వైకల్యం నిర్ధారణలో ‘నిర్లక్ష్యం ’..!

TDP Government Rejects Handicapped Girl Pension Application - Sakshi

వైకల్యం  ఉన్నప్పటికి తగ్గించి ఇస్తున్న వైనం

పింఛన్, ఇతర సౌకర్యాలు పొందలేకపోతున్న దివ్యాంగులు

విజయనగరం ఫోర్ట్‌:   పై ఫొటోలో కనిపిస్తున్న విద్యాంగురాలి పేరు పెంకి చరణి. ఈమెది విజయనగరం పట్టణంలోని కేఎల్‌పురం. రెండు రోజుల కిందట కేంద్రాస్పత్రిలో సదరం ధ్రువపత్రం కోసం వెళ్లింది. ఈమెకు వినికిడి సమస్య ఉంది.  ఈమెను పరిక్షించిన  వైద్యులు 65 శాతం వైకల్యం ఉన్నట్టు నిర్ధారించారు. అయితే దివ్యాంగురాలి తండ్రికి వైకల్యం నిర్ధారణలో అనుమానం రావడంతో  వైద్యులని ప్రశ్నించారు. మా అమ్మాయికి 90కి పైగా వైకల్యం ఉంటే  65 శాతం మాత్రమే ఉందని ఏవిధంగా నిర్ధారిస్తారని నిలదీశారు. దీంతో వారు బెరా టెస్టు చేయించమని చరణి తండ్రికి సూచించారు. దీంతో ఆయన ఘోషాస్పత్రిలో ఉన్న సత్వర చికిత్స కేంద్రంలో బెరా టెస్టు చేయించారు. దీంతో  చరణికి అక్కడ వైద్యులు 90 శాతం వైకల్యం ఉన్నట్టు నిర్ధారించారు. ఇది వెలుగులోకి వచ్చిన సంఘటన . వెలుగులో రాకుండా ఇటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. దివ్యాంగుల వైకల్యాన్ని పారదర్శకంగా చేయాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దివ్యాంగులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా దివ్యాంగులు నష్టపోవాల్సిన పరిస్థితి. కొంతమంది వైద్య సిబ్బంది వైద్యులను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. 

ధ్రువపత్రం తప్పనిసరి..
దివ్యాంగులు పింఛన్‌ పొందాలన్నా.. లేదా బస్సు, రైల్వే పాస్‌లు పొందాలన్నా.. ఉద్యోగంలో రిజర్వేషన్‌ సౌకర్యం పొందాలన్న సదరం ధ్రువపత్రం తప్పనిసరి. అయితే ఇప్పుడు సదరం ధ్రువపత్రం పొందడం పెద్ద ప్రహసనంగా మారింది. ధ్రువపత్రాలు  లేకపోవడంలో దివ్యాంగులు పింఛన్లు, రాయితీలు పొందలేకపోతున్నారు. కొంతమంది నెలల తరబడి నిరీక్షిస్తుండగా.. మరి కొంతమంది ఏళ్ల తరబడి ఎదరుచూపులు చూస్తున్నారు.  వైకల్య ధ్రువీకరణ పత్రం కాలపరిమితి దాటిని వారు కూడ అవస్థలు పడుతున్నారు.

స్లాట్‌ బుకింగ్‌ ఆలస్యం..
 ఆగస్టు మొదటి వారం నుంచి వైద్య విధాన్‌ పరిషత్‌ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ధ్రువపత్రాలు జారీ ఆన్‌లైన్‌ ద్వారా మొదలైంది. అంతకు ముందు మీ–సేవలో స్లాట్‌ బుక్‌ చేసుకుని ఆస్పత్రికి వెళితే అదే రోజు వైద్యుడు వైకల్య శాతాన్ని నిర్ధారించి సదరం ధ్రువపత్రం ఇచ్చేవారు. ఆగస్టు నెల నుంచి నూతన విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానం ప్రకారం మీసేవ లో స్లాట్‌ బుక్‌ చేసుకుని ఆస్పత్రికి వెళితే అక్కడ వైద్యులు వైకల్య శాతాన్ని నిర్ధారించి ఆన్‌లైన్‌ లో నమోదు చేస్తారు. తిరిగి మరలా దివ్యాంగుడు మీ–సేవకు వెళ్లి ధ్రువపత్రాన్ని తీసుకోవాలి. అయితే మీ సేవలో స్లాట్‌ బుకింగ్‌ సక్రమంగా కావడం లేదు. ఒక వేళ వచ్చినా రెండు, మూడు నెలల తర్వాత వస్తుంది. దీంతో దివ్యాంగులు ఆస్పత్రికి వెళ్లడానికి కూడా నెలల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి .

వైద్యుల నిర్లక్ష్యం...
దివ్యాంగులకు జిల్లాలోని పార్వతీపురం ఏరియా ఆస్పత్రి, కేంద్రాస్పత్రిలో సదరం ధ్రువపత్రాలు అందజేస్తారు. అయితే వైద్యులు వైకల్యాన్ని నిర్ధారించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారు. అర్హత ఉన్నప్పటికీ అనేక మంది దివ్యాంగులు ధ్రువపత్రాలు పొందలేకపోతున్నారు. వైకల్యం నిర్ధారణలో అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పటికీ ఆ సమస్య పరిష్కరానికి నోచుకోవడం లేదని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం..
వైకల్య శాతం నిర్ధారణలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నిర్ధారణ అయితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం.–   కె .సీతారామరాజు, కేంద్రాస్పత్రి , సూపరింటెండెంట్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top