే ఈ సభను కూడా టీ కాంగ్రెస్ సభకు తీసిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement