
నీరు–చెట్టు పథకం తెలుగు తమ్ముళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ మట్టిని సామాజిక అవసరాలకు వినియోగించాలన్న కలెక్టర్ ఆదేశాలను సహితం బేఖాతరు చేస్తూ.. నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కి కోట్లాది రూపాయల విలువైన మట్టిని కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నారు. రంగంపేట మండలంలోని చెరువుల్లో పూడిక మట్టిని ఇష్టానుసారం తవ్వేసి.. ఇటుకల బట్టీలు, నర్సరీలు, రియల్ ఎస్టేట్ స్థలాల మెరకకు అక్రమంగా తరలించేస్తున్నారు. ఈ పథకం లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. మరోపక్క ద్వారపూడి, కేశవరం గ్రామాల్లోని ప్రభుత్వ భూములపై కన్ను వేసిన అక్రమార్కులు రాత్రి వేళల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నా.. మైనింగ్ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
మండపేట : చెరువుల్లో పూడిక తీయడం ద్వారా గట్లను పటిష్టం చేసి, జలసిరిని నింపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నీరు–చెట్టు పథకాన్ని ప్రారంభించింది. జిల్లాలో 1,741 చెరువులుండగా నీరు–చెట్టు పథకం కింద ఈ ఏడాది రూ.201 కోట్లతో 1,861 పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు. ఈ పనులపై ఫిబ్రవరి నెలలోనే సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్తికేయ మిశ్రా సమీక్షించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం సేకరించిన నివేశన స్థలాలను మెరక చేసే పనులకు పూడిక తీసిన మట్టిని వినియోగించాలని ఆ సందర్భంగా ఆదేశించారు. సంబంధిత ఆర్డీఓలు సమన్వయంతో ఈ పనులు చేపట్టాలని సూచించారు. కానీ కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తెలుగు తమ్ముళ్లు భారీ అక్రమాలకు తెర లేపారు.
దోచుకుంటున్నారిలా..
-
గత ఏడాది మిగులు పనుల పేరిట దాదాపు నెల రోజుల కిందట రంగంపేట మండలంలో పూడికతీత పనులు ప్రారంభించారు.
సింగంపల్లి, దొడ్డిగుంట, రంగంపేట తదితర గ్రామాల్లోని చెరువుల్లో అధికార పార్టీ నేతల కనుసన్నలో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.
ఇలా తవ్విన మట్టిని రాయవరం, ఆలమూరు, అనపర్తి, కరప మండలాల్లోని ఇటుక బట్టీలు, కడియం నర్సరీలకు, రియల్ ఎస్టేట్ భూములకు తరలించేస్తున్నారు.
దూరాన్నిబట్టి ఐదు యూనిట్ల లారీకి రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకూ వసూలు చేస్తున్నారు.
లారీలకు నీరు–చెట్టు బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా మైనింగ్ బిల్లులు లేకుండానే దర్జాగా అక్రమాలకు పాల్పడుతున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
ఇలా రోజుకు సుమారు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ అక్రమార్జనకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.
గడచిన నెల రోజుల్లోనే దాదాపు రూ.5 కోట్ల వరకూ ఇలా సొమ్ము చేసుకున్నట్టు అంచనా.
చిత్రమేమిటంటే పూడిక తీసినందుకుగాను క్యూబిక్ మీటరుకు ప్రభుత్వమే వీరికి రూ.29 చొప్పున చెల్లిస్తోంది.
ఇతర ప్రాంతాల్లోనూ ఇదే దందా
మండపేట మండలం కేశవరం, ద్వారపూడి గ్రామాలతోపాటు సమీపంలోని రాజానగరం మండలానికి చెందిన గ్రామాల్లో కూడా గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.
ఆయా గ్రామాల్లో రెవెన్యూకు చెందిన సుమారు 400 ఎకరాల భూములు ఉన్నాయి. వీటితోపాటు పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు సుమారు 300 ఎకరాలు ఉన్నాయి.
సాగు నిమిత్తం పంపిణీ చేసిన ఈ భూములు చాలావరకూ అన్యాక్రాంతమై, గ్రావెల్ అక్రమ తవ్వకాలకు నిలయాలుగా మారాయి.
పట్టా భూములు, ప్రైవేటు స్థలాలను సాగుకు అనుకూలంగా చదును చేసే పేరిట అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి.
పగటి వేళల్లో అధికారిక స్థలాల్లో తవ్వకాలు జరుపుతూ, రాత్రి సమయంలో ప్రభుత్వ భూములు, అనుమతులు లేని స్థలాల్లో లక్షలాది రూపాయల విలువైన గ్రావెల్‌ను తరలించుకుపోతున్నారు.
నీరు–చెట్టు పథకం మాటున తరలించేస్తూ.. వీటికి సీనరేజి రూపంలో ప్రభుత్వానికి చేరాల్సిన లక్షలాది రూపాయల ఆదాయానికి గండి కొడుతున్నారు.- ఆయా గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు పొక్లెయిన్లతో ప్రభుత్వ భూముల్లో రాత్రి వేళల్లో తవ్వకాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రోజుకు రూ.20 లక్షల దోపిడీ
రంగంపేట మండలంలో నీరు–చెట్టు మట్టి అమ్మకాల ద్వారా అధికార పార్టీ నేతలు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. నెల రోజుల వ్యవధిలో రూ.5 కోట్ల మేర అవినీతి జరిగింది. ఇళ్ల స్థలాల మెరకకు మట్టిని వినియోగించాలని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు.
– సబ్బెళ్ల కృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి, అనపర్తి
అక్రమ తవ్వకాలనుఅడ్డుకోవాలి
కేశవరంలో అధికారిక స్థలాల్లో పగటి వేళల్లోను, ప్రభుత్వ భూములు, అనుమతులు లేని స్థలాల్లో రాత్రి సమయంలోను యథేచ్ఛగా గ్రావెల్ తవ్వి తరలించేస్తున్నారు. అడ్డూ అదుపూ లేకుండా భారీ వాహనాలు తిరుగుతుండడంతో రోడ్లు దెబ్బ తింటున్నాయి. లారీలకు నీరు–చెట్టు బోర్డులు ఏర్పాటు చేయడం వలన సీనరేజికి కూడా గండి కొడుతున్నారు.
– తుపాకుల ప్రసన్నకుమార్,ఎంపీటీసీ సభ్యుడు, కేశవరం