అంతంతమాత్రమే | Suggest that the development of infrastucture for godawari puskaralu | Sakshi
Sakshi News home page

అంతంతమాత్రమే

Aug 20 2014 2:30 AM | Updated on Mar 21 2019 8:35 PM

వచ్చే ఏడాది జరగబోయే గోదావరి పుష్కరాలపై పాలకులు చేసిన, చేస్తున్న వ్యాఖ్యలివి. ఈ హడావిడి చూసి జిల్లా జనం ఔరా అనుకున్నారు.

పుష్కరాలు వస్తున్నాయంటే ఇక్కడి ప్రజలు ఎంతో సంబరపడిపోతారు. గుళ్లూ గోపురాల్లో పండగ సందడి నెలకొంటుందని, ఎక్కడెక్కడో నివసిస్తున్న చుట్టాలొస్తారనేది ఒకటైతే, ఊరు కొంతైనా బాగుపడుతుందనేది మరో ప్రధాన కారణం. ప్రజాప్రతినిధులు ఏర్పాట్ల గురించి ఎంత గొప్పగా చెబుతున్నా ఈసారి పుష్కరాలను ‘మరమ్మతుల’ స్థాయిలోనే కానిచ్చేద్దామని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తుండడం ప్రజల ఆశలపై నీళ్లు కుమ్మరించినట్టుగా ఉంది.
 
సాక్షి, రాజమండ్రి : వచ్చే ఏడాది జరగబోయే గోదావరి పుష్కరాలపై పాలకులు చేసిన, చేస్తున్న వ్యాఖ్యలివి. ఈ హడావిడి చూసి జిల్లా జనం ఔరా అనుకున్నారు. ఈ పుష్కరాలు రాజమండ్రి చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతాయనుకున్నారు. ప్రభుత్వ చేతలు చూస్తే మాత్రం అంత సీన్ లేదని స్పష్టమవుతోంది. కుంభమేళా అంటే పుష్కరాల కన్నా చవకగా జరిగి పోతాయనుకున్నారేమో అని జనం పెదవి విరుస్తున్నారు.
 
కేవలం సదుపాయాలే..

పుష్కరాల పేరు చెప్పి రాజమండ్రికి శాశ్వత ప్రయోజనం చేకూరుతుందని ప్రజలు ఆశ పడ్డారు. రోడ్లు మెరుగుపడతాయని సంబరపడ్డారు. కానీ ఎక్కడా, ఏ విధమైన కొత్త నిర్మాణాలకు తావు లేదంటూ అధికారులకు కలెక్టర్ సంకేతాలిచ్చారు. రోడ్లు కూడా కేవలం మరమ్మతులతో సరిపుచ్చాలని కలెక్టర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. కొత్త ఘాట్ల నిర్మాణాల కన్నా, పాతవాటిని అభివృద్ధి చేసేందుకే ప్రాధాన్యమివ్వాలని సూచించినట్టు సమాచారం. తొలుత భారీ నిర్మాణాలను చేపట్టకుండా, పుష్కరాల సమయంలో భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లపైనే వివిధ శాఖల అధికారులు దృష్టి పెట్టాలన్నదే కలెక్టర్ సూచనల సారాంశం.
 
వీవీఐపీ ఘాట్ అనుమానమే..
ప్రధానితో పుష్కరాలు ప్రారంభింపజేస్తామని మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా వీవీఐపీ ఘాట్ నిర్మించాల్సి ఉందని అధికారులు భావించారు. ఇందుకు ఇరిగేషన్ అధికారులు కూడా సుమారు రూ.77 కోట్లతో ఘాట్ల అభివృద్ధి, కొత్త వాటి నిర్మాణాలకు ప్రతిపాదించారు. రూ.30 కోట్లతో గట్టు రోడ్ల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు చేశారు. తొమ్మిది కొత్త ఘాట్లు కూడా అవసరమన్నది వారి అంచనా. వీవీఐపీ ఘాట్ కోసం ముందుగా కాతేరు శివారులో గోదావరి గట్టున స్థల పరిశీలన చేసిన అధికారులు, చివరకు ధవళేశ్వరంలో ఇరిగేషన్ గెస్ట్‌హౌస్ సమీపంలో నిర్మించాలని నిర్ణయించారు. రెండు రోజుల క్రితం రాజమండ్రి వచ్చిన కలెక్టర్ కొత్త ఘాట్ల నిర్మాణం కన్నా, అందుబాటులో ఉన్న వాటినే అభివృద్ధి చేసుకోవడం మేలని అధికారులకు సూచించినట్టు తెలిసింది. దీంతో ఈ సారి కూడా గౌతమ ఘాట్‌నే వీవీఐపీ ఘాట్‌గా వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
నగరాభివృద్ధిపై ‘అనుమాన’ నీడలు
ఆధ్యాత్మిక రాజధానిగా భాసిల్లుతున్న రాజ మండ్రిలో ‘పుష్కరాల’ అభివృద్ధి వెల్లివిరుస్తుందని ప్రజలు భావించగా, ఈ వంకతో భారీగా పనులు ఉంటాయని కార్పొరేటర్లు ఆశపడ్డారు. ఇప్పుడు పుష్కర పనుల్లో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు నిమిత్తమాత్రులు కాగా, మంత్రుల కమిటీ పర్యవేక్షణలో సూక్ష్మంలో మోక్షాన్ని ప్రసాదించే మార్గాలు అన్వేషిస్తున్నారు. రూ.100 కోట్ల టోకెన్ గ్రాంటులోనే పనులు చేయాలని యోచిస్తున్నారు. రాజమండ్రి గౌతమ ఘాట్ సమీపంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో పుష్కరాలకు గుర్తుగా రూ.4 కోట్లతో ఓ కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తామని గతంలో ఆర్థిక మంత్రి, ఇటీవల కలెక్టర్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement