డ్యూటీ.. లూటీ

SVU Examination Section Negligence on LLB Revaluation Paper - Sakshi

పరీక్షల విభాగంలో గోల్‌మాల్‌

ఓడీల పేరిట స్వాహా

విధులకు వెళ్లకుండా నిధుల కైంకర్యం

వెలుగుచూసిన అక్రమం

నిద్రావస్థలో పరీక్షల విభాగం

ఎస్వీయూ పరీక్షల విభాగం పనితీరు రోజురోజుకూ దిగజారిపోతోంది. ఆ విభాగంలోఅన్ని వ్యవహారాలు అత్యంతజాగ్రత్తగా, పకడ్బందీగా జరగాలి. అధికారి నుంచి అటెండర్‌ వరకు అన్ని స్థాయిల్లో ఉద్యోగులు
చిత్తశుద్ధితో పనిచేయాలి. జవాబు పత్రాల మూల్యాంకనం విషయంలో చాలా కట్టుదిట్టంగా ఉండాలి. ఇందుకోసంయూనివర్సిటీ ఉద్యోగులకుఆన్‌ డ్యూటీ సౌకర్యంతో పాటు లక్షలాది రూపాయలను
అలవెన్సులుగా ఇస్తోంది. అయితే అక్కడి ఉద్యోగులువిధులకు వెళ్లకుండానే నిధులు మింగేస్తున్నారనే విమర్శలువెల్లువెత్తుతున్నాయి.మంగళవారం వెలుగుచూసిన సంఘటన ఇందుకు నిదర్శనం.

యూనివర్సిటీ క్యాంపస్‌: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరీక్షల విభాగానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ పరీక్షల నియంత్రణాధికారి పేరుతో జరగాలి. అయితే లా విభాగం పరిధిలోని ఎల్‌ఎల్‌బీ కోర్సు పరీక్షల జవాబు పత్రాలకు సంబంధించిన రీవాల్యుయేషన్‌ జవాబు పత్రాల బండిల్‌ మంగళవారం పరీక్షల విభాగంలో పనిచేసే ఒక అటెండర్‌ పేరిట కొరియర్‌ వచ్చింది. దీన్ని చూసి అధికారులు విస్తుపోతున్నారు. 

నిబంధనలు ఇలా..
పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్‌కు విద్యార్థులు దరఖాస్తు చేస్తే త్వరితగతిన ఫలితాల విడుదలకోసం కొంతమంది ఉద్యోగులను ఈ విధులకు కేటాయిస్తారు. ఆ సిబ్బంది సంబంధిత జవాబు పత్రాల బండిళ్లను పకడ్బందీగా సీల్‌ చేయించి వ్యక్తిగతంగా తీసుకెళ్లి మూల్యాంకనం చేసేవారికి ఇవ్వాలి. మూల్యాంకనం పూర్తి చేసిన తర్వాత జవాబు పత్రాలను పకడ్బందీగా సీల్‌ చేయించుకుని వ్యక్తిగతంగా తీసుకుని రావాలి. ఆ విధులకు యూనివర్సిటీ తగిన అలవెన్స్‌ చెల్లిస్తుంది.

జరుగుతున్నది ఇదీ..
నిబంధనల ప్రకారం పరీక్షల విభాగం సిబ్బంది జవాబు పత్రాలను వ్యక్తిగతంగా తీసుకెళ్లకుండా పోస్ట్‌ ద్వారానో, ఇతరుల ద్వారానో పంపి, వాటిని తిరిగి తెప్పించుకుంటున్నారు. తాము వ్యక్తిగతంగా వెళ్లి వచ్చినట్లు బిల్లులుతీసుకుంటున్నారు. తాము వెళ్లకుండా ఓడీ రూపంలో లక్షలాది రూపాయల నిధులు కొల్లగొడుతున్నారు. ఇంతా జరుగుతున్న సంబం«ధిత సెక్షన్లలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, ఏఏఓలు ఏం చేస్తున్నారన్నది శేష ప్రశ్న. 

అవకతవకలెన్నో?
పరీక్షల విభాగంలోని ఒక అటెండర్‌ పేరిట మంగళవారం కొరియర్‌ రావడంతో వర్సిటీ అధికారులు అవాక్కయ్యారు. పరీక్షల విభాగంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనడానికి ఈ సంఘటన సాక్ష్యంగా నిలిచింది. ఈ పార్సిల్‌ కాకినాడలోని రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లా సంస్థ నుంచి వచ్చింది. లా పరీక్షల రీవాల్యుయేషన్‌కు సంబంధించిన పార్సిల్‌గా గుర్తించారు. వాస్తవంగా ఈ బండిల్‌ను ఈ విధుల కోసం కేటాయించిన సిబ్బంది వ్యక్తిగతంగా వెళ్లి తీసుకురావాలి. కానీ అలా జరగలేదు. పరీక్షల నియంత్రణాధికారి పేరిట కాకుండా ఒక అటెండర్‌ చిరునామాతో పార్సిల్‌ రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలా ఎంత కాలంగా సాగుతుందో అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ ఉన్నతాధికారులు ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుని పరీక్షల విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సి ఉంది. 

నా దృష్టికి రాలేదు
అటెండర్‌ పేరుతో మూల్యాంకన పత్రాలు రావడంపై పరీక్షల నియంత్రణాధికారి దామ్లానాయక్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా తన దృష్టికి రాలేదని తెలిపారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారిస్తానని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top