ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సులను అందించే విద్యాసంస్థలపై ఇక నుంచి పూర్తి అజమాయిషీ విశ్వవిద్యాలయాలకే దక్కనుంది.
యూజీసీ కొత్త నియంత్రణా నియమావళి
ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సులను అందించే విద్యాసంస్థలపై ఇక నుంచి పూర్తి అజమాయిషీ విశ్వవిద్యాలయాలకే దక్కనుంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో వీటిపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అజమాయిషీ రద్దయింది. విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న ఇంజనీరింగ్‌తో పాటు ఇతర సాంకేతిక విద్యాసంస్థలు ఏఐసీటీఈ చట్టంలోని సెక్షన్ 2(హెచ్) నిర్వచించిన ‘సాంకేతిక విద్యాసంస్థలు’ అనే నిర్వచనం పరిధిలోకి రావని గత ఏప్రిల్ 25న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఇంజనీరింగ్, సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రమాణాలు తగ్గకుండా కొత్తగా నియంత్రణ విధానాన్ని తేవాలని యూజీసీ భావించింది. ఈ నియంత్రణ యంత్రాంగానికి ఒక నియమావళిని రూపొందించింది. దీనిని యూజీసీ రెగ్యులేషన్స్(సాంకేతిక విద్యను అందించే కళాశాలలకు వర్సిటీ అనుమతులు)-2013గా వ్యవహరిస్తారు. దీని ముసాయిదా ప్రతిని వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. దీనిపై అభ్యంతరాలను డిసెంబరు 12లోగా పంపాలని కోరింది. ఈ ముసాయిదా ప్రకారం ఇక ఈ విద్యాసంస్థలపై పూర్తి అజమాయిషీ వర్సిటీలకే ఉండనుంది.
ముసాయిదాలోని ముఖ్యాంశాలు ఇవీ..
వర్సిటీ పరిధిలో సాంకేతిక విద్యాసంస్థను ఏర్పాటు చేసుకునేందుకు, లేదా ఇతర అనుమతులు పొందేందుకు దాఖలైన దరఖాస్తులను వర్సిటీ ఏర్పాటు చేసిన స్క్రూటినీ కమిటీ పరిశీలించి లోపాలుంటే వెబ్‌సైట్‌లో తెలియపరుస్తుంది. ఈ నోటీసును ప్రచురించిన 15 రోజుల్లోపు సంస్థలు వసతులు సమకూర్చుకుని తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు.
కాలేజీల అఫ్లియేషన్, రెన్యువల్, చిరునామా మార్పు, పేరు మార్పు, మహిళా కళాశాలను కో-ఎడ్యుకేషన్ కళాశాలగా మార్చడం, సీట్ల సంఖ్య పెంపు, తగ్గింపు, కొత్త కోర్సులు, కోర్సుల రద్దు, డ్యూయల్ డిగ్రీ కోర్సులకు అనుమతి తదితర అంశాలు వర్సిటీ పరిధిలోకి వస్తాయి.
అనుమతులు లేని కళాశాలలు, కోర్సుల వివరాలను యూనివర్సిటీ ఎప్పటికప్పుడు ఒక రిజిస్టర్‌లో పొందుపరిచి, ఆ వివరాలను యూజీసీకి తెలియజేయాలి. ప్రజలకు కూడా ఈ సమాచారాన్ని చేరవేయాలి.
అనుమతులు లేని కళాశాలల్లో చేరిన విద్యార్థులకు అడ్మిషన్‌ను క్రమబద్ధీకరించుకొనేందుకు ఎలాంటి హక్కూ ఉండదు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కళాశాలలపై క్రిమినల్ కేసులు పెట్టవచ్చు. సీట్ల పరిమితిని మించి ప్రవేశాలు కల్పించినా అనుమతులు కోల్పోవాల్సిరావడంతోపాటు, జరిమానాలను ఎదుర్కోవాల్సివస్తుంది.
18 నెలల పాటు అర్హులైన ప్రిన్సిపాల్, డెరైక్టర్ లేనిపక్షంలో, అర్హులైన అధ్యాపకులు లేకపోయినా ‘నో అడ్మిషన్’ స్టేటస్‌ను ఎదుర్కోవలసి ఉంటుంది. అనుమతులను కూడా కోల్పోవలసి వస్తుంది. ల్యాబ్, భవనాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించని విద్యాసంస్థలకు కూడా ఇదే పరిస్థితి.
అడ్మిషన్ల రద్దు, ఫీజుల తిరిగి చెల్లింపు అంశాల్లో విద్యార్థులను ఇబ్బంది పెడితే కోర్సుల అనుమతి రద్దు చేయవచ్చు.
పార్ట్ టైమ్ కోర్సుల నిర్వహణ, రెగ్యులర్ కోర్సులకు అర్హతలు, ఫ్యాకల్టీ అర్హతలు, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల వివరాలు, విద్యాసంస్థల ఏర్పాటుకు అర్హతలు, మౌలిక వసతుల వివరాలు తదితర అన్ని రకాల నిబంధనలను యూజీసీ ఈ ముసాయిదాలో పొందుపరిచింది.