ట్రావెల్స్ బస్సులపై దాడులు ఆపండి | stop the attacks on travels buses | Sakshi
Sakshi News home page

ట్రావెల్స్ బస్సులపై దాడులు ఆపండి

Jan 25 2014 1:06 AM | Updated on Sep 2 2017 2:57 AM

ప్రైవేటు ట్రావెల్స్‌పై అక్రమ దాడులను వెంటనే నిలిపివేయాలని ట్రావెల్స్‌లో పనిచేస్తున్న కార్మికులు డిమాండ్‌చేశారు.

అరండల్‌పేట (గుంటూరు), న్యూస్‌లైన్: ప్రైవేటు ట్రావెల్స్‌పై అక్రమ దాడులను వెంటనే నిలిపివేయాలని ట్రావెల్స్‌లో పనిచేస్తున్న కార్మికులు డిమాండ్‌చేశారు. అక్రమ దాడులతో వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీవో కార్యాలయం ఎదుట కార్మికులు, నిర్వాహకులు ధర్నా చేశారు. బస్సులతోసహా వచ్చి నిరసన వ్యక్తం చేశారు.

 కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని, తమ జీవనోపాధికి గండి కొట్టవద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ట్రావెల్స్ అసోసియేషన్ నాయకులు సాంబశివరావు, శ్రీనివాసరావులు మాట్లాడుతూ ప్రతిరోజూ ప్రైవేటు ట్రావెల్స్‌పై దాడులు చేస్తున్నారని, దీంతో కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో సుమారు 500 కుటుంబాల వరకు ఈ ట్రావెల్స్‌పై జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. రవాణాశాఖ  అధికారుల తీరుతో తమకు ఉపాధి ఉండడం లేదన్నారు.

 ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని డిమాండ్‌చేశారు. ఈ రంగంలో అనేక మంది మెకానిక్‌లు, క్లీనర్లు, సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. అనంతరం డీటీసీ సుందర్‌ను కలిసి తమకు న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.

 కార్మికులకు వైఎస్సార్ సీపీ అండ..
 ట్రావెల్స్ బస్సు కార్మికులు ఆర్టీవో కార్యాలయం వద్ద  చేపట్టిన ధర్నా, నిరసన కార్యక్రమాలకు  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గం కన్వీనర్ నసీర్ అహ్మద్, ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ గులాం రసూల్, ఎస్సీ విభాగం నగర కన్వీనర్ విజయ్‌కిషోర్, పార్టీ నాయకులు జూలూరి హేమంగద గుప్తా, శ్రీకాంత్‌యాదవ్, తిరుపతి తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.

అనంతరం డీటీసీ సుందర్‌తో చర్చలు జరిపారు.  ఈ సందర్బంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ ట్రావెల్స్ బస్సులు ఆపడంతో కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. నగరంలోనే వందల కుటుంబాలు దీనిపై జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిల మధ్య నెలకొన్న వివాదాలకు కార్మికులు, నిర్వాహకులు బలవుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు.  డీటీసీ సుందర్ మాట్లాడుతూ కార్మిక సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని, మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. కార్మికులకు న్యాయం చేయకుంటే ఈనెల  27న మళ్లీ ఆందోళన చేపడతామని నాయకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement