అమ్ము, పూర్విక.. ఓ మంచి నాన్న

Special Story About Girl How Affection With Cows Calf In Palamaneru, Chittoor - Sakshi

తమ ఇంట ఉన్న ఆవు..దూడకు జన్మనివ్వడంతో ఓ చిట్టితల్లి దాని సంరక్షణ చూసుకుంటూ అనుబంధం పెంచుకుంది. అయితే పాల ఆదాయం తగ్గిపోతోందని ఆ చిట్టితల్లి తండ్రి ఆ దూడను ఓ కసాయికి అమ్మేశాడు. ఎంతగా ఏడ్చి మొత్తుకున్నా తండ్రి నిర్దయగా వ్యవహరించడంతో ఆ చిట్టితల్లి పొగిలి..పొగిలి ఏడ్చింది. అయినా తండ్రి కరకగపోవడంతో అన్నపానీయాలు ముట్టకుండా గాంధీగిరితో నిరసన వ్యక్తం చేసింది. దీంతో ఊరంతా కదిలి ఆ ఇంటి ముందు వాలింది. తలో మాట అనడంతో ఇక లాభం లేదని ఆ చిట్టితల్లి తండ్రి కసాయి వద్దకు పరుగులు తీశాడు. దూడతో చిట్టితల్లి ముందు ప్రత్యక్షమయ్యాడు. అంతే..ఆ చిట్టితల్లి కళ్లల్లో వెలుగులు! గ్రామస్తుల మోముల్లో నవ్వులు!!

సాక్షి, పలమనేరు : మండలంలోని పెంగరగుంటకు చెందిన నారాయణప్ప పాడి ఆవులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె గ్రామ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి, చిన్నకుమార్తె పూర్విక 3వ తరగతి చదువుతున్నారు. ఇంట ఉన్న రెండు ఆవుల్లో ఒక ఆవు 5 నెలల క్రితం ఓ లేగదూడకు జన్మనిచ్చింది. రెండు పూటలా కలిపి ఈ ఆవు 14 లీటర్ల పాలిచ్చేది. ఈ పాలను నారాయణప్ప ఒక ప్రైవేటు డెయిరీకి పోసేవాడు. ఇక దూడ పుట్టినప్పటి నుంచి పూర్వికకు దానితోటే లోకం. స్కూలుకు వెళ్లి వస్తే సాయంత్రం నుంచి దానితోనే ముచ్చట్లు. గడ్డి పెట్టడం, నీళ్లు పట్టడం..ఆడుకోవడం చేసేది. ఇలా దానితో అనుబంధం బాగా పెంచుకుంది.

దీనికితోడు మూడో తరగతి తెలుగు వాచకంలోని ‘పెంపుడు జంతువులు’ పాఠం ప్రభావం కూడా ఆ చిట్టితల్లిపై పడింది. పెంపుడు జంతువులు కూడా కుటుంబ సభ్యులతో సమానమని, పెంపుడు జంతువుల్లో ఆవు–దూడ గురించి కూడా టీచర్‌ చెప్పి ఉండడంతో దూడ కూడా తమ కుటుంబంలో ఒకదానిగా పూర్విక భావించింది. దానికో ముద్దు పేరు కూడా పెట్టుకుంది ‘అమ్ము’ అని! ఇక పాడి ఆవు రెండు పూటలా కలిపి 14 లీటర్ల పాలు ఇచ్చేది. ఉదయం, సాయంత్రం రెండేసి లీటర్ల చొప్పున దూడ తాగేస్తుండడంతో పాల ఆదాయం పడిపోతోందని నారాయణప్ప భావించాడు. దీనిని అమ్మేస్తే నెలకు మూడు వేల రూపాయల వరకు పాల ఆదాయం నష్టపోయే పరిస్థితి ఉండదని తలచాడు. అనుకున్నదే తడవుగా 5 నెలల వయసున్న దూడను పలమనేరులోని ఓ కసాయి అమ్మేయడంతో అతనొచ్చి దూడను పట్టుకుపోతుంటే పూర్విక అడ్డుకుంది. అమ్మును అమ్మడానికి వీల్లేదంటూ గొడవ చేసింది.

అవేవీ పట్టించుకోకుండా ఆ చిట్టితల్లి తండ్రి ఉదయం 9 గంటల సమయంలో కసాయికి అప్పగించడంతో దానిని పట్టుకుపోయాడు. దీంతో కడుపు మండిన ఆ చిన్నారి ఉదయం నుంచి అన్నం తినకుండా ఏడవడం మొదలు పెట్టింది. ఎవరూ సముదాయించినా ఏడుపు మానలేదు. దీంతో ఊరి జనం కూడా ఇంటి ముందు గుమిగూడారు. ఓవైపు కన్నకూతురి ఏడుపు, మరోవైపు దూడ కనిపించక ఆవు దీనంగా అరుస్తుండడంతో ఆ చిన్నారి తల్లి లక్ష్మి మనసు కరిగింది. బిడ్డ కోసం దూడను తీసుకురమ్మంటూ భర్తను ప్రాధేయపడింది. ఇక గ్రామస్తులు కూడా హితోక్తులు పలకడంతో నారాయణప్ప ఇక లాభం లేదని పలమనేరుకు వెళ్లాడు. సాయంత్రం  4.30 గంటలకు లగేజి ఆటోలో తెచ్చిన దూడతో ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు.

అంతే! ‘అమ్మూ...అని గట్టిగా అరుస్తూ పూర్విక దాని దగ్గరకు పరుగులు తీసింది. గ్రామస్తులు కూడా ‘అబ్బా! ఈ చిన్నపిల్లకు దూడ అంటే ఎంతిష్టమో..ఎంత ప్రేమో. భలే గట్టిది..మొత్తానికి సోమవారం టౌనులో పండక్కి దూడ కోతకు కాకుండా కాపాడింది’’ అని మెచ్చుకుంటూ గ్రామస్తులు వెనుదిరిగారు. ‘అమ్ము’ను భారమనుకుంటే ఎవరికైనా ఇచ్చేద్దామంటూ స్థానిక అంజనాద్రి ఆలయం వద్దనున్న గోసంరక్షణా కేంద్రానికి తండ్రిని తీసుకెళ్లి పూర్విక తనే అప్పగించింది. నేను అప్పుడప్పుడూ వస్తాననంటూ దూడకు టాటా చెబుతూ సంతోషంగా ఇంటికి చేరింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top