నేడు పట్టాలెక్కనున్న ప్రత్యేక రైళ్లు

Special Trains to take off from 01-06-2020 - Sakshi

విజయవాడ మీదుగా 14 రైళ్లు.. ప్రయాణికులకు హెల్త్‌ ప్రొటోకాల్‌ జారీ చేసిన రైల్వే శాఖ

సాక్షి, అమరావతి: నేటి నుంచి (సోమవారం) పరిమిత సంఖ్యలో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. దేశవ్యాప్తంగా 200 రైళ్లను పునఃప్రారంభిస్తుండటంతో రైల్వే శాఖ ప్రయాణికులకు హెల్త్‌ ప్రొటోకాల్‌ జారీ చేసింది. విజయవాడ మీదుగా 14 రైళ్లు నడపనున్నారు. ముంబై, భువనేశ్వర్, చెన్పై, బెంగళూరు, ఢిల్లీకి ఈ రైళ్లు నడవనున్నాయి. పది రోజుల కిందటే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏపీకి సంబంధించి 52 రైల్వే స్టేషన్లలో టిక్కెట్‌ కౌంటర్లు ప్రారంభించారు. టిక్కెట్‌ కన్ఫర్మ్‌ అయిన వారినే రైల్వే స్టేషన్‌లోకి అనుమతిస్తారు. 90 నిమిషాల ముందుగా స్టేషన్‌కు చేరుకోవాలి. ఈ ప్రత్యేక రైళ్లను మొత్తం రిజర్వ్‌డ్‌ బోగీలతోనే నడపనున్నారు.
కరోనా కట్టడికి గుంటూరు రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన శానిటైజర్, క్యూలైన్లు 

► సికింద్రాబాద్‌–గుంటూరు, సికింద్రాబాద్‌– హౌరాకు ప్రతి రోజూ రైళ్లను నడపనున్నారు. తిరుపతి–నిజాముద్దీన్‌కు రైలును నడపనుంది. 
► విశాఖ– న్యూఢిల్లీ, హౌరా–యశ్వంత్‌పూర్‌కు ఫాస్ట్‌ రైళ్లను నడపనున్నారు.
► స్టేషన్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరి. అనారోగ్య లక్షణాలుంటే ప్రయాణానికి అనుమతించరు. తక్కువలగేజీతో రావాలని రైల్వే సూచిస్తోంది.
► రైలు బయలుదేరే సమయానికి నాలుగు గంటల ముందు మొదటి చార్ట్, రెండు గంటల ముందు రెండో చార్ట్‌ను విడుదల చేయనుంది. 
► దీర్ఘకాల వ్యాధులున్న వారు, పదేళ్లలోపు, 65 ఏళ్లు పైబడిన వారు అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయవద్దని రైల్వే శాఖ కోరింది. 
► ప్రయాణం ముగిసే వరకు మాస్క్‌ తప్పనిసరి. గమ్యస్థానానికి చేరిన తర్వాత సంబంధిత రాష్ట్రం జారీ చేసిన హెల్త్‌ ప్రొటోకాల్‌ను పాటించాలి.

ఏపీలో 18 రైల్వేస్టేషన్లలోనే హెల్త్‌ ప్రొటోకాల్‌ 
రైల్వేకు అభ్యర్థన: కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణబాబు  
ఏపీలో 18 రైల్వే స్టేషన్లలోనే హెల్త్‌ ప్రోటోకాల్‌ అనుసరిస్తామని కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. సోమవారం ఏపీ మీదుగా 22 రైళ్లు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయని, రైల్వే సాధారణ షెడ్యూల్‌ ప్రకారం 71 స్టాపులను ఇచ్చిందన్నారు. అయితే ఇన్ని స్టాప్‌లలో ప్రయాణికులకు హెల్త్‌ ప్రొటోకాల్‌ అనుసరించడం కష్టమని, ప్రతి జిల్లాకు ఒక స్టాప్‌ను మాత్రమే పరిమితం చేయాలని రైల్వేను అభ్యర్థించినట్లు చెప్పారు. ఆదివారం రాత్రి ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అధిక ప్రమాదం ఉన్న చెన్నై, ముంబై, గుజరాత్, రాజస్తాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ల నుంచి వచ్చే ప్రయాణికులందరినీ ఏడు రోజులు క్వారంటైన్‌ చేసి ఆ తర్వాత హోం క్వారంటైన్‌కు పంపుతామన్నారు. వీరిలో 5 శాతం మందికి స్వాబ్‌ పరీక్షలు జరుపుతామని చెప్పారు. ఏపీలో హెల్త్‌ ప్రొటోకాల్‌ అనుసరించే 18 స్టేషన్ల జాబితాను రైల్వే బోర్డుకు పంపినట్లు తెలిపారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top