రెండు ప్రాణాలను రక్షించిన సమయస్పూర్తి..

Stranger Saved Two Young Man Fall In Reservoir In Guntur District - Sakshi

బైక్‌ సహా కాల్వలో పడిన ఇద్దరు యువకులు

తన లుంగీనే తాడుగా మలిచి ఓ రైతు కాపాడే యత్నం

అది అందక యువకుల హాహాకారాలు

అంతలో ఒంటిపైనున్న తన చీరనే తీసిచ్చిన కూలీ 

లుంగీ, చీర సాయంతో బతికిబయటపడ్డ యువకులు

రైతు, మహిళా కూలీ తెగువకు అభినందనలు 

ఈపూరు(వినుకొండ): ఎదురుగా నీళ్లలో ఇద్దరు యువకులు కొట్టుకుపోతున్నారు.. వారిని కాపాడాలి.. చేతిలో ఏమీ లేదు.. మరేం ఆలోచించకుండా తను కట్టుకున్న లుంగీనే తీసి వారికోసం కాల్వలోకి విసిరాడు. అది వారికి అందలేదు.. అంతలోనే ఓ మహిళా కూలీ వచ్చి తను కట్టుకున్న చీరనే తీసిచ్చింది.. లుంగీ, చీరను ముడివేసి వాటిసాయంతో ఆ ఇద్దరు యువకుల ప్రాణాలు నిలిపారు. గుంటూరు జిల్లా ఈపూరు మండలంలో గురువారం జరిగిన ఈ ఘటన మనుషుల్లో ఇంకా బతికి ఉన్న మానవత్వానికి ప్రతీకలా నిలిచింది. శావల్యాపురం మండలం వేల్పూరుకు చెందిన గుంటుపల్లి శివశంకర్, శివసాయికిరణ్‌ అన్నదమ్ములు. 

ఇద్దరూ బైక్‌పై వెళుతుండగా బొగ్గరం సమీపంలో వాహనం అదుపుతప్పి అద్దంకి బ్రాంచ్‌ కెనాల్లో పడిపోయారు. అక్కడే పొలం పనులు చేసుకుంటున్న చేకూరి వెంకటనర్సయ్య  హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నాడు. వారిని కాపాడేందుకు చేతిలో ఏమీ లేకపోవడంతో తన లుంగీనే తీసి వారికి అందించాడు. అయినా అది వారి చేతికి అందలేదు. అటుగా మిర్చి కోతకు వెళుతూ ఆటోల నుంచి దిగిన ఓ మహిళా కూలీ.. ఇది గమనించి తన ఒంటిపై ఉన్న చీరను కూడా ఇవ్వడంతో రెండింటి సాయంతో అతికష్టం మీద వారిని బయటకు తీసి వారి ప్రాణాలను రక్షించారు. అనంతరం స్థానికులు బైక్‌ను బయటకు తీశారు. రెండు ప్రాణాలు కాపాడేందుకు రైతు, మహిళా కూలీ తెగువను.. సమయ స్ఫూర్తిని గ్రామస్తులు అభినందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top