
ఫారెస్ట్‌లో ‘పాతర’
అడవిలో అడుగడుగునా మందు పాతర్లు.. ఎక్కడ కాలుమోపితే ఏం జరుగుతుందోనని ఆందోళన.. నిన్న వెంకటాపురం మండలం విజయపురి కాలనీ..
- అడుగడుగునా బాంబులు.. అడవిలో అలజడి
- పేలుతున్న ప్రెషర్ బాంబులు
- పోలీసులను అడ్డుకోవడమే లక్ష్యం
- మావోయిస్టుల సరికొత్త వ్యూహం
- కనిపించని మావోల బంద్ ప్రభావం
అడవిలో అడుగడుగునా మందు పాతర్లు.. ఎక్కడ కాలుమోపితే ఏం జరుగుతుందోనని ఆందోళన.. నిన్న వెంకటాపురం మండలం విజయపురి కాలనీ.. నేడు చర్ల మండల కేంద్రంలోని ఆనంద్‌కాలనీ..మావోయిస్టులు వరుసగా మందుపాతర్లు పేల్చుతున్నారు. పోలీసులే లక్ష్యంగా అమర్చిన ఈ మందుపాతర్లకు అడవిబిడ్డలూ బలవుతున్నారు. మన్నెంలో తమ ఉనికిని చాటుకునేందుకు.. బంద్ తదితర పిలుపులను విజయవంతం చేసుకునేందుకు మావోలు ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
భద్రాచలం/ చర్ల: కూంబింగ్ ఆపరేషన్‌కు వచ్చే పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. మందుపాతర్లు, ప్రెషర్‌బాంబులతో వారిని మట్టుపెట్టేందుకు పథకం రచించినట్టున్నారు. ఆ బాంబుల తాకిడికి గిరిజనులూ బలవుతున్నారు. రెండు రోజుల క్రితం చర్ల- వెంకటాపురం ఆర్‌అండ్‌బీ రహదారిలోని ఎధిరకు సమీపంలో ప్రెషర్‌బాంబు పేలి ఇద్దరు గిరిజనులకు గాయాలైన సంఘటన, శనివారం రాత్రి చర్ల మండల కేంద్రంలోని ఆనంద కాలనీ సమీపంలో బాంబు పేలిన సంఘటన గిరిజనులను భయాందోళనకు గురిచేస్తోంది. పోలీసులే టార్గెట్‌గా అమర్చిన టిఫిన్‌బాంబులు ఎక్కడపడితే అక్కడ బయటపడుతుండటం.. పేలుతుండటం పోలీసులను ఆలోచనలో పడేసింది.
ఛత్తీస్‌గఢ్ తరహాలో..
ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో అనుసరించిన మందుపాతర్ల వ్యూహాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామాలకు సమీపంలోని రహదారులపై కూడా బాంబులు బయటపడుతుండటం గమనార్హం. షెల్టర్ జోన్‌గా ఉన్న తెలంగాణ- ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్- ఒడిశా రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలోకి పోలీసులు దూసుకొస్తుండటం మావోయిస్టులకు సవాల్‌గా మారింది. పెద్ద ఎత్తున సాగిస్తున్న కూంబింగ్ ఆపరేషన్‌లతో ఇటీవలికాలంలో మావోలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
దీన్ని తిప్పికొట్టేందుకే మందుపాతర్లు అమర్చుతున్నట్లు తెలుస్తోంది. కూంబింగ్ కోసం పోలీసులు వచ్చే రహదారులను గుర్తించిన మావోయిస్టులు ఆయా ప్రాంతాల్లోనే మందుపాతర్లు అమర్చినట్లు వెల్లడవుతోంది. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి నుంచి మల్లంపేటకు వెళ్లే దారిలో ఎక్కువగా మందుపాతరలు బయట పడుతున్నాయి. వెంకటాపురం మండలం విజయపురికాలనీ నుంచి కొత్తపల్లి మీదగా ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలోకి తరచూ పోలీసులు కూంబింగ్‌కు వెళ్తుంటారు. దుమ్ముగూడెం మండలం చిననల్లబెల్లి మీదుగా ఛత్తీస్‌గఢ్ అటవీప్రాంతంలోకి ప్రవేశిస్తారు. ఈ ప్రాంతాల్లోనే పదే పదే మావోయిస్టులు మందుపాతర్లు అమర్చడం పోలీసులను కలవర పెడుతోంది.
పసిగట్టకపోతే ప్రమాదమే..
మందుపాతర్ల అమరికలో మావోయిస్టులు కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నారని, పేల్చేందుకు వంద డిటోనేటర్ల శక్తి కలిగిన కార్డెక్స్ అనే వైరును వినియోగించినట్లు ఏపీ పోలీసులు గుర్తించారు. వెంకటాపురం మండలంలోని విజయపురి కాలనీ వద్ద పేలిన మందుపాతరల వద్ద శక్తి వంతమైన వైర్లు లభ్యమయ్యాయి. మందు పాతరలు అమర్చే క్రమంలో మావోయిస్టులు సాంకేతిక టెక్నాలిజీని వినియోగిస్తున్నట్లు వీటిని బట్టి తెలుస్తోంది. రెండేళ్ల కాలంలో మూడు రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంత గ్రామాలకు రోడ్ల నిర్మాణాలు బాగా జరిగాయి. ఆ సమయంలో రహదారులపై మందుపాతరలను అమర్చి ఉండే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
బంద్ విజయవంతం కోసమేనా.?
ఈ నెల 19న తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనను ఖండిస్తూ మావోయిస్టులు ఆదివారం తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. గతంలో పలుమార్లు పిలుపునిచ్చినా బంద్ పాటించకుండా నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహించిన మావోయిస్టులు చర్ల శివారులోని ఆనంద్‌కాలనీ వద్ద ఉంజుపల్లి రహదారి పక్కన బంద్ పాటించాలని కోరుతూ వాల్‌పోస్టర్లు వేశారు. సమీపంలోనే మందు పాతర పేల్చినట్లు స్పష్టమవుతోంది. ఈ మార్గం ద్వారానే సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ర్టంలోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాలకు చెందిన ఆదివాసీలు పెద్ద ఎత్తున వారపు సంతకు వస్తారు. కాబట్టి సంతకు వచ్చే వారిని వెనుకకు తిప్పి పంపడంతో పాటు మండల ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేసి బంద్ చేయించుకోవాలన్న లక్ష్యంతో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.