land mining
-
తమ్ముళ్లూ.. తవ్వుకోండి!
నీరు–చెట్టు పథకం తెలుగు తమ్ముళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ మట్టిని సామాజిక అవసరాలకు వినియోగించాలన్న కలెక్టర్ ఆదేశాలను సహితం బేఖాతరు చేస్తూ.. నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కి కోట్లాది రూపాయల విలువైన మట్టిని కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నారు. రంగంపేట మండలంలోని చెరువుల్లో పూడిక మట్టిని ఇష్టానుసారం తవ్వేసి.. ఇటుకల బట్టీలు, నర్సరీలు, రియల్ ఎస్టేట్ స్థలాల మెరకకు అక్రమంగా తరలించేస్తున్నారు. ఈ పథకం లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. మరోపక్క ద్వారపూడి, కేశవరం గ్రామాల్లోని ప్రభుత్వ భూములపై కన్ను వేసిన అక్రమార్కులు రాత్రి వేళల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నా.. మైనింగ్ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మండపేట : చెరువుల్లో పూడిక తీయడం ద్వారా గట్లను పటిష్టం చేసి, జలసిరిని నింపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నీరు–చెట్టు పథకాన్ని ప్రారంభించింది. జిల్లాలో 1,741 చెరువులుండగా నీరు–చెట్టు పథకం కింద ఈ ఏడాది రూ.201 కోట్లతో 1,861 పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు. ఈ పనులపై ఫిబ్రవరి నెలలోనే సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్తికేయ మిశ్రా సమీక్షించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం సేకరించిన నివేశన స్థలాలను మెరక చేసే పనులకు పూడిక తీసిన మట్టిని వినియోగించాలని ఆ సందర్భంగా ఆదేశించారు. సంబంధిత ఆర్డీఓలు సమన్వయంతో ఈ పనులు చేపట్టాలని సూచించారు. కానీ కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తెలుగు తమ్ముళ్లు భారీ అక్రమాలకు తెర లేపారు. దోచుకుంటున్నారిలా.. గత ఏడాది మిగులు పనుల పేరిట దాదాపు నెల రోజుల కిందట రంగంపేట మండలంలో పూడికతీత పనులు ప్రారంభించారు. సింగంపల్లి, దొడ్డిగుంట, రంగంపేట తదితర గ్రామాల్లోని చెరువుల్లో అధికార పార్టీ నేతల కనుసన్నలో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇలా తవ్విన మట్టిని రాయవరం, ఆలమూరు, అనపర్తి, కరప మండలాల్లోని ఇటుక బట్టీలు, కడియం నర్సరీలకు, రియల్ ఎస్టేట్ భూములకు తరలించేస్తున్నారు. దూరాన్నిబట్టి ఐదు యూనిట్ల లారీకి రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకూ వసూలు చేస్తున్నారు. లారీలకు నీరు–చెట్టు బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా మైనింగ్ బిల్లులు లేకుండానే దర్జాగా అక్రమాలకు పాల్పడుతున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇలా రోజుకు సుమారు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ అక్రమార్జనకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. గడచిన నెల రోజుల్లోనే దాదాపు రూ.5 కోట్ల వరకూ ఇలా సొమ్ము చేసుకున్నట్టు అంచనా. చిత్రమేమిటంటే పూడిక తీసినందుకుగాను క్యూబిక్ మీటరుకు ప్రభుత్వమే వీరికి రూ.29 చొప్పున చెల్లిస్తోంది. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే దందా మండపేట మండలం కేశవరం, ద్వారపూడి గ్రామాలతోపాటు సమీపంలోని రాజానగరం మండలానికి చెందిన గ్రామాల్లో కూడా గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో రెవెన్యూకు చెందిన సుమారు 400 ఎకరాల భూములు ఉన్నాయి. వీటితోపాటు పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు సుమారు 300 ఎకరాలు ఉన్నాయి. సాగు నిమిత్తం పంపిణీ చేసిన ఈ భూములు చాలావరకూ అన్యాక్రాంతమై, గ్రావెల్ అక్రమ తవ్వకాలకు నిలయాలుగా మారాయి. పట్టా భూములు, ప్రైవేటు స్థలాలను సాగుకు అనుకూలంగా చదును చేసే పేరిట అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. పగటి వేళల్లో అధికారిక స్థలాల్లో తవ్వకాలు జరుపుతూ, రాత్రి సమయంలో ప్రభుత్వ భూములు, అనుమతులు లేని స్థలాల్లో లక్షలాది రూపాయల విలువైన గ్రావెల్‌ను తరలించుకుపోతున్నారు. నీరు–చెట్టు పథకం మాటున తరలించేస్తూ.. వీటికి సీనరేజి రూపంలో ప్రభుత్వానికి చేరాల్సిన లక్షలాది రూపాయల ఆదాయానికి గండి కొడుతున్నారు. ఆయా గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు పొక్లెయిన్లతో ప్రభుత్వ భూముల్లో రాత్రి వేళల్లో తవ్వకాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకు రూ.20 లక్షల దోపిడీ రంగంపేట మండలంలో నీరు–చెట్టు మట్టి అమ్మకాల ద్వారా అధికార పార్టీ నేతలు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. నెల రోజుల వ్యవధిలో రూ.5 కోట్ల మేర అవినీతి జరిగింది. ఇళ్ల స్థలాల మెరకకు మట్టిని వినియోగించాలని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. – సబ్బెళ్ల కృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి, అనపర్తి అక్రమ తవ్వకాలనుఅడ్డుకోవాలి కేశవరంలో అధికారిక స్థలాల్లో పగటి వేళల్లోను, ప్రభుత్వ భూములు, అనుమతులు లేని స్థలాల్లో రాత్రి సమయంలోను యథేచ్ఛగా గ్రావెల్ తవ్వి తరలించేస్తున్నారు. అడ్డూ అదుపూ లేకుండా భారీ వాహనాలు తిరుగుతుండడంతో రోడ్లు దెబ్బ తింటున్నాయి. లారీలకు నీరు–చెట్టు బోర్డులు ఏర్పాటు చేయడం వలన సీనరేజికి కూడా గండి కొడుతున్నారు. – తుపాకుల ప్రసన్నకుమార్,ఎంపీటీసీ సభ్యుడు, కేశవరం -
సాక్షి ఎఫెక్ట్ : టీడీపీ నేత అరెస్టు
రాజమహేంద్రవరం రూరల్ / కడియం : ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో ఓ టీడీపీ నేత దౌర్జన్యంగా పొక్లైన్లతో అక్రమ క్వారీ తవ్వకం .. కోట్ల విలువైన సంపద తరలిపోతున్నా సంబంధితాధికారుల ప్రేక్షకపాత్ర.. బాధితులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని వైనం.. దీంతో ఆ బాధితులు ‘సాక్షి’ని ఆశ్రయించగా రంగంలోకి దిగింది. వరుస కథనాలతో చట్రం బిగించింది. తొలుత బుకాయింపులకు దిగిన ఆ అక్రమదారుడు చివరకు దిగిరాక తప్పలేదు. రాజకీయ ఒత్తిళ్లతో వెనుకడుగు వేసిన పోలీసులు ఈ బాగోతాన్ని ‘సాక్షి’ ససాక్ష్యాలతో బయటపెట్టడంతో చట్టం ఉచ్చులో చిక్కాడు. ఎట్టకేలకు నిందితుడు వెలుగుబంటి వెంకటాచలాన్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. కొడైకెనాల్లో ఉన్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి కోర్టు ముందు హాజరుపరిచిన అనంతరం రాజమహేంద్రవరం తీసుకువచ్చారు. అప్పట్లో ‘సాక్షి’లో వచ్చిన కథనాలకు స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు శ్రీరాములు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని సంబంధిత అధికారులను నిలదీశారు. మాజీ ఎంపీ హర్షకుమార్ సంఘటనా స్థలంలోనే ఆరు రోజులు నిరసన దీక్ష కూడా చేశారు. వెంకటాచలంపై అక్రమ క్వారీయింగ్‌తోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సైతం పోలీసులు నమోదు చేశారు. పోలీసు విచారణ నేపథ్యంలో వెలుగుబంటి వెంకటాచలం అజ్ఞాతంలోకి జారుకున్నారు. డీఎస్పీ పి. నారాయణరావు నేతృత్వంలోని ప్రత్యేక బృందం వెంకటాచలాన్ని కొడైకెనాల్లో అదుపులోకి తీసుకుని శనివారం రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చింది. 7వ అదనపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన అనంతరం, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసుల దాగుడుమూతలు అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడిన నిందితుడు వెలుగుబంటి వెంకటాచలం అరెస్టుపై పోలీసులు దాగుడుమూతలాడారు. నాలుగు ప్రభుత్వ శాఖలకు సంబంధించి రూ. 8.61 కోట్ల అక్రమాలు చేసిన నిందితుడిని మూడు రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు నిందితుడిని తీసుకువచ్చారని తెలియడంతో పత్రికా విలేకరులు అక్కడకు చేరుకుని ఆరా తీశారు. చివరకు అక్కడినుంచి వెంకటాచలాన్ని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న పోలీస్ గెస్ట్‌హౌస్‌కు తరలించారు. కడియం, రూరల్ మండలాల నుంచి పలువురు టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని పైరవీలకు తెరదీశారు. చిన్న,చిన్న దొంగతనాలు చేసిన నిందితులను విలేకర్ల సమావేశం పెట్టి మరీ హాజరుపరిచే పోలీసులు కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడిన వ్యక్తిని రహస్యంగా కోర్టుకు తరలించడం విమర్శలకు తావిచ్చింది. వేమగిరి అక్రమ క్వారీయింగ్‌కు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిల అండ ఉందని ఆందోళనకారులు చేస్తున్న ఆరోపణలు నిజం చేసే విధంగా శనివారం పోలీసులు వ్యవహరించారు. నిందితుడికి రాచమర్యాదలు చేయడంతోపాటు, విలేకర్లకు ఏమాత్రం చిక్కకుండా రహస్యంగా తమ పని తాము పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో భారీ మొత్తాలే చేతులు మారినట్లుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ‘కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం’గా తమ పరిస్థితి మారిందని ఓ పోలీసు ఉన్నతాధికారి విలేకర్ల ముందు వ్యాఖ్యానించారంటే పోలీసులపై అధికార పార్టీ ఒత్తిడి ఈ మేరకు ఉందో అర్థమవుతోంది. సాక్షి కథనాలతో వెలుగులోకి.. జనవరి 26న ‘వెలుగుబంటి విధ్వంసం’ శీర్షికతో అక్రమ క్వారీయింగ్‌ను తొలిసారిగా ‘సాక్షి’ జిల్లా ఎడిషన్ మొదటి పేజీలో వెలుగులోకి తీసుకువచ్చింది. జనవరి 31న జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు శ్రీరాములు అక్రమ క్వారీయింగ్ ప్రాంతాన్ని పరిశీలించి మైన్స్, రెవెన్యూ, పోలీసు అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీశారు. ఫిబ్రవరి 15న వేమగిరిలో జరిగిన అక్రమ క్వారీయింగ్‌లో జరిగిన నష్టాన్ని ‘ఆ తూట్లు విలువ రూ. 8.61 కోట్లు’ శీర్షికతో ‘సాక్షి’ మరో కథనాన్ని ప్రచురించింది. అనంతరం క్వారీయింగ్ కారణంగా నష్టపోతున్న కుటుంబాలు పలుమార్లు తహసీల్దార్ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు. -
ఫారెస్ట్‌లో ‘పాతర’
- అడుగడుగునా బాంబులు.. అడవిలో అలజడి - పేలుతున్న ప్రెషర్ బాంబులు - పోలీసులను అడ్డుకోవడమే లక్ష్యం - మావోయిస్టుల సరికొత్త వ్యూహం - కనిపించని మావోల బంద్ ప్రభావం అడవిలో అడుగడుగునా మందు పాతర్లు.. ఎక్కడ కాలుమోపితే ఏం జరుగుతుందోనని ఆందోళన.. నిన్న వెంకటాపురం మండలం విజయపురి కాలనీ.. నేడు చర్ల మండల కేంద్రంలోని ఆనంద్‌కాలనీ..మావోయిస్టులు వరుసగా మందుపాతర్లు పేల్చుతున్నారు. పోలీసులే లక్ష్యంగా అమర్చిన ఈ మందుపాతర్లకు అడవిబిడ్డలూ బలవుతున్నారు. మన్నెంలో తమ ఉనికిని చాటుకునేందుకు.. బంద్ తదితర పిలుపులను విజయవంతం చేసుకునేందుకు మావోలు ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. భద్రాచలం/ చర్ల: కూంబింగ్ ఆపరేషన్‌కు వచ్చే పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. మందుపాతర్లు, ప్రెషర్బాంబులతో వారిని మట్టుపెట్టేందుకు పథకం రచించినట్టున్నారు. ఆ బాంబుల తాకిడికి గిరిజనులూ బలవుతున్నారు. రెండు రోజుల క్రితం చర్ల- వెంకటాపురం ఆర్అండ్బీ రహదారిలోని ఎధిరకు సమీపంలో ప్రెషర్బాంబు పేలి ఇద్దరు గిరిజనులకు గాయాలైన సంఘటన, శనివారం రాత్రి చర్ల మండల కేంద్రంలోని ఆనంద కాలనీ సమీపంలో బాంబు పేలిన సంఘటన గిరిజనులను భయాందోళనకు గురిచేస్తోంది. పోలీసులే టార్గెట్‌గా అమర్చిన టిఫిన్బాంబులు ఎక్కడపడితే అక్కడ బయటపడుతుండటం.. పేలుతుండటం పోలీసులను ఆలోచనలో పడేసింది. ఛత్తీస్‌గఢ్ తరహాలో.. ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో అనుసరించిన మందుపాతర్ల వ్యూహాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామాలకు సమీపంలోని రహదారులపై కూడా బాంబులు బయటపడుతుండటం గమనార్హం. షెల్టర్ జోన్‌గా ఉన్న తెలంగాణ- ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్- ఒడిశా రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలోకి పోలీసులు దూసుకొస్తుండటం మావోయిస్టులకు సవాల్‌గా మారింది. పెద్ద ఎత్తున సాగిస్తున్న కూంబింగ్ ఆపరేషన్లతో ఇటీవలికాలంలో మావోలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీన్ని తిప్పికొట్టేందుకే మందుపాతర్లు అమర్చుతున్నట్లు తెలుస్తోంది. కూంబింగ్ కోసం పోలీసులు వచ్చే రహదారులను గుర్తించిన మావోయిస్టులు ఆయా ప్రాంతాల్లోనే మందుపాతర్లు అమర్చినట్లు వెల్లడవుతోంది. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి నుంచి మల్లంపేటకు వెళ్లే దారిలో ఎక్కువగా మందుపాతరలు బయట పడుతున్నాయి. వెంకటాపురం మండలం విజయపురికాలనీ నుంచి కొత్తపల్లి మీదగా ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలోకి తరచూ పోలీసులు కూంబింగ్‌కు వెళ్తుంటారు. దుమ్ముగూడెం మండలం చిననల్లబెల్లి మీదుగా ఛత్తీస్‌గఢ్ అటవీప్రాంతంలోకి ప్రవేశిస్తారు. ఈ ప్రాంతాల్లోనే పదే పదే మావోయిస్టులు మందుపాతర్లు అమర్చడం పోలీసులను కలవర పెడుతోంది. పసిగట్టకపోతే ప్రమాదమే.. మందుపాతర్ల అమరికలో మావోయిస్టులు కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నారని, పేల్చేందుకు వంద డిటోనేటర్ల శక్తి కలిగిన కార్డెక్స్ అనే వైరును వినియోగించినట్లు ఏపీ పోలీసులు గుర్తించారు. వెంకటాపురం మండలంలోని విజయపురి కాలనీ వద్ద పేలిన మందుపాతరల వద్ద శక్తి వంతమైన వైర్లు లభ్యమయ్యాయి. మందు పాతరలు అమర్చే క్రమంలో మావోయిస్టులు సాంకేతిక టెక్నాలిజీని వినియోగిస్తున్నట్లు వీటిని బట్టి తెలుస్తోంది. రెండేళ్ల కాలంలో మూడు రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంత గ్రామాలకు రోడ్ల నిర్మాణాలు బాగా జరిగాయి. ఆ సమయంలో రహదారులపై మందుపాతరలను అమర్చి ఉండే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బంద్ విజయవంతం కోసమేనా.? ఈ నెల 19న తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనను ఖండిస్తూ మావోయిస్టులు ఆదివారం తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. గతంలో పలుమార్లు పిలుపునిచ్చినా బంద్ పాటించకుండా నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహించిన మావోయిస్టులు చర్ల శివారులోని ఆనంద్‌కాలనీ వద్ద ఉంజుపల్లి రహదారి పక్కన బంద్ పాటించాలని కోరుతూ వాల్‌పోస్టర్లు వేశారు. సమీపంలోనే మందు పాతర పేల్చినట్లు స్పష్టమవుతోంది. ఈ మార్గం ద్వారానే సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ర్టంలోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాలకు చెందిన ఆదివాసీలు పెద్ద ఎత్తున వారపు సంతకు వస్తారు. కాబట్టి సంతకు వచ్చే వారిని వెనుకకు తిప్పి పంపడంతో పాటు మండల ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేసి బంద్ చేయించుకోవాలన్న లక్ష్యంతో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
రెండు జిల్లాల ప్రజల మద్య చిచ్చు పెట్టిన ఇసుక త్రవ్వకాలు