అరుణ మృతదేహం వద్ద టిడిపి, కాంగ్రెస్ శవరాజకీయాలు | TDP and congress Autopsy politics | Sakshi
Sakshi News home page

అరుణ మృతదేహం వద్ద టిడిపి, కాంగ్రెస్ శవరాజకీయాలు

Dec 23 2013 6:00 PM | Updated on Mar 18 2019 9:02 PM

అరుణ మృతదేహం వద్ద టిడిపి, కాంగ్రెస్ శవరాజకీయాలు - Sakshi

అరుణ మృతదేహం వద్ద టిడిపి, కాంగ్రెస్ శవరాజకీయాలు

నల్లగొండ జిల్లాలో కామాంధుడి దాడిలో గాయపడి ఐదురోజులు ప్రాణాలతో పోరాడి కన్నుమూసిన బీటెక్ విద్యార్థిని అరుణ అంత్యక్రియలు నకిరేకల్‌లో పూర్తయ్యాయి.

 నల్లగొండ : నల్లగొండ జిల్లాలో కామాంధుడి దాడిలో గాయపడి ఐదురోజులు ప్రాణాలతో పోరాడి కన్నుమూసిన బీటెక్ విద్యార్థిని అరుణ అంత్యక్రియలు నకిరేకల్‌లో పూర్తయ్యాయి. అంతకు ముందు క్లాక్‌టవర్‌ వద్ద అరుణ మృతదేహానికి విద్యార్థి సంఘాలు, రాజకీయ నేతలు నివాళులర్పించారు. అరుణ తల్లిదండ్రులను ఓదార్చే నెపంతో కాంగ్రెస్‌, టీడీపీ నేతలు చెరోమైకు పట్టుకుని ప్రసంగాలు మొదలుపెట్టారు. ఒక దశలో ఇరుపార్టీల నేతలు ఘర్షణకు దిగారు. ఇరు పార్టీల నేతలు శవరాజకీయాలు చేశారు.  కాంగ్రెస్, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దాంతో  పోలీసులు భారీగా మొహరించారు.  అరుణ మృతదేహాన్ని నకిరేకల్‌ తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. శవరాజకీయాలకు పాల్పడిన కాంగ్రెస్‌, టీడీపీ నేతల తీరు పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన విద్యార్థిని తలారి అరుణ మృత్యువుతో పోరాడి ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. కనగల్ మండలం కురంపల్లికి చెందిన నిట్స్ కళాశాల బీటెక్ విద్యార్థిని అరుణపై ఈనెల 17న నకిరేకంటి సైదులు కిరోసిన్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ప్రేమించిన తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసినందుకు కక్ష పెంచుకుని అరుణపై కర్కశంగా హత్యాయత్నం చేశాడు.

నిలువెల్లా తీవ్రగాయాలైన ఆమెకు మొదట జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఈనెల 18న కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఎల్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. 95 శాతానికిపైగా కాలిన గాయాలవడంతో కోలుకోవడం కష్టంగా మారింది. రోజురోజుకూ పరిస్థితి మరింత విషమించి చివరకు ప్రాణాలొదిలింది. అరుణ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో  పోస్టుమార్టం చేసి సోమవారం ఉదయం నల్గొండ తరలించారు.

 సంచలనం రేకెత్తించిన కేసును జిల్లా పోలీసు యంత్రాంగం సవాల్‌గా తీసుకుంది.  ఘటన జరిగిన 24 గంటల్లోగా నిందితుడు సైదులుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతనిపై చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం తదితర సెక్షన్ల  కింద నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement