
ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసినట్లు బయటకు వచ్చిన లేఖ
పార్వతీపురం మహిళా తహసీల్దార్ ఆవేదన
పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బయటకు వచ్చిన లేఖ
సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి ప్రభుత్వంలో అధికారులకు వేధింపులు అధికమయ్యాయి. చిరుద్యోగులే లక్ష్యంగా ప్రారంభమైన వేధింపుల పర్వం.. మండల స్థాయి అధికారులకూ తప్పడం లేదు. పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర తనను వేధిస్తున్నారని, అసభ్య పదజాలంతో ఫోన్లో దూషించారని సాక్షాత్తు ఓ మండల మేజి్రస్టేట్ ఆవేదన వ్యక్తం చేయడం ఉద్యోగ వర్గాలను విస్మయపరుస్తోంది. ‘‘ఈ నెల 15న రాత్రి 21.59 నిమిషాలకు పార్వతీపురం ఎమ్మెల్యే తనకు వాట్సాప్ కాల్ చేసి, మహిళ అని చూడకుండా మాటలకు అందని పదజాలంతో నన్ను దూషించారు’’ అంటూ పార్వతీపురం ఎస్‌ఐకు స్థానిక తహసీల్దార్ వై.జయలక్ష్మి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొంటున్న లేఖ ఒకటి బయటకు రావడం కలకలం రేపుతోంది.
శుక్రవారం మధ్యాహ్నం జిల్లా రెవెన్యూ అధికారి హేమలత, సంయుక్త కలెక్టర్ శోభికలను కలిసి కూడా తన ఆవేదన వినిపించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కలెక్టర్ అందుబాటులో లేకపోవడం.. ఆయన దృష్టిలో పెట్టకుండా ఎటువంటి నిర్ణయమూ తీసుకోకూడదని అధికారులు ఆమెకు నచ్చజెప్పినట్లు తెలిసింది. ఇదే విషయమై తహసీల్దార్ వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టకుండా తాను ఏ విషయమూ బయటకు చెప్పలేనని, తర్వాత తానే పిలిచి చెబుతానని అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరోవైపు విషయం పెద్దది కాకుండా రాజీ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే ఏమంటున్నారంటే..
ఈ ఘటనపై పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర స్పందించారు. తహసీల్దారు మీద అవినీతి ఆరోపణలు రావడం వల్లే అడిగినట్లు చెప్పారు. పార్వతీపురం మండలంలోని ములగ గ్రామానికి చెందిన రైతుల వద్ద నుంచి డిజిటల్ సిగ్నేచర్ కోసం రూ.10 లక్షలు ఆమె డిమాండ్ చేసినట్లు తెలిసిందని, అందులో ఇప్పటికే రూ.2 లక్షలు కూడా తీసుకున్నట్లు పలువురు చెప్పారని తెలిపారు.