ఎమ్మెల్యే ముప్పిడికి నిరసన సెగ

Tdp Mla Muppidi Facing Problems In Election Campaign - Sakshi

ద్వారకాతిరుమల: ‘ఐదేళ్ల పాలనలో మా సమస్యలు తీర్చలేకపోయారు.. ఎప్పుడడిగినా అదిగో.. ఇదిగో అంటూ కాలం వెళ్లబుచ్చారు. ఇప్పుడు ఓట్లు వేయమంటే ఎలా వేస్తాం.. మేమడిగిన పని పూర్తిచేస్తేనే ఓట్లు వేస్తాం’ అని గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు కొందరు గ్రామస్తులు. ద్వారకాతిరుమల మండలంలోని పలు గామాల్లో టీడీపీ అభ్యర్థి ముప్పిడి పార్టీ నేతలతో కలిసి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి ప్రజాదరణ కరువైంది. పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రచార రథాన్ని అడ్డగించి తమ సమస్యల సంగతి ఏం చేశారంటూ నిలదీశారు. ఇలా అడుగడుగునా ప్రజల నిలదీతలతో ప్రచారం సాగింది. కొన్ని గ్రామాల్లో కార్యకర్తలు లేక ప్రచారం వెలవెలబోయింది. 

స్థానికుల పట్టుతో ఎస్సీ కాలనీ సందర్శన
రామానుజాపురం ఎస్సీ కాలనీలో విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కొన్నేళ్లుగా ఎమ్మెల్యే ముప్పిడిని కోరుతున్నారు. ఇప్పటి వరకు స్తంభాలు వేయలేదు. దీంతో ఆ ప్రాంతంలో ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ ప్రచార రథాన్ని స్థానికులు అడ్డుకున్నారు. తమ కాలనీలో విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయలేదని, ఇప్పుడు ఓట్లు కోసం ఎలా వచ్చారని నిలదీశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ ఉందని, ఏ పని చేయడానికీ వీల్లేదని ముప్పిడి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమ దుస్థితిని కళ్లారా చూడాల్సిందేనని స్థానికులు పట్టుబట్టడంతో ఆయన ఎస్సీ కాలనీకి వెళ్లారు. అక్కడి నుంచి విద్యుత్‌ శాఖ డీఈతో ఫోన్‌లో మాట్లాడారు. తాను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇక్కడి ప్రజలు విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేసి, కరెంటు ఇవ్వమని అడుగుతుంటే అదిగో చేస్తాం.. ఇదిగో చేస్తాం అన్నాముగానీ చేయలేదని చెప్పారు. స్తంభాలువేసి, కరెంటు ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటని డీఈని ప్రశ్నించారు. మీరు ఎప్పటికల్లా పని పూర్తి చేస్తారో చెప్పాలన్నారు. దీనికి డీఈ సమాధానమిస్తూ పది, పదిహేను రోజుల్లోగా పని పూర్తి చేస్తానని అన్నారు. ఇదంతా విన్న పలువురు తెలుగు తమ్ముళ్లు ఎన్నికల కోడ్‌ ఉండగా పనులు చేయడం కుదరదన్న ఎమ్మెల్యే, ఈ సమయంలో పనులు ఎలా చేయిస్తారని చెవులు కొరుకున్నారు. 

బురద నీళ్లు తాగుతున్నాం 
గొడుగుపేట వెళ్లిన ముప్పిడిని స్థానిక రామాలయం వద్ద గ్రామస్తులు నిలదీశారు. ఐదేళ్ల పాలనలో తమ గ్రామంలో చేసిన అభివృద్ధి పనులేంటో చూపాలని ప్రశ్నించారు. ఇప్పటికీ తాము బురద నీటినే తాగాల్సివస్తోందని ధ్వజమెత్తారు. ఎస్సీ కాలనీలో ఒక్క సిమెంట్‌ రోడ్డు కూడా వేయలేదని మండిపడ్డారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చారో చెప్పాలని నిలదీశారు. దీంతో వారు నెమ్మదిగా జారుకున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top