రాజధాని పనులంతే!

TDP Govt Scames in the Capital Amaravati Works - Sakshi

అసలే అధికరేట్లు.. ఆపై ఎక్సెస్‌..

రిజర్వాయర్ల నిర్మాణం, వాగుల విస్తరణ, పూడికతీత పనుల్లో మేత!

నిబంధనలకు విరుద్ధంగా ఎక్సెస్‌కు టెండర్లు ఖరారు.. కేంద్రం, ఆర్థికశాఖ అభ్యంతరాలు బేఖాతర్‌

సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో ఏ పనులు చేపట్టినా రాత్రికి రాత్రే భారీ వ్యయంతో కూడుకున్నవిగా మారిపోతున్నాయి. అంతర్జాతీయ స్థాయి పేరు చెబుతూ ప్రభుత్వ పెద్దలు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ విభాగాల అభ్యంతరాలు బుట్టదాఖలవు తున్నాయి. ‘ముఖ్య’నేత ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థలకే పనులు దక్కేలా టెండర్ల వ్యవహారాలను సీఆర్‌డీఏ నిర్వహిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

వరద నియంత్రణ పనులంటూ..
రాజధాని అమరావతి ప్రాంతంలో శాఖమూరు, నీరుకొండ రిజర్వాయర్ల నిర్మాణంతోపాటు కొండవీటివాగు, పాలెంవాగు విస్తరణ, పూడికతీత పనులను ప్రపంచబ్యాంకు రుణంతో చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించారు. అయితే అసలు ఇంతవరకు ఈ రుణం ఇంకా మంజూరు కాకున్నా వెంటనే వరద నియంత్రణ పనులను చేపట్టకుంటే రాజధాని మునిగిపోయే ప్రమాదం ఉందని సీఆర్‌డీఏ పేర్కొంది. 0.03 టీఎంసీల సామర్ధ్యం కలిగిన శాఖమూరు రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.69.70 కోట్ల వ్యయం అవుతుందని తొలుత అంచనా వేశారు. అనంతరం కొండవీటివాగు, పాలెంవాగులను 36.55 కిలోమీటర్ల మేర విస్తరించడంతోపాటు పూడికతీత పనులను చేర్చారు. ఈ పనులను అదనంగా చేర్చినా కిలోమీటర్‌కు రూ.కోటి చొప్పున రూ.36 కోట్లు లేదా రూ.37 కోట్లు అదనంగా వ్యయం అవుతుంది. అంటే మొత్తం వ్యయం సుమారు రూ.107 కోట్లకు మించదు. అయితే 2017–18 ఎస్‌ఎస్‌ఆర్‌ మేరకు రూ.272.23 కోట్లతో అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌అంచనాలను రూపొందించడం గమనార్హం. 

డీఈఏ, ఆర్థికశాఖ అభ్యంతరాలు తుంగలోకి..
శాఖమూరు రిజర్వాయర్, కొండవీటివాగు, పాలెంవాగుల విస్తరణ, పూడికతీత పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసిన తరువాత టెండర్లను ఆహ్వానించారు. రూ.299.61 కోట్లకు సంయుక్తంగా టెండర్లు దాఖలు చేసిన హెచ్‌ఇఎస్‌ ఇన్‌ఫ్రా–ఎంవిఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థలే ఎల్‌–1గా నిలిచాయి. అంటే అంతర్గత అంచనా వ్యయంపై 10.06 శాతం ఎక్సెస్‌కు టెండర్లను దాఖలు చేశాయి. ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) విధానంలో టెండర్లను ఆహ్వానించినందున అంతర్గత అంచనా కన్నా 5 శాతం ఎక్కువకు దాఖలైతే ఆ టెండర్లను రద్దు చేయాలి. అయితే అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ టెండర్లను రద్దు చేయకుండా వీటిని ఖరారు చేసేందుకు సాకులు వెతికింది. ఈ నేపథ్యంలో విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో  సామర్లకోట–రాజానగరం వరకు నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులకు 32 శాతం ఎక్సెస్‌కు టెండర్లను ఖరారు చేశారనే వాదనను తెరపైకి తెచ్చింది. విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు ఐదు శాతం కన్నా ఎక్సెస్‌కు ఇవ్వకూడదనే నిబంధన వర్తించదని పేర్కొంది. దీనిపై కేంద్ర ఎకనమిక్‌ ఎఫైర్స్‌(డీఈఏ) విభాగాన్ని సంప్రదించిన రాష్ట్ర ఆర్థిక శాఖ విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు కూడా ఐదు శాతం కన్నా ఎక్సెస్‌కు టెండర్లను ఖరారు చేయకూడదని స్పష్టం చేసింది. అయినా సరే టెండర్లను రద్దు చేయకుండా ఈ పనులను 10.06 శాతానికి ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలపడం గమనార్హం.

నీరుకొండలోనూ నిబంధనలకు నీళ్లు...
రాజధానిలో వరద నియంత్రణలో భాగంగా 0.43 టీఎంసీల సామర్ధ్యంతో నీరుకొండ రిజర్వాయర్‌ నిర్మాణ పనులకు తొలుత అంచనా వ్యయం రూ.98.12 కోట్లుగా నిర్ధారించారు. అయితే కరకట్టల విస్తరణ పేరుతో ఈ పనుల అంతర్గత అంచనా వ్యయాన్ని రూ.366.97 కోట్లుగా నిర్ధారించి టెండర్లను ఆహ్వానించారు. ఎన్‌సీసీ–ఆర్వీఆర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ పనులకు రూ.399.99 కోట్లకు టెండర్‌ దాఖలు చేసి ఎల్‌–1గా నిలిచాయి. నిబంధనలకు విరుద్ధంగా 9 శాతం ఎక్సెస్‌కు టెండర్‌ దాఖలు చేసినందున వీటిని రద్దు చేయాల్సి ఉండగా వరద నియంత్రణ పనులను త్వరగా చేపట్టాలనే నెపంతో ఆర్థికశాఖ, డీఈఏ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఈ పనులను ఎక్సెస్‌కు ఎన్‌సీసీ–ఆర్వీఆర్‌లకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ పనులను ఎన్‌సీసీ సక్రమంగా చేయడం లేదని ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పేర్కొనడం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top