ఉద్యోగుల ఆశలపై నీళ్లు...

TDP Government Do Not Give Employment To AP Youth - Sakshi

డీఎస్సీ ఫలితాలు విడుదలై 45 రోజులు దాటినా నియామకాలు చేపట్టని వైనం

కౌన్సిలింగ్‌ నిర్వహించకుండా కాలయాపన

ఏడాదిగా మభ్యపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం

నిన్ను నమ్మం బాబు అంటున్న నిరుద్యోగులు

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మభ్యపెడుతోంది. గత ఎన్నికల సమయంలో ప్రతి ఏడాది డీఎస్సీ ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అప్పటి నుంచి పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు మరో ఏడాదిలో జరుగుతాయన్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నామని 2017 డిసెంబర్‌ 5న ప్రకటించారు. ఉద్యోగాలు వస్తాయని వేలాది మంది నిరుద్యోగులు ఆశపడ్డారు. డీఎస్సీ కోచింగ్‌ కోసం రూ.లక్షలు ఖర్చు చేశారు. అప్పటి నుంచి రకరకాలుగా ప్రకటనలిస్తూ డీఎస్సీని కాలయాపన చేస్తూ నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. డీఎస్సీని ఎన్నికల వరకు సాగదీసేందుకు టెట్‌ను రెండుసార్లు నిర్వహించింది. చివరకు ఎన్నికలు ముంచుకువస్తున్న నేపథ్యంలో హడావుడిగా గతేడాది అక్టోబర్‌ 26న డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గతేడాది డిసెంబర్‌ 24 నుంచి ఈ ఏడాది జనవరి 2వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ఫిబ్రవరి 15న ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలు విడుదలై 45 రోజులు దాటినా డీఎస్సీ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకువేయలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఎన్నికల కోసమే డీఎస్సీ ప్రకటనంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 

నెల్లూరు(టౌన్‌): గత ఐదేళ్లుగా డీఎస్సీ కోసం నిరుద్యోగులు ఎదురుచూశారు. డీఎస్సీ పడితే ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశంతో వేలాది మంది టీటీసీ, బీఈడీ కోర్సులు చదివారు. పోస్టులు భారీగా ఉంటాయని, కొంచెం కష్టపడితే ఉద్యోగం పొందవచ్చని ఆశపడ్డారు. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఉంటుందంటూ 2017 డిసెంబర్‌ 5న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అప్పటి నుంచి డీఎస్సీ ప్రకటనను కాలయాపన చేశారు. పోస్టుల ఖాళీల వివరాలను గతేడాది డిసెంబర్‌ వరకు తీసుకోవాలని ఒకసారి, జూన్‌ వరకు చూడాలని మరొకసారి ప్రకటనలు ఇచ్చారు. చివరకు మార్చి వరకు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆయా జిల్లా విద్యాశాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. డీఎస్సీని కాలయాపన చేసేందుకు టెట్‌ను గతేడాది జనవరిలో ఒకసారి, జూన్‌లో మరోసారి ప్రభుత్వం నిర్వహించింది. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికలు ముంచుకువస్తున్న క్రమంలో హడావుడిగా గతేడాది అక్టోబర్‌ 26న డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

భారీ సంఖ్యలో పోటీ 
డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందేందుకు నిరుద్యోగులు భారీ సంఖ్యలో పోటీ పడ్డారు. గత ఐదేళ్లుగా పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉంటాయని భావించారు. జిల్లాలో టీటీసీ, డీఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు 50 వేల మందికిపైగా ఉంటారు. డీఎస్సీ ప్రకటస్తామని చెప్పిన నాటి నుంచి పరీక్షల వరకు కోచింగ్‌ కోసం ఒక్కో విద్యార్థి రూ.లక్షకుపైగా ఖర్చు చేశారు. అయితే వీరి ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. కేవలం జిల్లాలో 207 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని ప్రకటించింది. జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లో 172, మున్సిపల్‌ స్కూల్స్‌లో 29, ట్రైబల్‌ వెల్ఫేర్‌ స్కూల్స్‌లో 6 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్కలు చూపింది. పోస్టుల కోసం 22244 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానంగా ఎస్జీటీ పోస్టులు 35 ఉంటే 13480 మంది పోటీ పడ్డారు. వీరికి గతేడాది డిసెంబర్‌ 24 నుంచి ఈ ఏడాది జనవరి 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ఫిబ్రవరి 15న ఫలితాలు విడుదల చేశారు.

నియామకాలు ఎప్పుడో..
డీఎస్సీ ఫలితాలు విడుదలై 45 రోజులు దాటింది. మెరిట్‌ లిస్ట్‌ జాబితాను కూడా విడుదల చేశారు. ఎన్నికల కోడ్‌ ఈ నెల 10న అమలులోకి వచ్చింది. ఫలితాలు విడుదల నుంచి ఎన్నికల కోడ్‌ వచ్చిన నాటికి మధ్య 23 రోజులు ఉంది. పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే రోస్టర్‌ పాయింట్‌ వైజ్‌ అభ్యర్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎన్నికల కోడ్‌ను చాకుగా చూపి నిరుద్యోగులను గాలికి వదిలివేసిందని పలువురు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోలేదని మండిపడుతున్నారు. ఫలితాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందైనా పోస్టింగ్‌ ఆర్డర్లు ఇస్తుందని ఆశగా ఎదురుచూశామని, కనీసం ఆ దిశగా కూడా పాలకులు, అధికారులు ఆలోచించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top