వైద్యులు ఇద్దరు.. సేవలు అరకొరే!

Staff Shortage In Tanuku Hospital West Godavari - Sakshi

తణుకు ప్రభుత్వ ఆస్పత్రిలోని జనరల్‌ సర్జరీ విభాగం తీరు

జనరల్‌ సర్జన్‌ను తన రూంలోకి రావద్దంటున్న సీనియర్‌ వైద్యుడు

గంటల తరబడి రోగుల నిరీక్షణ

పశ్చిమగోదావరి, తణుకు అర్బన్‌: వైద్యులు ఇద్దరు.. సేవలు పూజ్యం అన్నట్టుంది తణుకు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలోని జనరల్‌ సర్జరీ విభాగ వైద్యసేవలు. గతంలో తణుకు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రి రాష్ట్ర ఉత్తమ ఆస్పత్రిగా ఐదుసార్లు అవార్డు దక్కించుకోవడంలో జనరల్‌ సర్జరీ విభాగం కీలకపాత్ర పోషించింది. ఐతే ఇటీవల కొన్ని శస్త్రచికిత్సలకే ఈ జనరల్‌ సర్జరీ విభాగం పరిమితమైందని రోగులు ఆరోపిస్తున్నారు. ఏలూరు జిల్లా ఆస్పత్రికి ధీటుగా, జిల్లాలో మిగిలిన ఆస్పత్రులకన్నా మెరుగైన సేవలందించే 100 పడకల తణుకు ఆస్పత్రికి నిత్యం 70కి పైగా జనరల్‌ సర్జన్‌ విభాగ ఓపీకి రోగులు వస్తుంటారు. వీరిలో కొందరికి శస్త్రచికిత్సలు అవసరం ఉండే పరిస్థితి ఉంది. వీరు వైద్య సేవల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడేళ్ల క్రితంతో పోల్చుకుంటే ఈ రెండేళ్లు జనరల్‌ సర్జరీ విభాగంలో 50 శాతం వైద్యసేవలు కుంటుపడ్డాయని తెలుస్తోంది.

ఓపీకే పరిమితం
జనరల్‌ సర్జరీ విభాగంలో రెండేళ్ల నుంచి సీనియర్‌ వైద్యుడు అందుబాటులో ఉండగా, రెండు నెలల క్రితం మరో జనరల్‌ సర్జన్‌ కాంట్రాక్ట్‌ బేసిక్‌పై అందుబాటులోకి వచ్చారు. ఆయనకు పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించే అవకాశం ఇవ్వడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. జనరల్‌ సర్జన్‌ విభాగంలో కూర్చోనివ్వకుండా ఆర్ధోపెడిక్‌ వైద్యుడి ఓపీ విభాగంలో సదరు వైద్యుడిని కూర్చోబెట్టి మందులు రాసిపంపే విధులకే పరిమితం చేశారు. అధికారం ఉన్నా వైద్యాధికారి అలసత్వం కారణంగా జనరల్‌ సర్జన్‌ సేవలు వినియోగంలోకి రావడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారానికి మూడు రోజులు సోమ, బుధ, శుక్ర వారాల్లో మాత్రమే అవుట్‌ పేషెంట్స్‌ చూస్తుండగా మిగిలిన రోజులు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అదనపు వైద్యుడు ఉన్నప్పటికీ పాతపద్ధతే కొనసాగుతోంది.కొత్త వైద్యుడిని సీనియర్‌ వైద్యుడు తన విభాగంలో కూర్చునేందుకు కూడా ససేమిరా అన్నారని తెలుస్తోంది. సీనియర్‌ వైద్యుడి వైద్య సేవలు కూడా అంతంత మాత్రంగానే అందుతున్నాయని, ఒక మోస్తరు కేసులు తప్ప పెద్ద కేసులు జాయిన్‌ చేయరని వైద్యవర్గాలు, రోగులు చెబుతున్నారు.

శస్త్రచికిత్సలివి
శస్త్ర చికిత్సల విభాగంలో పసరతిత్తి తొలగింపు, థైరాయిడ్, 24 గంటల నొప్పి (అపెండిసైటీస్‌) హెర్నియా, హైడ్రోసిల్, ఫైల్స్, కణితులు వంటి శస్త్ర చికిత్సలు గతంలో పెద్ద ఎత్తున జరిగేవి. ప్రస్తుతం పసరతిత్తి తొలగింపు, థైరాయిడ్‌ కేసుల్లో శస్త్ర చికిత్సలు పూర్తిగా నిలిచిపోగా అపెండిసైటీస్‌ అడపాదడపా మాత్రమే చేస్తున్న దుస్థితి. ప్రస్తుతం ఈ శస్త్ర చికిత్సలకు రోగులను కాకినాడ, ఏలూరు రిఫరల్‌ చేస్తుండగా, కొన్ని కేసుల్లో బీపీ, తదితర కారణాలు చూపించి శస్త్ర చికిత్సలు వాయిదా వేస్తుండడంతో ప్రైవేటు వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఎన్టీఆర్‌ వైద్యసేవలో చేసే శస్త్ర చికిత్సల్లో వైద్యుడు, సిబ్బందితోపాటు ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి కూడా నిధులు జమవుతాయి. ఇటీవల శస్త్రచికిత్సల కేసులు తగ్గడంతో ఆస్పత్రికి ఆదాయం కూడా తగ్గిన దుస్థితి నెలకొంది.

ఆ వైద్యుడు చేయరు.. వేరొకరిని చేయనివ్వరు
థైరాయిడ్‌తో గొంతువాపు వచ్చి ఇబ్బందులు పడుతున్నాను. ఆరు నెలల క్రితం తణుకు ఆస్పత్రిలో చూపిస్తే కాకినాడ వెళ్లమన్నారు. మా అబ్బాయి హనుమంతు తణుకులోని ఓ ప్రైవేటు వైద్యుడిని బతిమలాడితే ప్రభుత్వ ఆస్పత్రిలో జాయినయితే నేను అక్కడకు వచ్చి ఉచితంగానే ఆపరేషన్‌ చేస్తానని దేవుడిలా వరమిచ్చారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్యుడు నన్ను జాయిన్‌ చేసుకునేందుకు ఒప్పకోలేదు. దీంతో నేను ఇప్పటికీ ఆపరేషన్‌ చేయించుకోలేకపోయాను. ప్రైవేటు వైద్యుడు చేసేది ఈ డాక్టరు ఎందుకు చేయలేరు.– పల్లి పాప, సిద్ధాంతం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top