ఇప్పటికీ దొరకని ఆ రెండు గ్రామాల రికార్డులు... | Still not found in the records of the two villages | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ దొరకని ఆ రెండు గ్రామాల రికార్డులు...

Sep 14 2014 2:06 AM | Updated on Sep 2 2017 1:19 PM

ఇప్పటికీ దొరకని ఆ రెండు గ్రామాల రికార్డులు...

ఇప్పటికీ దొరకని ఆ రెండు గ్రామాల రికార్డులు...

పార్వతీపురం డివిజన్ కురుపాం మండలంలో ఉపాధి హామీ కింద చేపట్టిన సుమారు కోటిన్నర రూపాయల విలువైన పనులకు సంబంధించిన రికార్డులు ఇప్పటికీ లభ్యం కాలేదు.

పార్వతీపురం/కురుపాం: పార్వతీపురం డివిజన్ కురుపాం మండలంలో ఉపాధి హామీ కింద చేపట్టిన సుమారు కోటిన్నర రూపాయల విలువైన పనులకు సంబంధించిన రికార్డులు ఇప్పటికీ లభ్యం కాలేదు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.8.02 కోట్లు విలువైన పనులు నిర్వహించారు. మండలంలో 23 పంచాయతీ లుండగా 21 పంచాయతీలలో 204 గ్రామాలలో 1920 పనులు చేపట్టారు. వీటిలో పూడిక తీత, గట్లు వేయడం, 690 మందికి ఉపకార వేతనాలు, పలురకాల నిర్మాణాలు, చెక్‌డ్యామ్‌ల ఏర్పాటు, మొక్కలు నాటడం, గోతులు తవ్వడం, నిర్మల్ మరుగుదొడ్ల నిర్మాణం, 52 మందికి ఇన్సూరెన్స్ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అయితే గతంలో రెండు సార్లు వాయిదా పడి, మూడోసారి గత నెల 23న జరిగిన సోషల్ ఆడిట్‌లో రికార్డులు లభ్యమైన 21 పంచాయతీలలో రూ. 6,58,61,097లకు ఆడిట్ నిర్వహించారు. వబ్బంగి, నీలకంఠాపురం పంచాయతీలకు చెందిన దాదాపు రూ.1,43,38,903ల విలువైన పనులకు సంబంధించిన రికార్డులు సోషల్ ఆడిట్ సమయానికి లభ్యం కాకపోవడంతో అప్పట్లో సోషల్ ఆడిట్ జరగలేదు. ఆ రికార్డులు ఇప్పటికీ దొరకలేదు.
 
 అసలు వాళ్లను వదిలేసి...కొసలోళ్లకు శిక్షా...!
 ఈ నేపథ్యంలో దీనికి బాధ్యులుగా చేస్తూ ఇద్దరు ఏపీఓలు...నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లను అధికారులు శుక్రవారం సస్పెన్షన్ చేశారు.   దీనికి సంబంధించి  అసలువారిని వదిలేసి...కొసలోళ్లకు శిక్షా...! అంటూ ఉపాధి సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఫీల్డు అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగిస్తుందనే ప్రకటనతో రికార్డులు పట్టుకుపోయిన ఫీల్డు అసిస్టెంట్లు, సోషల్ ఆడిట్ జరగక ముందు పదోన్నతిపై వెళ్లిన టెక్నికల్ అసిస్టెంట్లు, చెల్లింపుల అనంతరం రికార్డులు భద్రపరచాల్సిన కంప్యూటర్ ఆపరేటర్ కమ్ అక్కౌంట్ అసిస్టెంట్లు, వీటిని నిత్యం పర్యవేక్షించాల్సిన అధికారులపై చర్యలు చేపట్టకుండా...సోషల్ ఆడిట్ రెండు నెలల ముందు వబ్బంగి ఛార్జి తీసుకున్న టెక్నికల్ అసిస్టెంట్ రామకృష్ణపై,  నీలకంఠాపురం పంచాయతీకి చెందిన ఫీల్డు అసిస్టెంట్ రికార్డులు పట్టుకుపోగా, టెక్నికల్ అసిస్టెంట్ అనంతపై వేటు వేయడం సరికాదంటున్నారు. అలాగే బదిలీ, ప్రమోషన్‌పై వెళ్లిపోయిన వారి స్థానాల్లో ఇన్‌ఛార్జులుగా నియమితులైన   వారిని   సస్పెండ్ చేయడం వల్ల వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయంటున్నారు.
 
 రికార్డులిచ్చినా తీసుకోని సోషల్ ఆడిట్ బృందం
 ఇదిలా ఉండగా సోషల్ ఆడిట్ జరుగుతున్న సమయంలోనే ఒక రోజు ఆలస్యంగా జరడ గ్రామానికి చెందిన రికార్డులు ఇచ్చినా సోషల్ ఆడిట్ బృందం తీసుకోలేదని సస్పెన్షన్‌కు గురైన టెక్నికల్ అసిస్టెంట్లు వాపోతున్నారు. సోషల్ ఆడిట్ బృందం కంప్యూటర్‌లో జనరేటైన  మస్తర్ల ద్వారా ఆర్థిక పరమైన లావాదేవీల నిర్వహణ, డెలివెరీ మెకానిజమ్ ఎలా ఉందో...? అనేదానితోపాటు పారదర్శకత కోసం సోషల్ ఆడిట్ నిర్వహించాల్సి వుండగా, వాటిని వదిలేసి, రికార్డులు నిర్వహణ సరిగ్గా ఉం దా...? లేదా...? అనే  ప్రాధాన్యత లేని అంశాలపై దృష్టి సారిస్తోందని ఆరోపిస్తున్నారు. అలాగే జరిగిన పనులు వాటి చెల్లింపులు, కంప్యూటర్‌లో జనరేట్ అయినవి సరిగ్గా జరుగుతున్నాయా...? లేదా...? అనేదానిపై దృష్టిసారించడం లేదని ఉపాధి సిబ్బం ది అంటున్నారు. గ్రామాలలో చిన్న చిన్న సమావేశాలు, సంతకాలకే సోషల్ ఆడిట్‌ను పరిమితమితం చేస్తున్నారంటున్నారు. అంతే గాని ఆర్థిక అవకతవకలపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.  
 
 ఇంతవరకు రికార్డులు అప్పగించలేదు...
 ఈ విషయమై డ్వామా పీడీ ఎం.వి.గోవిందరాజులు వద్ద ప్రస్తావించగా ఇప్పటి వరకు ఆ రెండు పంచాతీలకు చెందిన రికార్డులు అప్పగించలేదని చెప్పారు. రికార్డులు అప్పగించిన వెంటనే సోషల్ ఆడిట్ అధికారులకు లేఖరాస్తామని, వారు ఆడిట్ చేసి, ఎటువంటి అవకతవకలు, ఆరోపణలు లేకపో తే సస్పెన్షన్ ఎత్తేసే విషయం ఆలోచిస్తామని తెలిపా రు. సోషల్ ఆడిట్ సమయానికి ఎవరుంటే వారే బాధ్యులవుతారు. ముందున్న వారి వద్ద నుంచి రికార్డులు తీసుకోవాల్సిన బాధ్యత కొత్తగా ఛార్జి తీసుకున్నవారిపైనే ఉంటుందని పీడీ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement