ఆగని నోటీసులు | Stop notices | Sakshi
Sakshi News home page

ఆగని నోటీసులు

Sep 20 2014 1:03 AM | Updated on Jun 4 2019 5:04 PM

ఒకవైపు తీసుకున్న రుణాలు చెల్లించనక్కరలేదని రుణమాఫీ పథకం అమలు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతుంటే మరోపక్క రుణ బకాయిలు చెల్లించకుంటే బంగారు ఆభరణాలు...

  • రైతుల ఆందోళన
  • బ్యాంకు అధికారులతో మాట్లాడిన వైఎస్సార్ సీపీ నేతలు
  • మునగపాక: ఒకవైపు తీసుకున్న రుణాలు చెల్లించనక్కరలేదని రుణమాఫీ పథకం అమలు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతుంటే మరోపక్క రుణ బకాయిలు చెల్లించకుంటే బంగారు ఆభరణాలు వేలం వేస్తామంటూ బ్యాంక్‌లు నోటీసులు జారీ చేస్తున్నాయి. మునగపాకకు చెందిన ఆడారి గోపి వ్యవసాయ పెట్టుబడుల కోసం 21-09-2011న స్థానిక ఎస్‌బీఐ నుంచి బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.45 వేల రుణం తీసుకున్నారు.

    వ్యవసాయం కలిసి రాకపోవడంతో తిరిగి చెల్లించలేకపోయారు. ఎస్‌బీఐ నుంచి గోపికి గురువారం అసలు, వడ్డీ కలిపి రూ. 59,232 ఈ నెల 29లోగా చెల్లించాలని లేకుంటే బంగారు వస్తువులను వేలం వేస్తామంటూ నోటీసు అందింది. అదే గ్రామానికి చెందిన దొడ్డి సత్తిపెంటారావు కూడా 30-07-2008లో మునగపాక ఎస్‌బీఐ నుంచి బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.23 వేలు వ్యవసాయ రుణం తీసుకున్నారు. రెండు దఫాలుగా రూ. పదివేలు చెల్లించారు. ఆయనకు కూడా బ్యాంక్ నుంచి అసలు, వడ్డీ రూ. 38,230 చెల్లించాలంటూ నోటీసు రావడంతో కంగుతిన్నారు. ఈనెల 29లోగా చెల్లించకుంటే వస్తువులను వేలం వేస్తామని చెప్పడంతో ఆవేదన చెందుతున్నారు. తాము రుణం చెల్లించలేని స్థితిలో ఉన్నామని అంటున్నారు.
     
    అధికారులను కలిసిన వైఎస్సార్ సీపీ నేతలు : రైతులకు రుణమాఫీ అమలు చేసేవరకు బ్యాంక్‌లు ఎటువంటి నోటీసులు ఇచ్చినా తమ పార్టీ పోరాటం చేస్తుందని వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. మునగపాకకు చెందిన పలువురు రైతులకు నోటీసులు పంపడంతో శుక్రవారం వారితో కలిసి ఎస్‌బీఐ అధికారులను కలిశారు.

    వ్యవసాయం కలిసిరాక రైతులు ఇబ్బందులు పడుతుంటే వారిపై ఒత్తిడి పెంచడం సరికాదన్నారు. ప్రభుత్వం నుంచి విధి విధానాలు వచ్చే వరకు నోటీసులు రాకుండా చూడాలని కోరారు. లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రైతులు రుణాలు చెల్లిస్తే వారికి కూడా మాఫీ పథకం అమలవుతుందన్నారు. ఈ ఆందోళనలో మునగపాక పీఏసీఎస్ అధ్యక్షుడు టెక్కలి కొండలరావు, వార్డు సభ్యుడు మళ్ల కృష్ణ, రైతులు ఆడారి గోపి, దొడ్డి సత్తి పెంటారావు తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement