సర్కారు వేధింపు.. టీచర్లపై కక్ష సాధింపు! 

TDP Govt Harassment to the teachers - Sakshi

15 మందికి కోర్టు సమన్లు 

టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారన్న అనుమానంతో తెరపైకి పాత కేసులు

విజయనగరం అర్బన్‌: అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారన్న అనుమానంతో ఉద్యోగులపై ప్రభుత్వం వేధింపుల పర్వానికి తెరలేపింది. రెండేళ్ల క్రితం చేపట్టిన నిరసనలకు సంబంధించిన కేసు సమసిపోయిందనుకున్న తరుణంలో 15 మంది ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు శుక్రవారం రాత్రి పోలీస్‌ యంత్రాంగం కోర్టు సమన్లు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఇంటలిజెన్స్‌ విభాగం నుంచి సేకరించిన నివేదికల ఆధారంగా అనుమానం ఉన్న వర్గాలపై వివిధ రూపాల్లో  కొద్దిరోజులుగా వేధింపులు మొదలయ్యాయి. పోస్టల్‌ ఓటింగ్‌ భారీగా పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసుంటారని జిల్లావ్యాప్తంగా ప్రచారం సాగింది. ఇంటెలిజెన్స్‌ విభాగం కూడా ప్రభుత్వానికి అదే నివేదిక ఇచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంకా కొందరు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాల్సి ఉన్నందున పాత కేసులను తిరగదోడితే వారు జాగ్రత్త పడే అవకాశం ఉందని భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

2017నాటి కేసులో సమన్లు 
వెబ్‌ బదిలీ విధానాన్ని మానుకుని పాత విధానాన్నే అమలు చేయాలన్న డిమాండ్‌తో ఫ్యాప్టో, జాక్టో రాష్ట్ర కమిటీల రాష్ట్రవ్యాప్త పిలుపుతో 2017 జూన్‌ 21న జిల్లాలోని ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఉపాధ్యాయుల తాకిడికి కలెక్టరేట్‌ ప్రధాన గేటు విరిగిపోయింది. కానీ  రెండురోజుల తరువాత జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు 15 మంది నాయకులపై కేసు పెట్టారు. కేసులను వెనక్కి తీసుకోవడానికి కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ చూపిన చొరవ ఫలించింది. ఆయన ఆదేశాల మేరకు గేట్లను ఉపాధ్యాయులే మరమ్మతు చేయించారు. దీంతో కేసు ముగిసిందని ఉపాధ్యాయులు భావించారు. కానీ.. వారందరికీ రెండేళ్ల తరువాత శుక్రవారం సమన్లు రావడం చర్చనీయాంశమైంది. 

కలెక్టర్, ఎస్పీలను కలిసిన ప్రతినిధులు
కోర్టు సమన్లు అందుకున్న 15 మంది ఉపాధ్యాయ సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ హరిజవహర్‌లాల్, జిల్లా ఎస్పీ దామోదర్‌ను శనివారం కలిశారు. అప్పటి కలెక్టర్‌ ఆదేశాల మేరకు గేటు మరమ్మతు చేయించేశామనీ, ఇప్పుడు మళ్లీ సమన్లు ఎందుకొచ్చాయో తెలియడం లేదని చెప్పారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కె.శేషగిరి, టి.సన్యాసిరావు, డి.ఈశ్వరరావు, కె.శ్రీనివాసన్‌ తదితరులు ఉన్నారు. కేవలం కక్ష సాధింపుతోనే పాత కేసులు తిరిగి తెరిచారని ఉపాధ్యాయ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top