వస్తే రూ.200..రాకుంటే రూ.2వేలు రాదు

TDP Leaders Threats To Dwcra Womens In YSR kadapa - Sakshi

సీఎం సభ కోసం డ్వాక్రా మహిళలకు బెదిరింపులు

వైఎస్‌ఆర్‌ జిల్లా,ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులో మంగళవారం జరగనున్న సీఎం చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్షను విజయవంతం చేసేందుకు టీడీపీ నేతలు నానా పాట్లు పడుతున్నారు. ఇందులో భాగంగా ఆయా శాఖల అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని జనాన్ని సమీకరిస్తున్నారు.పలు ప్రాంతాల్లో వెలుగు సిబ్బంది ద్వారా డ్వాక్రా మహిళలను హెచ్చరించారు. మీ గ్రామంలో బస్సు ఏర్పాటు చేశామని, సీఎం సభకు రాకుంటే మీకు రుణాలు రావని, పసుపు కుంకుమ కింద ఇచ్చే రూ.2వేలు కూడా బ్యాంకు అకౌంట్‌లో పడదని చెప్పారు. సభకు హాజరైతే రూ.200 చొప్పున ఇస్తామని చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు.

ప్రొద్దుటూరు మండలంలోని సీతంపల్లె గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ పరిస్థితి చోటు చేసుకుంది. చెన్నమరాజుపల్లె గ్రామంలో వెలుగు యానిమేటర్లు, లీడర్లు ఇదే విధంగా బెదిరించారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని మెప్మా మహిళలను కూడా ఇలాగే బెదిరిస్తున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల సమావేశానికి తప్పకుండా రావాలని సోమవారం వరదరాజులరెడ్డి, లింగారెడ్డి వర్గాలకు చెందిన నాయకులు సమాచారం పంపారు. తప్పనిసరిగా సమావేశానికి హాజరు కావాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో ఉన్న శాస్త్రీనగర్‌లో జనాన్ని సమీకరించేందుకు వరదరాజులరెడ్డి వర్గానికి చెందిన ఓ నాయకుడు సమావేశం ఏర్పాటు చేయగా ఆ వార్డు కౌన్సిలర్‌ రామాంజనేయరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తమ వార్డులోకి వచ్చి ఎలా మీటింగ్‌ పెడతారని ప్రశ్నించినట్లు సమాచారం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top