
ప్రభుత్వ వర్సిటీలకు వైస్ చాన్సలర్ల ఎంపికలో సాగదీత
సెర్చ్ కమిటీ సిఫారసు చేసిన పేర్లు నచ్చకుంటే బుట్టదాఖలు
ఏడాదిగా పూర్తిస్థాయి వీసీల నియామకంలో ప్రభుత్వం విఫలం
ఇప్పటికీ తొమ్మిది విశ్వవిద్యాలయాలు ఇన్‌చార్జిల ఏలుబడిలోనే
తాము చెప్పిన పేర్లనే సిఫారసు చేయాలంటూ యూజీసీ నామినీలపై ఒత్తిడి
తాజాగా ఏఎన్‌యూ, ద్రవిడియన్, శ్రీకృష్ణదేవరాయ, జేఎన్‌టీయూ గురజాడ వర్సిటీలకు సెర్చ్ కమిటీల నియామకం
రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో వైస్ చాన్సలర్ల (వీసీ) ఎంపిక పెద్ద ప్రహసనంగా సాగుతోంది. పూర్తిస్థాయి ఉప కులపతులను నియమించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఏడాదికి పైగా వీసీల పేర్లు వెతుకులాటలోనే గడిపేసింది. సెర్చ్ కమిటీలు కూలంకషంగా విశ్లేషించి వర్సిటీల వారీగా ఇచ్చిన జాబితాలను తమకు నచ్చకుంటే బుట్టదాఖలు చేసింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా సెర్చ్ కమిటీలను నియమిస్తూ మరింత సాగదీతకు దిగుతోంది. – సాక్షి, అమరావతి
రాజకీయాలకు అతీతంగా ఉంచాల్సిన వర్సిటీలపై కూటమి సర్కారు కన్నేసింది. గత ప్రభుత్వ హయాంలోని వీసీల మెడపై కత్తిపెట్టినట్టు బెదిరించి బలవంతపు రాజీనామాలు తీసుకుంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ వర్సిటీ వీసీలందరూ మూకుమ్మడిగా వైదొలగడం చర్చనీయాంశమైంది. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వీసీల ఊసే ఎత్తకుండా ఇన్‌చార్జిల పాలనకు వదిలేసింది. చివరికి ఫిబ్రవరిలో 9 వర్సిటీలకు వీసీలను నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. యోగి వేమన వర్సిటీకి వీసీగా ఎంపికైన హైదరాబాద్ వర్సిటీ (సెంట్రల్ వర్సిటీ) ప్రొఫెసర్ పి.ప్రకాశ్‌బాబు మరో సెంట్రల్ వర్సిటీలో అవకాశం రావడంతో వెళ్లిపోయారు.
ఇంకా సెర్చ్ కమిటీ ఎందుకు?
కూటమి ప్రభుత్వం వీసీల ఎంపికలో సెర్చ్ కమిటీ నివేదికకు విలువ లేకుండా చేస్తోంది. ఆచార్య నాగార్జున, శ్రీవెంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, జేఎన్‌టీయూ గురజాడ వర్సిటీలకు గతంలో సెర్చ్ కమిటీ ఇచ్చిన పేర్లలోని వ్యక్తులు వీసీలుగా రావడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడం, మిగిలినవారి పేర్లు ప్రభుత్వానికి నచ్చకపోవడంతో పక్కనపెట్టింది. వాస్తవానికి వీసీల ఎంపికలో సెర్చ్ కమిటీ కీలకంగా వ్యవహరిస్తుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, వర్సిటీ, యూజీసీ నుంచి వ్యక్తులు నామినీలుగా ఉంటారు. అలాంటి కమిటీ వచ్చిన దరఖాస్తుల్లో ప్రతిభావంతులకే పెద్దపీట వేస్తుంది. కానీ, కూటమి ప్రభుత్వం తమ అనుయాయులకే వీసీల పదవులు కట్టబెట్టేలా కుతంత్రాలు పన్నుతోంది. ఈ నేపథ్యంలో సెర్చ్ కమిటీ సిఫారసు చేసిన పేర్లు నచ్చనప్పుడు ప్రభుత్వమే తనకు నచ్చిన పేర్లు ఇచ్చి జాబితాలో రాయించుకోవచ్చు కదా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
కొత్తగా 4 వర్సిటీలకు సెర్చ్ కమిటీలు
ఆచార్య నాగార్జున, ద్రవిడియన్, జేఎన్‌టీయూ గురజాడ, శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలకు కొత్తగా సెర్చ్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 17 వర్సిటీలకు సెర్చ్ కమిటీలను నియమించగా కొన్నింటి సెర్చ్ కమిటీల సమావేశాలు ఆలస్యంగా జరిగాయి. ద్రవిడియన్ వర్సిటీ వీసీ ఎంపికలో యూజీసీ నుంచి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ ఎస్‌ఎకే సారిన్‌ను సెర్చ్ కమిటీలో నియమించారు. ఆయనపై తాము చెప్పిన పేర్లనే ప్రతిపాదించాలని ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెచ్చింది. దీంతో సమావేశాన్ని మధ్యలోనే ముగించి ఢిల్లీ వెళ్లిపోయారు. అప్పటినుంచి మళ్లీ సమావేశం జరగలేదు. ఈ క్రమంలో ఆయన పేరును తొలగించి మద్రాస్ వర్సిటీ మాజీ వీసీ ఎస్.గౌరిని తీసుకొచి్చంది.
శ్రీకృష్ణదేవరాయలో యూజీసీ నామినీగా ఉన్న ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ సరితకుమార్‌దాస్ స్థానంలో లక్నో వర్సిటీ ప్రొఫెసర్ అలోక్ కుమార్‌రాయ్, జేఎన్‌టీయూ గురజాడ వర్సిటీ సెర్చ్ కమిటీలో యూజీసీ నామినీ ఐఐటీ జోధ్‌పూర్ డైరెక్టర్ అవినాశ్‌కుమార్ అగర్వాల్ బదులు నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరమ్ చైర్మన్ అనిల్ దత్తాత్రేయ సహస్రబుద్ధిని, ఆచార్య నాగార్జున వర్సిటీ సెర్చ్ కమిటీలో యూజీసీ నామినీగా జమ్మూ సెంట్రల్ వర్సిటీ వీసీ సంజీవ్ జైన్ స్థానంలో తమిళనాడులోని డీమ్డ్ వర్సిటీ వీసీ ఎన్.పంచనాథంను నియమిస్తూ కొత్తగా సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.
ఇటీవల ఉర్దూ, ఆంధ్రకేసరి, వైఎస్సార్ ఆర్కిటెక్చర్ వర్సిటీలకు వీసీల పేర్లను సెర్చ్ కమిటీలు ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. వీటిని కూడా ప్రభుత్వం ఆమోదించే అవకాశం లేదని ఉన్నత విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు శ్రీవెంకటేశ్వర వర్సిటీకి సైతం త్వరలో కొత్త సెర్చ్ కమిటీని వేయనున్నారు. యోగి వేమన వర్సిటీ వీసీ పోస్టుకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించగా సెర్చ్ కమిటీని వేయాల్సి ఉంది.