ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా కలకలం

TDP MLA vallabhaneni vamshi ready to resign his mla post - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ లాబీలో బుధవారం కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా లేఖ కలకలం సృష్టించింది. ఈ వ్యవహారం కాస్తా మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి వెళ్లడంతో రంగంలోకి దిగిన కళా వెంకట్రావు... ఆయన్ని బుజ్జగించే యత్నం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే హనుమాన్‌ జంక్షన్‌లోని డెల్టా షుగర్స్‌ విషయంలో సీఎంవోలోని ఓ అధికారి తీరుతో మనస్తాపం చెందిన ఎమ్మెల్యే వంశీ తన రాజీనామా లేఖతో స్పీకర్‌ వద్దకు వెళ్లేందుకు యత్నించారు. ఆ విషయాన్ని గమనించిన మరో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌... వంశీ వద్ద నుంచి రాజీనామా లేఖను తీసుకుని చింపివేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకు వెళ్లడంతో... వంశీని బుజ్జగించే అంశాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకు అప్పగించారు.

కాగా డెల్టా షుగర్స్‌ను హనుమాన్‌ జంక్షన్‌ నుంచి తణుకు ప్రాంతానికి తరలించాలనే ప్రతిపాదన ఉంది. అయితే తన నియోజకవర్గం నుంచి డెల్టా షుగర్స్‌ను తరలించవద్దని, అనేకమంది రైతుల జీవితాలు ఆధారపడి ఉన్నాయంటూ... ఈ విషయంపై  ఎమ్మెల్యే వంశీ ఇవాళ కొంతమంది రైతులతో కలిసి ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు వెళ్లారు. అయితే సీఎంవో కార్యాలయానికి చెందిన ఓ అధికారి... ఎమ్మెల్యే వంశీని అడ్డుకుని, విషయం తమతో చెప్పాలని, సీఎంను కలిసేందుకు ఇప్పుడు వీలు కాదని చెప్పడంతో... ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ దశలో ఆ అధికారి దురుసుగా ప్రవర్తించడంతో వంశీ... మనస్తాపంతో రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top