టీడీపీ దాడులపై ఢిల్లీ స్థాయిలో వైఎస్సార్‌సీపీ ఉద్యమం
ఈ అరాచకాలను పార్లమెంట్‌లో చెబుతాం
బాధిత కుటుంబానికి న్యాయం జరిగేవరకు పోరాడతాం
స్పష్టం చేసిన పార్టీ నాయకులు
నరసరావుపేట, పిన్నెల్లిలో సాల్మన్‌కు నివాళులర్పించిన పార్టీ నేతలు
నరసరావుపేట/దాచేపల్లి/పిడుగురాళ్ల: పల్నాడు జిల్లా పిన్నెల్లిలో టీడీపీ గూండాల చేతుల్లో హత్యకు గురైన మందా సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగేవరకు పోరాడతామని వైఎస్సార్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు. సాల్మన్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని చెప్పారు. త్వరలో ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని, చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను పార్లమెంటులో చెబుతామని తెలిపారు. జాతీయ మానవ హక్కుల సంఘానికి, జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని, కోర్టులను ఆశ్రయించి సాల్మన్ హంతకులకు శిక్షపడేవరకు ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలోని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సాల్మన్ సంస్మరణ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు సాల్మన్‌కు నివాళులరి్పంచారు. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాల్ని ఎండగట్టారు. అనంతరం వారు పిన్నెల్లి గ్రామానికి వెళ్లి సాల్మన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. నరసరావుపేటలోను, పిన్నెల్లిలోను వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ చంద్రబాబు దృష్టిలో దళితుల ఓట్లకున్న విలువ వారి ప్రాణాలకు లేదని చెప్పారు. అందుకే అధికారంలోకి వ చ్చిన నాటినుంచి దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
‘రాష్ట్రంలో ఎర్రబుక్ అనే వెర్రి పరిపాలన సాగుతోంది. పల్నాడు జిల్లాలో ఆటవిక రాజ్యాన్ని తలపిస్తున్నారు. గురజాలలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ గూండా రాజ్యం నడుపుతున్నారు. దాడిచేసి చంపారంటూ పిన్నెల్లి నుంచి ఫోన్‌చేసిన వారిని.. గ్రామంలోకి ఎందుకొచ్చారని ప్రశ్నించిన సీఐ భాస్కర్‌రావుకు న్యాయస్థానాల ద్వారా శిక్షపడేలా చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై దాడులు, దౌర్జన్యాలు, దళిత మహిళల మీద అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి.
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసినా ఆయన పట్టించుకోలేదు. పిన్నెల్లి గ్రామం నుంచి 300 కుటుంబాలు బయటకు వెళ్లి జీవించాల్సిన దుస్థితి వచి్చందంటే ఇది పోలీసుల చేతగానితనమే. పలుకూరుకు చెందిన 400 కుటుంబాలు గ్రామాన్ని విడిచిపోయి బతుకుతున్నాయి’ అని చెప్పారు.
కార్యక్రమాల్లో ఎంపీ మద్దిల గురుమూర్తి, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, మేరుగ నాగార్జున, విడదల రజని, సాకే శైలజానాథ్, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ టీజేఆర్ సుధాకర్‌బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్, పార్టీ గ్రీవెన్స్ సెల్ ప్రెసిడెంట్ నారాయణమూర్తి, నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి పూనూరు గౌతమ్‌రెడ్డి, సత్తెనపల్లి సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవరెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కందుల ఎజ్రా, జిల్లా అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్ పాల్గొన్నారు.


