ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్లు ఆర్డర్ చేసి, అవి తెచ్చిన వారికి నకిలీ నోట్లు ఇచ్చిన వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
అమలాపురం టౌన్ : ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్లు ఆర్డర్ చేసి, అవి తెచ్చిన వారికి నకిలీ నోట్లు ఇచ్చిన వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.50 వేల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో అయినవిల్లి మండలం మాగం గ్రామానికి చెందిన యాళ్ల మోహన అయ్యప్ప అనే యువకుడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచగా రిమాండు విధించినట్టు చెప్పారు. కేసు వివరాలను ఆయన చెప్పారు.
ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్ల అమ్మకం ప్రకటనలు చూసి మోహన అయ్యప్ప ఆయా సంస్థలకు సెల్‌ఫోన్లు ఆర్డర్ ఇచ్చాడు. అతని వద్దకు కొత్త సెల్‌ఫోన్ తెచ్చిన వ్యక్తికి కలర్ జిరాక్సుతో ఉన్న వెయ్యి నోట్లను ఇచ్చాడు. ఆ వ్యక్తి నోట్లను పరిశీలిస్తున్నప్పుడు, సెల్‌ఫోన్ పట్టుకుని మోహన అయ్యప్ప పరారయ్యాడు. ఇలా అమలాపురంలో పలు చోట్ల మోసాలకు పాల్పడ్డాడు. ఈ తరహాలో పట్టణంలో ఐదు చోరీలకు పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి ఐదు సెల్‌ఫోన్లు, కలర్ ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.50 వేలు ఉంటుందిన సీఐ శ్రీనివాస్ తెలిపారు.