విజయనగరం: రాజులకు శృంగభంగం

TDP Seniors Are Not Get Even One Seat In Vizianagaram - Sakshi

దశాబ్దాల పెత్తనానికి చరమగీతం పాడిన ఓటర్లు

టీడీపీకి జిల్లా పెద్ద అశోక్‌కు ఘోరపరాభవం

పార్టీ మారి జనాన్ని మోసగించిన సుజయ్‌కు చెంపదెబ్బ

చినమేరంగిలో హవా చూపలేకపోయిన విజయరామరాజు

సీనియర్లమని గొప్పగా చెప్పుకున్నవారికి... రాజులం మాకు ఇక ఎదురు లేదనుకున్నవారికి... మా మాటే వేదం... మేం చెప్పిందే శాసనం అనుకున్నవారికి... జనాన్ని పట్టించుకోకపోయినా... మా విజయానికి తిరుగులేదని విర్రవీగిన వారికి తాజా ఫలితాలు తగిన గుణపాఠం చెప్పాయి. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని... పదవికోసం గెలిపించిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారికి తగిన శాస్తి జరుగుతుందని ఈ ఫలితాలు తెలియజేశాయి. జిల్లాలో రాజులు అనుకున్నవారెవ్వరూ విజయాన్ని అందుకోలేకపోవడం గమనార్హం.

సాక్షి, విజయనగరం: మహారాజుకి ఎదురు మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితుల్లో అనాదిగా నిరాదరణకు గురవుతున్న ప్రజానీకంలో వచ్చిన చైతన్య దీప్తి ఈ తీర్పు. జిల్లా టీడీపీలో ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవకపోగా, కనీసం మహారాజులైనా విజయాన్ని సొంతం చేసుకోలేకపోవడం జిల్లా చరిత్ర తిరగరాసినట్టయింది. జిల్లాలో రాజులందరినీ ఏకం చేశానని... ఇక తమ పార్టీకి ఎదురే లేదని ఆశపడిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు తీరని నిరాశే ఎదురయింది.

తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచిన కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అశోక్‌ గజపతిరాజు తన స్థానాన్ని పదిలపర్చుకోలేకపోగా... కనీసం విజయనగరం శాసనసభ్యురాలిగా ఆయన కుమార్తె అదితి గజపతిని కూడా గెలిపించుకోలేక చతికిల బడ్డారు. ఇక్కడ అశోక్‌పై వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసిన బెల్లాన చంద్రశేఖర్, అదితి గజపతిపై పోటీచేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామిలు విజయం సొంతం చేసుకున్నారు.

బొబ్బిలిరాజుల చరిత్రకు చరమగీతం
బొబ్బిలి రాజుల హవాకు మరోసారి చెక్‌ పడిం ది. ఇక్కడ తాము ఏం చెబితే అలా... తాము ఏ పార్టీలో ఉంటే అదే విజయం సాధిస్తుందని మొదటినుంచీ ధీమాగా ఉండేవారు. అదే ఇప్పుడు వారి కొంప ముంచింది. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికై... స్వప్రయోజనాలకోసం పార్టీ మారి తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవి అధిష్టించిన  సుజయ్‌ కృష్ణ రంగారావుకు తగిన శాస్తి జరిగింది. బొబ్బిలిలో సమీప ప్రత్యర్థి శంబంగి వెంకట చినప్పలనాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు.

పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేని శత్రుచర్ల
చినమేరంగి రాజుగా రెండు జిల్లాలకు చిరపరిచితుడై... ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీగా... కురుపాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న శత్రుచర్ల విజయరామరాజు తన సత్తా నిరూపించుకోలేకపోయారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆయన సోదరి నరసింహప్రియా థాట్రాజ్‌ కూడా సమీప వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వారికి సమీప బంధువైన పాముల పుష్పశ్రీవాణి చేతిలో ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్‌ సైతం అరకు పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి ఓ సామాన్య గిరిజన మహిళ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గొట్టేటి మాధవి చేతిలో ఓటమిపాలయ్యారు. 

సాలూరులో భంజ్‌దేవ్‌కు భంగపాటు
సాలూరు రాజుగా గుర్తింపు పొందిన ఆర్‌.పి. భంజ్‌దేవ్‌ ఈసారి మళ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొర చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక్కడ ఒకసారి విజయం సాధించిన ఈయన కుల వివాదంలో చిక్కుకుని ఓటమిపాలయ్యారు. తరువాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తిరిగి గిరిజనుడిగా ధ్రువపత్రం పొంది పోటీకి దిగినా ఓటమి తప్పలేదు. ఈయన కూడా ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం చేశారని... దేవుని మాన్యాలు సొంతం చేసుకున్నారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అవే తన ఓటమికి ఒక విధంగా కారణాలయ్యాయి. 
దోచుకోవడంలో వారు దిట్ట
అశోక్‌ గజపతి, సుజయకృష్ణ రంగారావు, భంజ్‌దేవ్‌ తమ ఆస్తులను కాపాడుకోవడంపై పెడుతున్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై పెట్టడం లేదు. విజయనగరానికి కేంద్ర పథకాలు, విభజన హామీలు తెప్పించుకోవడంలో అశోక్‌ పూర్తిగా విఫలమవ్వగా, గనుల శాఖలో ఉండి వాటిలో అక్రమాలను నిలువరించడంలో, జిల్లాకు రాష్ట్ర ప్రాజెక్టులు రప్పించడంలో సుజయ్‌ ఫెయిలయ్యారు. 

ఇక భంజ్‌దేవ్‌ పదవిలో ఉన్నప్పుడూ లేనప్పుడు కూడా తనపై వస్తున్న ఆరోపణల నుంచి తనను తాను కాపాడుకోవడంతోనే సరిపెడుతున్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్‌ పార్టీలో ఉండి, జిల్లా ప్రజలకు కనీసం దర్శన భాగ్యం కూడా కల్పించని కిశోర్‌చంద్రదేవ్‌ ఈ ఎన్నికల్లో సడన్‌గా ప్రత్యక్షమై పదవి కోసం వీరి పంచన చేరారు. ఇలాంటి వారి వల్ల జిల్లా ప్రజలకు వరిగేదేమీలేదని గుర్తించిన ప్రజలు తమ ఓటుతో వీరి తరతరాల పెత్తనానికి చరమగీతం పాడారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top