ఆర్టీసీలో సమ్మె సైరన్‌

Strike Siren in the RTC - Sakshi

యాజమాన్యంతో చర్చలు విఫలం.. ఫిట్‌మెంట్‌పై పట్టువీడని ఉద్యోగులు 

20 శాతానికి మించి ఇవ్వబోమంటున్న యాజమాన్యం.. సమ్మె తేదీలపై నేడు ప్రకటన

సాక్షి, అమరావతి: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో(ఏపీఎస్‌ఆర్టీసీ) సమ్మె సైరన్‌ మోగనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు సై అంటున్నారు. సమ్మె తేదీలను బుధవారం ప్రకటిం చాలని నిర్ణయించారు. మంగళవారం విజయవాడలో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు, ఈడీలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మెకు సిద్ధమవు తున్నామని చర్చల అనంతరం ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైవీ రావు, పలిశెట్టి దామోదరరావు మీడియాకు తెలియచేశారు. 

కార్మికులను రెచ్చగొట్టేలా యాజమాన్యం నిర్ణయాలు 
ఫిట్‌మెంట్‌ 50 శాతం ఇవ్వాలని తాము కోరుతుండగా, 20 శాతానికి మించి ఇచ్చేది లేదంటూ ఆర్టీసీ యాజమాన్యం మొండికేయడాన్ని ఉద్యోగులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఏపీఎస్‌ ఆర్టీసీలో నష్టాలకు ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలే కారణమని, నష్టాలు, అప్పులను ప్రభుత్వమే భరించాలని ఉద్యోగులు తేల్చిచెబుతున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల కంటే కేటగిరీల వారీగా 20 నుంచి 30 శాతం తక్కువ జీతభత్యాలతో పనిచేస్తున్నామని, అయినా సర్కారు తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. వేతన సవరణలో ఉన్న డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే ఆర్టీసీలోని ఎనిమిది సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడ్డాయని, ఎన్‌ఎంయూని కూడా కలుపుకుని ముందుకు వెళ్తామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.

జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం సమ్మె తేదీని ప్రకటించేందుకు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో చేపట్టబోయే సమ్మె సన్నాహక షెడ్యూల్‌ను కూడా ప్రకటించాలని నిర్ణయించారు. యాజమాన్యం ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు సంస్థలో సిబ్బందిని కుదించేలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని నేతలు ఆరోపిస్తున్నారు. సెక్యూరిటీ, సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో సిబ్బందిని తగ్గించడం, యూనియన్‌కు ఇచ్చే రాయితీలను రద్దు చేయడం వంటి చర్యలు కార్మికులను రెచ్చగొట్టేలా ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ తదితర డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందించకపోతే సమ్మె తప్పదని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మంగళవారం జరిగిన చర్చల్లో ఎంప్లాయీస్‌ యూనియన్‌ పే కమిటీ సభ్యులు వైవీ రావు, ఎం హనుమంతరావు, పి.సుబ్రహ్మణ్యం రాజు, ఆవుల ప్రభాకర్, జీవీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top