వేంకటేశ్వరా.. తీరు మారలేదురా

వేంకటేశ్వరా.. తీరు మారలేదురా

 •      ఎస్వీబీసీలో మళ్లీ మళ్లీ అవే కథలు

 •      ‘కుమ్మరి భీమన్న’ కథ కంచికే

 •      వేలి ముద్రవేసి..ఎవరిదారి వారిదే..

 •      వివిధ రేడియోలలో పార్ట్‌టైమ్ రీడర్లుగా కొందరు

 •      టెలికాస్ట్ కాని వాటికి రూ.లక్షల్లో ఖర్చు

 • తిరుపతి సిటీ: అనుక్షణం కొత్తదనంతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని వివిధ భక్తి చానళ్లు పోటీ పడుతున్న తరుణం ఇది. అయితే టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) మాత్రం ఏడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంలా ఉంది. శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే తలంపుతో కోట్లాది రూపాయల వ్యయంతో ఈ చానల్‌ను నెలకొల్పిన విషయం విదితమే. ఆతర్వాత దీనికి అనుబంధంగా శ్రీవెంకటేశ్వర స్వామి పేరున తమిళ చానల్‌నూ నెలకొల్పారు.  ఇంత వరకు బాగానే ఉన్నా.. అనంతరం ఎస్వీబీసీలో ఏ మాత్రం పురోగతి లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేసిన కార్యక్రమాలనే మళ్లీ మళ్లీ వేస్తూ వీక్షకులకు విసుగుపుట్టిస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. ఇక ఇందులో పనిచేసే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో పనిచేయాలనుకునే వారు కూడా చేసే అవకాశం లేకుండా పోతోందని తెలుస్తోంది.

   

  చుట్టపుచూపులా సీఈవో రాక  అన్నీ తానై వ్యవహరించాల్సిన ఎస్వీబీసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో) హైదరాబాద్‌లో కూర్చొని నెలకోసారి చుట్టపుచూపులా ఇక్కడి కార్యాలయానికి వెళుతున్నారని సమాచారం. దీంతో కొందరు ఉద్యోగులు బయోమెట్రిక్‌లో వేలిముద్ర వేసిందే తడవుగా తమ సొంత పనులకు వెళ్లిపోతున్నారనే ఆరోపణలున్నాయి. ఇంకొందరు ప్రైవేట్ రేడియో చానల్‌లో పార్ట్‌టైమ్ రీడర్లుగా కొనసాగుతూ ధనార్జన చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు సక్రమంగా విధులకు రాకపోవడంతో కిందిస్థాయి అధికారులపై అజమాయిషీ కొరవడి చానల్ నిర్వహణ మొక్కుబడి వ్యవహారంగా మారింది.

   

  టెలికాస్ట్ కాని వాటికి లక్షల్లో ఖర్చులు

   

  ఎస్వీబీసీలోని సీనియర్ నిర్మాతల అనాలోచిత నిర్ణయాలతో వెంకన్న సొమ్ము లక్షల్లో ఖర్చవుతోంది. రెండేళ్ల క్రితం రూ.20 లక్షల ఖర్చుతో తీసి మరుగున పడిన ‘నాయన’ సీరియల్ ఉదంతం మరువక ముందే ఇటీవల ‘కుమ్మరి బీమన్న’ పేరుతో ఓ సీరియల్‌ను ప్రారంభించి రూ.5లక్షలు ఖర్చు చేసి మూలన పడేశారు. అలాగే మరో రూ.5 లక్షలతో ‘విజయీభవ’, రూ 5 లక్షలతో ‘స్వరరాగసుధ, సప్తవాహీ తరంగణి’ కార్యక్రమాలు రూపొందించి మధ్యలోనే ఆపేశారు. చానల్ ప్రారంభం నుంచి ఒకటి, రెండు తప్ప చివరి వరకు నడిపిన సీరియళ్లు లేవు. దాదాపుగా ప్రతి సీరియల్‌నూ రెండు, మూడు ఎపిసోడ్స్‌తో ఆపేయడం షరామామూలే. నడుస్తున్న గీతాంజలి-1, గీతాంజలి-2 కార్యక్రమాలకు అవసరమైన క్యారెక్టర్లలో ఉన్నతాధికారుల పిల్లలు, సీనియర్ నిర్మాతల పిల్లలకే అవకాశం ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

   

  మా దృష్టికి రాలేదు

  ఎస్వీబీసీ ఉద్యోగులు, అధికారులు వేలిముద్రలు వేసి విధులకు రావడం లేదన్న విషయం మా దృష్టికి రాలేదు. మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. త్వరలో ప్రసారం అవుతాయి. కుమ్మరి భీమన్న సీరియల్‌ను తాత్కాలికంగా ఆపాం. త్వరలో రీ ఎడిటింగ్ చేసి టెలికాస్ట్ చేస్తాం.

   -మధుసూదన్‌రావ్, సీఈవో, ఎస్వీబీసీ

   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top