బోధనకు యాతన

Subject Teachers Shortage In High Schools Guntur - Sakshi

ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత

జిల్లాలో ఖాళీగా ఉన్న 680 పోస్టులు

తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు

గుంటూరు ఎడ్యుకేషన్‌: జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ పోస్టులు ఖాళీగా ఉండటంతో బోధనకు ఆటంకంగా మారింది. సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులతో భర్తీ చేయాల్సిన ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. ప్రతి నెలా పదవీ విరమణలతో ఖాళీ అవుతున్న పోస్టుల్ని ఎప్పటికప్పుడు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. ఈ ప్రక్రియ జిల్లాలో గత 15 నెలలుగా నిలిచిపోవడంతో ఉపాధ్యాయ ఖాళీలు పెద్ద సంఖ్యలో పేరుకుపోయాయి. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల పరిధిలో 561 పోస్టులు, ప్రాథమిక పాఠశాలల పరిధిలో 63 ప్రధానోపాధ్యాయ, 33 ఎస్జీటీ పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంది. దీంతో పాటు ఉన్నత పాఠశాలల్లో 23 ప్ర«ధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఉమ్మడి సర్వీసు రూల్స్‌ సాకుతో బ్రేక్‌
ఉమ్మడి సర్వీసు రూల్స్‌ అమలు ప్రభావంతో ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయుల మధ్య తలెత్తిన విభేదాలతో న్యాయస్థానాల్లో ఉన్న కేసులను సాకుగా చూపుతున్న ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియ చేటప్టడం లేదు. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరుచుకోవడంతో నేటికీ పూర్తిస్థాయిలో విద్యా బోధన జరగడం లేదు. సైన్స్, సోషల్, మాథ్స్‌ సబ్జెక్టులతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషా సబ్జెక్టులు, ఫిజికల్‌ డైరెక్టర్‌  పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కోర్టు తదుపరి ఉత్తర్వులకు లోబడి అడ్‌హక్‌ పద్ధతిలో పదోన్నతులు కల్పించేందుకు అవకాశం ఉన్నప్పటికీ విద్యాశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నారు.

ఐదు ఎడ్యుకేషన్‌ డివిజన్లలో టీచర్ల కొరత
జిల్లాలోని గుంటూరు, తెనాలి, బాపట్ల, నరసరావుపేట, సత్తెనపల్లి డివిజన్ల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత నెలకొంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని పాఠశాలల్లో ఖాళీలు అధికంగా ఉన్నాయి. గతంలో జరిగిన పదోన్నతుల కౌన్సెలింగ్‌లో పల్నాడు ప్రాంతం నుంచి పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు గుంటూరు, తెనాలి, బాపట్ల డివిజన్లలోని పాఠశాలలకు రావడంతో అక్కడ ఖాళీలు పేరుకుపోయాయి. ఉదాహరణకు బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు జెడ్పీ హైస్కూల్లో గణితం బోధించేందుకు ఉపాధ్యాయుడే లేరు. వెల్దుర్తి మండలం, నూజెండ్ల, ఈపూరు మండలాల్లోని పాఠశాలల్లో ఖాళీలు పేరుకుపోయాయి.

బోధనకు తీవ్ర ఆటంకం
సర్వీసు రూల్స్‌ అమల్లో నెలకొన్న వివాదాలతో పదోన్నతులు చేపట్టకపోవడం సరికాదు. విద్యా బోధనకు తీవ్ర ఆటంకంగా మారడంతో అడ్‌హక్‌ పద్ధతిలో అయినా పదోన్నతులు చేపట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి. పాఠశాలలు ప్రారంభమైన పరిస్థితుల్లో ప్రభుత్వం దీనిపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలి.వి.వి.శ్రీనివాసరావు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top