అన్నా.. ఎంత అవినీతి!

The State Government Has Ordered An Inquiry Into Corruption In The Anna Canteen - Sakshi

అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ దోపిడి

రేకుల షెడ్లలో ఏర్పాటు 

విచారణకు రాష్ట్రప్రభుత్వం ఆదేశం

సాక్షి, ప్రొద్దుటూరు టౌన్‌ : అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ ప్రభుత్వం దోపిడీకి తెరలేపింది. తమకు నచ్చిన సంస్థకు కాంట్రాక్టును అప్పగించి నిర్మాణ వ్యయాన్ని ఎవ్వరూ ఊహించనంతగా పెంచి రేకుల షెడ్డుకు పైన పీఓబీ, చుట్టూ అద్దాలు, ఏర్పాటు చేసి ఒక్కో క్యాంటీన్‌కు రూ.40 లక్షలు ప్రజాధనాన్ని దోచి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లలో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం అమ్మా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకు కడుపు నిండా భోజనం పెట్టడం టీడీపీ ప్రభుత్వంలోని నాయకులు చూసి వచ్చి నాలుగేళ్ల వరకు వాటి జోలికి వెళ్లలేదు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకు పేదలు గుర్తుకొచ్చారు. తయారు చేసి తీసుకొచ్చిన అన్నం పెట్టేందుకు రూ.లక్ష ఖర్చు చేస్తే షెడ్‌ నిర్మాణం పూర్తవుతుంది. కానీ టీడీపీ నేత కనుసన్నుల్లో ఉన్న నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి అన్న క్యాంటీన్ల నిర్మాణాలను అప్పగించింది. ఇలా టీడీపీ ప్రభుత్వం భారీ అవినీతికి తెరలేపింది. రూ.38.65 లక్షలు ఒక్కో క్యాంటీన్‌ నిర్మాణానికి ఖర్చుచేసేందుకు తీర్మానం చేసింది. అది నాలుగైదు నెలల్లో ఎన్నికలు వస్తాయన్న వినికిడి నేపథ్యంలో జిల్లాలో 11 క్యాంటీన్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. 

అన్న క్యాంటీన్‌ నిర్మాణానికి వినియోగించిన ఇనుప దంతెలు, పైన పటారం, లోన లోటారంలా తయారు చేసిన అన్న క్యాంటీన్‌  

ఇనుప దంతెలపై రేకుల షెడ్డు నిర్మాణం
ఇనుప దంతెలపై రేకులు పరిచి క్యాంటీన్లు నిర్మించారు.సెంటున్నర్ర లోపు స్థలంలో చుట్టూ రంగు రంగుల రేకులతో తీర్చి దిద్దారు. చుట్టూ అద్దాలు వేసి అనవసర ఖర్చుకు పూనుకున్నారు. సిమెంట్‌ స్లాబ్‌తో భారీ భవనం నిర్మించేంత డబ్బులు కాంట్రాక్టర్‌ తీసుకొని రేకుల షెడ్డుకు పీఓబీ ఏర్పాటు చేసి సగానికి పైగా డబ్బు కాజేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. జిల్లా కేంద్రమైన కడప కార్పొరేషన్‌లో పాత మున్సిపల్‌ కార్యాలయం, జెడ్పీ కార్యాలయ ఆవరణం, పాత బస్టాండ్‌లలో, ప్రొద్దుటూరు, రాయచోటి తదితర మున్సిపాలిటీల్లో అన్న క్యాంటీన్లు పూర్తయ్యాయి. స్థలాలు లేని ప్రాంతాల్లో అద్దెకు తీసుకుని అక్కడ స్థల యజమానుల నియమాలకు తలొగ్గి నిర్మిస్తే చివరకు అవి వారికే సొంతం అయ్యేలా నిబంధనలు టీడీపీ ప్రభుత్వం రూపొందించింది. నిలుచుని భోజనం చేసేందుకు ఇంత వ్యయం ఖర్చు చేయాలా అని ప్రజలు ప్రశ్నించినా పట్టించుకోకపోవడం గమనార్హం. అన్న క్యాంటీన్లకు విద్యుత్, వసతులు కల్పించేందుకు మున్సిపాలిటీల నుంచి రూ.2లక్షలు ఖర్చు చేశారు. జిల్లాలో 11 క్యాంటీన్ల నిర్మాణానికి మొత్తం రూ.425.15 లక్షలు ఖర్చు పెట్టేందుకు అంచనాలు సిద్ధం చేశారు. అయితే ప్రొద్దుటూరు, కడప, జమ్మలమడుగులో తదితర మున్సిపాలిటీల్లో వీటిని ప్రారంభించారు. ఏది ఏమైనా టీడీపీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top