చిచ్చు రగిలింది! | Sakshi
Sakshi News home page

చిచ్చు రగిలింది!

Published Sun, Jul 15 2018 9:33 AM

TDP Leaders Internal fight In City Nellore presidency  - Sakshi

అధికార టీడీపీలో ‘పదవి’ చిచ్చు రేగింది. నగర అధ్యక్ష పదవి తమ సామాజిక వర్గానికి కట్టబెట్టాలని బీసీ నేతలు బలంగా తెరపైకి తెచ్చారు. అది కూడా పార్టీ అధిష్టానం ఆనం జయకుమార్‌రెడ్డికి నగర అధ్యక్ష పదవి కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసిన క్రమంలో అసమ్మతి జ్వాల రగలింది. శనివారం జరిగిన పార్టీ నగర కమిటీ సమావేశానికి అసమ్మతి గళాల సెగ తగిలింది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగర టీడీపీలో ఒకవైపు టికెట్‌ ఫైట్‌ సాగుతోన్న ప్రస్తుత తరుణంలో నగర అధ్యక్ష పదవి చిచ్చు రేగింది. అధ్యక్ష పదవికి నేతను ఎంపిక చేసి రేపోమాపో అధికారిక ప్రకటన చేయనున్న తరుణంలో కొందరు బీసీ నేతలు అసమ్మతి గళం విప్పటం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి ఆదాల గ్రూపు నేతకు పదవి రానున్న క్రమంలో అదే గ్రూపు నేత వ్యతిరేకించడం విశేషం. నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి నగర అధ్యక్షుడిగా కొనేళ్లుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కోటంరెడ్డికి జోడు పదవులు అనే కారణాన్ని తెరపైకి తెచ్చి నగర అధ్యక్ష పగ్గాలు ఆనం కుటంబానికి చెందిన ఆనం జయకుమార్‌రెడ్డికి కట్టబెట్టాలని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ప్లాన్‌ వేశారు. దీనికి అనుగుణంగా కొన్ని నెలలుగా కసరత్తు చేసి అధినేత వద్ద ప్రతిపాదన కూడా పెట్టి ఆమోద ముద్ర వరకు తెచ్చారు. గత నెలరోజులుగా ఈ వ్యవహారం పార్టీలో హాట్‌టాపిక్‌గా సాగుతోంది. తాజాగా విజయవాడలో జరిగిన పార్టీ వర్క్‌షాప్‌నకు కూడా ఆనం జయకుమార్‌రెడ్డికి ఆహ్వానం లేనప్పటికీ ఆదాల తన వెంట తీసుకెళ్లి ముఖ్య నేతలతో మంతనాలు జరిపారు. 

అయితే ఆనం జయకుమార్‌రెడ్డికి నగర అధ్యక్ష బాధ్యతలు అప్పగించటానికి ఇటు నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నగర సీనియర్‌ నేత కిలారి వెంకటస్వామినాయుడు, మరికొందరు నేతలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం పార్టీ నగర కమిటీ సమావేశం నగర ఇన్‌చార్జి ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి నగర మేయర్‌ అబ్ధుల్‌ అజీజ్, నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధతో పాటు మరికొందరు నేతలు హాజరయ్యారు.

 ఈ క్రమంలో పార్టీ సీనియర్‌ కార్పొరేటర్‌ నూనె మల్లికార్జురావు సమావేశంలో నగర అధ్యక్ష పదవిపై పేచీ పెడుతూ అసమ్మతికి తెర తీశారు. 1983 నుంచి ఇప్పటి వరకు ఒకసారి కూడా నగర అధ్యక్ష పగ్గాలు బీసీలకు కేటాయించలేదని, ప్రతి సమావేశంలో టీడీపీ బీసీ పార్టీ అని చెప్పుకోవటం తప్ప ఆచరణలో ఎక్కడా కనిపించటం లేదన్నారు. గతంలో కూడా అనేక సార్లు సీనియర్‌ అయిన తనకు పదవి కేటాయించాలని కోరినా పట్టించుకోలేదని ఈ సారైనా ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో బీసీలకు ఇవ్వాలని లేదంటే మైనార్టీలు. ఎస్సీల్లో ఎవరికి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదంటూ అసమ్మతి రాగాన్ని ఆలపించారు.

 దీంతో శ్రీధరకృష్ణారెడ్డి జోక్యం చేసుకుని మంత్రి నారాయణ ఉన్నప్పుడు మాట్లాడాలని సూచించారు. పార్టీలోని మరో సీనియర్‌ నేత ధర్మవరపు సుబ్బారావు సైతం బీసీ నినాదం వినిపించడంతో శ్రీధరకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 1983 నుంచి పార్టీలో పనిచేస్తున్న సుబ్బారావు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో సమావేశంలో మాట్లాడటానికి ప్రయత్నించగా వెంటనే శ్రీధరకృష్ణారెడ్డి అడ్డుకుని మైక్‌ లాగేసుకున్నారు. దీంతో ఆయన నొచ్చుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొత్తంగా నగర అధ్యక్ష పదవి వ్యవహారం ఆ పార్టీలో వర్గపోరు చిచ్చు రగిల్చింది.  

Advertisement
Advertisement