కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ కోట్లు ఖర్చు పెడుతోంది.
కాకినాడ: నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి వందల కోట్లు ఖర్చు పెట్టిన టీడీపీ కాకినాడలోను అదే పంధాను కొనసాగిస్తోంది. నంద్యాలలో ఓటుకు రూ.ఐదువేల నుంచి రూ.10 వేల పంపిణీ చేసిన తెలుగుదేశం నాయకులు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోను ధన ప్రవాహం కొనసాగిస్తున్నారు. క్యాష్ కొట్టు.. ఓటు పట్టు అనే నినాదాన్ని అక్షరాల పాటిస్తున్నారు. యధేచ్ఛగా డబ్బు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తోంది.
ఎన్నికల సందర్భంగా అధికార టీడీపీ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తోంది. 35వ వార్డులో డబ్బులు పంపిణీ చేస్తూ టీడీపీ కార్యకర్తలు ' సాక్షి' కెమెరాకు చిక్కారు. ఈ విషయంపై పోలీసులు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల తరహాలో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వాలకు టీడీపీ తెర తిసినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయారు.కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు ఈ నెల 29వ తేదిన జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 50 వార్డులు ఉంటే ప్రస్తుతం 48 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 42, 48 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు జరగడం లేదు.