టీడీపీ చీప్‌ పాలి‘ట్రిక్స్‌’.!

TDP Flexi Controversy In YSR Kadapa - Sakshi

మైదుకూరు(వైఎస్సార్‌ కడప): టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరాడనే అక్కసుతో అధికార పార్టీకి చెందిన వారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో సోమవారం రాత్రి మైదుకూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. మైదుకూరు పట్టణం 14వ వార్డుకు చెందిన బ్యాటరీ ఖాదర్‌బాషా ఆదివారం సాయంత్రం మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎస్‌.రఘురామిరెడ్డి, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబుల సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా మూడు రోజుల క్రితమే బస్టాండ్‌ వద్ద ఉన్న టీ కొట్టుపై వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ టీ కొట్టులో ఖాదర్‌బాషా, పాలబాబు భాగస్వాములు.

ఆదివారం ఖాదర్‌బాషా వైఎస్సార్‌సీపీలో చేరిన కార్యక్రమం విజయవంతం కావడంతో ఈ ఫ్లెక్సీపై టీడీపీ వర్గీయుల కన్ను పడింది. టీ కొట్టులో తనకు సగభాగం ఉందనే దురుద్దేశంతో టీడీపీ వర్గీయుడు వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీకి అడ్డుగా టీడీపీకి చెందిన ఫ్లెక్సీని కట్టేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ వర్గీయులు అక్కడికి చేరుకుని టీడీపీ ఫ్లెక్సీని అడ్డుగా ఎలా కడతారని, పక్కన కట్టుకోవచ్చని వాదించారు. ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు పెరిగాయి.  పోలీసులకు విషయం తెలియటంతో సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. ఇరువర్గాల వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసే క్రమంలో ఇరుపార్టీల ఫ్లెక్సీలను తొలగిస్తామంటూ మొదట వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీని తొలగించారు.

అంతలోనే సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి టీడీపీ ఫ్లెక్సీతో తమకు అవసరం లేదని, తమ పార్టీ ఫ్లెక్సీని ఎందుకు తొలగించారని, మూడు రోజులుగా లేని ఆలోచన ఇప్పుడెందుకు వచ్చిందని కార్యకర్తలకు అండగా నిలుస్తూ పోలీసులను ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీని యధాస్థానంలో ఏర్పాటు చేయాల్సిందేనని బైఠాయించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు కూడా మైదుకూరుకు వచ్చారు.

అధికార అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే సహించం: పోలీసులతో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరాడన్న అక్కసుతో వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీకి అడ్డుగా టీడీపీ ఫ్లెక్సీ ఎలా పెడతారని, ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ లేదా అని, అధికారం ఉందనే అహంకారంతో ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలు ఏదైనా ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరిస్తారని, అధికార పార్టీ వారు పెత్తనం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని ఎంత వరకైనా వెళతామని హెచ్చరించారు. కేసులు పెట్టినా, బలవంతంగా అరెస్ట్‌ చేసినా న్యాయబద్ధంగా పోరాడతామన్నారు. టీడీపీ విధానాలు నచ్చకనే ఖాదర్‌బాషా వైఎస్సార్‌సీపీలో చేరాడని, దీని జీర్ణించుకోలేక ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడితే చూస్తు ఊరుకోమన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తాను, పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

రంగంలోకి దిగిన ఏఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, సీఐలు
తాము మూడు రోజుల క్రితమే ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీని ఎందుకు తొలగించారంటూ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ వర్గీయులు రోడ్డుపైన బైఠాయించారు. దీంతో మరో వైపు టీడీపీ వర్గీయులు తమ ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకుంటామని కేకలు, నినాదాలతో ఫ్లెక్సీని రోడ్డుపై అడ్డుగా పెట్టారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రాజేంద్ర యాదవ్, రూరల్‌ సీఐ హనుమంతు నాయక్‌ చేసిన ప్రయత్నాలతో పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు డీఎస్పీలు శ్రీనివాసులు, కృష్ణయ్యలు, ప్రొద్దుటూరు వన్‌ టౌన్, రూరల్‌ సీఐలు వెంకటశివారెడ్డి, ఓబులేసుయాదవ్‌లు,  పలువురు ఎస్‌ఐలు, అదనపు బలగాలతో పాటు ఏఎస్పీ శ్రీనివాసులరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీకి ఇబ్బంది కలిగించిన వారిపై ఎమ్మెల్యే రఘురామిరెడ్డి బాధితులతో కలిసి ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top