
వివాహిత అనుమానాస్పద మృతి
పోలవరం మండలం పాతపట్టిసీమ గ్రామానికి చెందిన మాదేపల్లి రామకృష్ణవేణి (29) అనే వివాహిత మంగళవారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.
పోలవరం : పోలవరం మండలం పాతపట్టిసీమ గ్రామానికి చెందిన మాదేపల్లి రామకృష్ణవేణి (29) అనే వివాహిత మంగళవారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. రామకృష్ణవేణిని ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులే హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తుండగా.. భర్త, అత్తింటివారు మాత్రం ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టిసీమ గ్రామానికి చెందిన తెలగంశెట్టి రత్నాజీరావు కుమార్తె రామకృష్ణవేణికి పాతపట్టిసీమకు చెందిన మాదేపల్లి ఉపేంద్రకు 10 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఆ సమయంలో రెండెకరాల భూమిని రామకృష్ణవేణి పేరున ఆమె తండ్రి స్త్రీధనంగా రాశా రు.
వీరికి 7, 5 సంవత్సరాల వయసు గల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇదిలావుండగా, రామకృష్ణవేణి పేరిట ఉన్న రెండెకరాల భూమిని విక్రయిం చేందుకు నిర్ణయించుకున్న భర్త ఉపేంద్ర ఈ విషయమై తరచూ ఆమెను ఒత్తిడి చేస్తున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందుకు రామకృష్ణవేణి అంగీకరించకపోవడంతో భర్త, ఆమె కుటుంబ సభ్యులు చిత్రహింసలకు గురిచేస్తుండేవారని చెప్పారు. మంగళవారం కూడా చిత్రహింసలకు గురిచేసిన భర్త, అతని కుటుంబ సభ్యులు చివరకు తమ కుమార్తెను గొంతునులిమి చంపేశారని ఆరోపించారు.
మృతురాలి మెడపై కమిలిన గుర్తులు ఉన్నాయి. ఘటన జరిగిన సమయంలో టీవీ శబ్దాలు పెద్దగా వినిపించాయని, అదే సందర్భంలో మృతురాలి కేకలు కూడా వినిపించాయని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఆ తరువాత అత్తింటి వారు ఆర్‌ఎంపీ వైద్యుడిని పిలిపించి హడావుడి చేశారని, చుట్టుపక్కల వారు రావడంతో విషయం బయటకు పొక్కిందని స్థానికులు చెబుతున్నారు. మృతురాలి తండ్రి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలవరం ఇన్‌చార్జి సీఐ ఎం.అంబికాప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్సై టి.వెంకటసురేష్ కేసు దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు.