ఆ ఘనత వైఎస్‌ జగన్‌దే - శిల్పా చక్రపాణిరెడ్డి  

Srisailam MLA Shilpa Chakrapani Reddy Said That Chief Minister YS Jaganmohan Reddy Is Credited With The Doing Sunnipenta Panchayat - Sakshi

35 ఏళ్లలో కానిది 15 రోజుల్లో చేశారు 

అప్పట్లో నైతిక విలువలకు కట్టుబడే ఎమ్మెల్సీకి రాజీనామా  

అసెంబ్లీలో తొలి స్పీచ్‌తోనే ఆకట్టుకున్న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి  

సాక్షి, కర్నూలు: సున్నిపెంటను పంచాయతీ చేసిన ఘనత ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. 35 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్న బుడ్డా, ఏరాసు కుటుంబాలు   చేయలేని పనిని  తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన కొద్దిరోజుల్లోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సాధించగలిగానన్నారు.  ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత ఆయన తొలిసారిగా అసెంబ్లీలో ప్రసంగించారు. శ్రీశైలం నియోజకవర్గంలోని సున్ని పెంటలో 1964 నుంచి  35 వేల మంది జీవనం గడుపుతున్నా  పంచాయతీగా మార్చలేదన్నారు. ఈ విషయాన్ని 10 రోజుల క్రితం అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లితే వెంటనే అధికారులతో కమిటీ వేశారన్నారు. ఆ కమిటీ 15 రోజుల్లోనే సున్ని పెంటను నగర పంచాయతీ చేస్తూ తీర్మానం చేయడంతో అక్కడి ప్రజలు ముఖ్యమంత్రి ఫొటో పెట్టుకుని పూజించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే శ్రీశైలం, సున్నిపెంట పక్కనే ప్రాజెక్టు ఉన్నా తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,  సమీపంలో ఉండే చెంచు గూడెలకు సైతం నీటి వసతి లేదన్నారు. నీటి సదుపాయం కల్పనకు రూ.7 కోట్లు మంజూరు చేయాలని, అలాగే  సున్నిపెంటలో నివాసం ఉంటున్న 5,800 మంది ఇళ్లను రెగ్యులరైజేషన్‌ చేయాలని ఆయన అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర మంత్రులను కోరారు.  

నైతిక విలువలకు కట్టుబడే అప్పట్లో ఎమ్మెల్సీకి రాజీనామా 
‘నంద్యాల ఉప ఎన్నికల సమయంలో మా అన్న శిల్పా మోహన్‌రెడ్డి కోసం వైఎస్‌ఆర్‌సీపీలోకి రావాలని నిర్ణయం తీసుకున్నా. అయితే పార్టీలోకి రావాలంటే నైతిక విలువలకు కట్టుబడి ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. దీనిపై కొన్ని నిమిషాలు ఆలోచించి వెంటనే ఆయన   నిర్ణయమే మంచిదని ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల పదవీకాలాన్ని వదులుకున్నా’నని  శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సగర్వంగా అసెంబ్లీలో చెప్పారు.  వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను తీసుకుంటే ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవని అప్పట్లో చంద్రబాబునాయుడుకు చెప్పినా వినలేదన్నారు. దాని వల్లే ఆయనకు ఈ దుస్థితి వచ్చిందన్నారు.    ఫిరాయింపుల్లో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి విలువలకు నీళ్లొదిలార న్నారు. మనం చేసిన చట్టాలను మనమే చుట్టాలుగా చేసుకుంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధానికి కఠిన చట్టాలు చేయాలని ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు.  

శిల్పాను ప్రశంసించిన స్పీకర్‌  
మీరంటే రాష్ట్రంలో  తెలియని వారు ఉండరని, మీరు నైతిక విలువలను పాటించే వ్యక్తి అని శిల్పా చక్రపాణిరెడ్డిపై అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశంసలు కురిపించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తరువాతే వైఎస్‌ఆర్‌సీపీలో చేరారని కితాబు ఇచ్చారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top