
‘స్వైన్’ విహారం
స్వైన్‌ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ మహానగరాన్ని స్వైన్‌ఫ్లూ వణికిస్తోంది.
* గత 15 రోజుల్లోనే 15 మంది మృతి
* ఐదేళ్లలో 200 మందికి పైగా మృత్యువాత
* కేంద్ర సాయం కోరిన తెలుగు రాష్ట్రాలు
* నేడు హైదరాబాద్‌కు ఎన్‌సీడీసీ బృందాలు
* ఏపీలో ఒకరి మృతి
* ప్రాణాంతకం కాదు.. ఆందోళన వద్దు: వైద్యులు
సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ మహానగరాన్ని స్వైన్‌ఫ్లూ వణికిస్తోంది. గత పదిహేను రోజుల్లో స్వైన్‌ఫ్లూ కారణంగా 15 మంది మృతి చెందారంటే హెచ్1 ఎన్1 వైరస్ తీవ్రత ఎలా ఉందో ఊహించుకోవచ్చు. 2009 నుంచి ఇప్పటివరకూ ఏటా స్వైన్‌ఫ్లూ వైరస్ కేసులు నమోదవుతున్నా నివారణకు ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకున్న సందర్భాల్లేవు. ఇప్పుడు రోజూ మరణాలు చోటుకుంటున్న దశలో రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి.
మెడికల్ టూరిజానికి దక్షిణాదిలోనే మహానగరంగా చెప్పుకునే హైదరాబాద్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే, గ్రామీణ ప్రాంతాలకు అంటువ్యాధులు విస్తరిస్తే ఎలా ఉం టుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్‌ను స్వైన్‌ఫ్లూ వణికిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒకరు మరణించగా.. 11 కేసులు నమోదైనట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించడం ఈ భయాలను రెట్టింపు చేస్తోంది. విధిలేని పరిస్థితుల్లో రెండు తెలుగు ప్రభుత్వాలు కేంద్రాన్ని సాయం కోరాయి. ఈ నేపథ్యంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్‌సీడీసీ) వైద్య బృందాలు గురువారం హైదరాబాద్‌కు రానున్నాయి.
నిరోధానికి, నివారణకు చర్యలెక్కడ?: జలుబుతో మొదలై ఆయాసంతో ఉధృతమయ్యే ఈ వ్యాధి మనిషిని క్షణక్షణానికీ కుంగదీస్తూంటుంది. అలాంటి ఈ వ్యాధి నిరోధానికి, నివారణకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిర్దిష్ట చర్యలు శూన్యం. తెలంగాణలో 10 జిల్లాలుంటే హైదరాబాద్‌లోని ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే వైద్య పరీక్షలకు వీలుంది. ఓ వైపు హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లలో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదై, జనం పిట్టల్లా రాలుతున్నా.. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా నివారణ చర్యల్లేవు. మందులు తగినన్ని ఉంచడంగానీ, ప్రత్యేక వార్డులు ఏర్పాటు, ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చర్యలుగానీ లేనేలేవు.
రెండేళ్లకోసారి వైరస్ సైక్లింగ్
హెచ్1ఎన్1 వైరస్ ప్రతి రెండేళ్లకోసారి విజృంభిస్తోంది. ఎందుకంటే దీని పునరుత్పత్తికి సమయమిదే. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి 2009లో ప్రవేశించింది. 2010లోనూ కొన్ని కేసులు నమోదయ్యాయి. తరువాత తగ్గుముఖం పట్టింది. 2011లో కేవలం 11 కేసులే నమోదయ్యాయి. 2012 చివర్లో మళ్లీ కేసులు నమోదయ్యాయి. 2013, 2014 సంవత్సరాల్లో రెండంకెల కేసులు నమోదవగా.. వైరస్ పునరుత్పత్తిలో భాగంగా 2015లో విజృంభించింది. ఇప్పటికే 650 కేసులు నమోదయ్యాయి. అయితే వైరస్ విజృంభించేవరకూ చర్యల్లేకపోవడం విస్మయపరిచే అంశం.
హైదరాబాద్‌లోనే స్వైన్‌ఫ్లూ ఎందుకు ఎక్కువ..
2009 నుంచి ఇప్పటివరకూ మొత్తం నమోదైన కేసుల్లో 80 శాతం స్వైన్‌ఫ్లూ కేసులు హైదరాబాద్, దాని పరిసర ప్రాంతమైన రంగారెడ్డి జిల్లానుంచి నమోదైనవే. దీనికి ప్రధాన కారణం.. ఎక్కడ జనసమర్థం ఎక్కువ ఉంటుందో అక్కడే ఈ వైరస్ విస్తరిస్తుంది. జనసాంద్రత ఎక్కువగా ఉండి, ప్రయాణం ఎక్కువగా చేస్తే దీని వ్యాప్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు ఈ వ్యాధి సోకిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదానిపై అవగాహన లేకపోవడం వ్యాప్తికి మరో కారణం. స్వైన్‌ఫ్లూ లక్షణాలున్న వ్యక్తి గదికే పరిమితం కాకపోవడం, జనంలో ఉండటం వల్ల ఈ వైరస్ మరింతమందికి సోకుతోంది.
ఇప్పటి వరకూ 200 మృతులు
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటినుంచి ఇప్పటివరకూ స్వైన్‌ఫ్లూ వైరస్ సోకి 200 మంది మృతి చెందినట్టు అధికారవర్గాలే చెబుతున్నాయి. ఎక్కువగా 2010లో 56 మంది మృతిచెందారు. ఇక అమెరికా నుంచి దిగుమతి అయిన స్వైన్‌ఫ్లూ(హెచ్1ఎన్1) వైరస్ ద్వారా మన దేశంలో నమోదైన మొదటి కేసు హైదరాబాద్‌లో చోటుచేసుకోవడం విశేషం. 2009 మే 13న అమెరికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి హెచ్1ఎన్1 సోకింది.
దశలవారీగా విజృంభణ
స్వైన్‌ఫ్లూ వైరస్ దశలవారీగా విజృంభిస్తుంది. తొలుత జలుబు చేయడం... ఆ తర్వాత జ్వరం రావడం తొలి దశగా గుర్తించాలి. ఇక రెండో దశలో ఆయాసం వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ దశలో తక్షణమే వైద్యుడి దగ్గరకు వెళ్లాలి. ఇక మూడవ దశ అంటే ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడం. ఈ దశ చాలా ప్రమాదకరమైనది. రోగిని వెంటిలేటర్‌పై పెట్టాలి. దురదృష్టవశాత్తూ మూడవ దశలోకి వచ్చినవారిలో 80 శాతంపైనే మృతులు చోటుచేసుకుంటున్నాయి.
అప్రమత్తంగా ఉన్నాం..మంత్రి కామినేని
స్వైన్‌ఫ్లూ వ్యాధి నివారణ చర్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంలతో సమీక్ష జరిపారు. స్వైన్‌ఫ్లూ వ్యాధిపై అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను అప్రమత్తం చేశామని, నిరోధానికి అవసరమైన మందులను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఇప్పటివరకూ ఏపీలో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయని, వారికి తగిన చికిత్స అందిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వాసుపత్రులతోపాటు, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ స్వైన్‌ఫ్లూ మందులు అందుబాటులో ఉంచామని తెలిపారు.
ఏపీలో ఒకరు మృతి: సీఎస్ వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకూ 11 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయని, ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రులన్నిటిలో టామి ఫ్లూ మందులతోపాటు మిగతా వ్యాధి నిరోధానికి ఉపయోగపడే అన్ని మందులు అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలిచ్చారు. దగ్గు, జలుబు, జ్వరం బారిన పడి ఆసుపత్రులకు వచ్చేవారిపై ప్రత్యేకంగా పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
ప్రమాదం లేదు.. నిర్లక్ష్యం పనికిరాదు
స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకితే పెద్దగా ప్రమాదం ఉండదు. అయితే దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మొత్తం మూడు దశల్లో స్వైన్‌ఫ్లూ ఉంటుంది. తొలి దశలో ఉన్నవారికి రక్తపరీక్షలు అక్కర్లేదు. రెండోదశ, మూడో దశలో ఉన్నవారికి పీసీఆర్ టెస్టు చేయాలి. తొలి దశలో జలుబు, స్వల్పంగా జ్వరం ఉంటుంది. రెండో దశలో ఆయాసం, శ్వాసపీల్చడం కష్టమవుతుంది. మూడో దశలో ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకుతుంది. నివారణ చర్యల్లో భాగంగా వ్యాక్సిన్ వేసుకోవచ్చుగానీ.. అందరికీ పనికిరాదు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే ఇది వేసుకోవాలి. వ్యాక్సిన్ 70 శాతం వరకే రక్షణనిస్తుంది. మిగతా 30 శాతం జాగ్రత్తలతోనే సాధ్యం.
- డాక్టర్ నాగేశ్వరరెడ్డి, చైర్మన్, ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ
ఆందోళన అవసరం లేదు
స్వైన్‌ఫ్లూ గురించి ఆందోళన వద్దు. అవగాహనతో నివారించవచ్చు. స్వైన్‌ఫ్లూ నివారణ స్వీయ నియంత్రణపైనే ఆధారపడి ఉంటుంది. ఇది సాధారణ జనం కంటే గర్భిణుల్లో వచ్చే అవకాశం ఆరు రెట్లు ఎక్కువ. స్థూల కాయుల్లో 9 రెట్లు ఎక్కువ. అందుకే వీళ్లిరువురూ రోగ నిరోధక శక్తినిచ్చే బలమైన ఆహారం తీసుకోవాలి. స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలున్నవారు బయటకు రావడంగానీ, ప్రయాణాలు చేయడంగానీ, ఫంక్షన్‌లకుగానీ వెళ్లకూడదు.
- స్వైన్‌ఫ్లూ నోడల్ అధికారి డా.శుభాకర్