భరతమాతకు ట్రిపుల్‌ సెల్యూట్‌

Special Story About 3 IIIT Students Of Nuziveedu Serving For Indian Military Service - Sakshi

ఈ ముగ్గురి నేపథ్యం.. అతి సాధారణం. కష్టాలకు ఎదురొడ్డుతూనే ‘పది’లో సత్తా చాటారు. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించి తమ కలల సాకారం వైపు కదిలారు. ఇంజినీరింగ్‌ విద్యలో నైపుణ్యం చూపి కొలువులను తమ వద్దకు రప్పించారు. అయితే దేశ రక్షణ కంటే తమ కుటుంబం, ఉద్యోగం ఏవీ ఎక్కువ కాదని భావించి, నెలకు లక్షలు తెచ్చిపెట్టే కొలువులను తృణపాయంగా త్యజించి, భరతమాత సేవలో పునీతులవుతున్నారు..
సాక్షి, నూజివీడు : ముగ్గురూ అతి సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారే. చదువులో ప్రతిభ చాటి నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. భారీ వేతనాలతో కూడిన ఉన్నత ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చినా కాదనుకున్నారు. దేశ రక్షణలో తాము భాగస్వాములు కావాలనే లక్ష్యంతో సైన్యంలో చేరి కెప్టెన్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ ముగ్గురు వీరులు.. మహాధీరులై భరత మాత సేవలో పునీతులవుతున్నారు. ఆర్మీలో కెప్టెన్లుగా సేవలందిస్తున్న వారి నేపథ్యాన్ని ఓసారి పరికిస్తే..

కూలీ కొడుకు.. ఆర్మీ కెప్టెన్‌
బర్నాన యాదగిరి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని శేఖరపురం. తండ్రి గురవయ్య హైదరాబాద్‌లోని సిమెంట్‌ ఫ్యాక్టరీలో దినసరి కూలీ కాగా, తల్లి తులసమ్మ పోలియో వల్ల ఇంటివద్దే ఉంటోంది. యాదగిరి పదో తరగతిలో 94.5 శాతం మార్కులతో ఉత్తీర్ణుడై, 2008 ఫస్ట్‌బ్యాచ్‌లో ట్రిపుల్‌ ఐటీలో చేరాడు. 83.4 శాతం మార్కులతో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు.

అనంతరం టెక్‌ మహేంద్ర సంస్థలో ఉద్యోగంలో చేరినా.. సంతృప్తి చెందక మాతృభూమికి సేవ చేయాలనే లక్ష్యంతో 2015లో యూపీఎస్‌సీ నిర్వహించిన సీడీఎస్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ లను పూర్తిచేశాడు. మరోవైపు క్యాట్‌ పరీక్షలో 93.4 శాతంతో ప్రతిభను చాటి ఐఐఎం ఇండోర్‌లో ప్రవేశం పొంది, దేశ భద్రతా రంగం వైపు అడుగు వేశాడు. 2016 జూలై 8న ఇండియన్‌ మిలటరీ అకాడమీ శిక్షణలో రాణించి ‘టెక్నికల్‌ గ్రాడ్యుయేషన్‌’ కోర్సులో టాపర్‌గా నిలిచి కెప్టెన్‌గా సేవలందిస్తున్నాడు.

శివారు ప్రాంతం నుంచి కెప్టెన్‌గా..
చిరుమామిళ్ల సీతారామకృష్ణతేజ స్వగ్రామం విజయనగరం జిల్లా శృంగవరపుకోట. తండ్రి వైన్‌షాపులో గుమస్తా కాగా.. తల్లి నాగమణి మృతి చెందారు. 2008 తొలి బ్యాచ్‌లో ట్రిపుల్‌ ఐటీలో చేరిన సీతారామకృష్ణతేజ మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో 8.4 జీపీఏతో ఉత్తీర్ణత సాధించాడు. 17వ స్టాఫ్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఎస్‌ఎస్‌బీ) నిర్వహించిన ఇంటర్వ్యూలో అర్హత సాధించి డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలటరీ అకాడమీలో 2015 జూన్‌ 23 నాటికి శిక్షణ పూర్తి చేసుకున్నాడు.

ఆ తరువాత కమిషన్డ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించి అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌లో బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం రాజస్థాన్‌లోని మోడిఫైడ్‌ ఫీల్డ్‌లో కెప్టెన్‌ ర్యాంక్‌లో పర్మినెంట్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పేద కుటుంబాల్లో నుంచి వచ్చి ట్రిపుల్‌ ఐటీలో ఉత్తమ ప్రతిభతో ఇంజినీరింగ్‌ విద్యను పూర్తిచేసి.. సైన్యంలో కెప్టెన్లుగా పనిచేస్తున్న యాదగిరి,  సురేంద్రనాథ్, కృష్ణతేజలు నేటి విద్యార్థులకు స్ఫూర్తిప్రదాతలు..

ఉన్నతోద్యోగం వదిలి..దేశసేవకు నడుం బిగించి..
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన నాదెళ్ల సురేంద్రనాథ్‌ ట్రిపుల్‌ ఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఇండియన్‌ ఆర్మీలో కెప్టెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సురేంద్రనాథ్‌ తండ్రి వెంకట్రావు ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తుండగా.. తల్లి లక్ష్మి సాధారణ గృహిణి. 2009–15బ్యాచ్‌కు చెందిన సురేంద్రనాథ్‌ టీసీఎస్‌లో క్వాలిటీ అస్యూరెన్స్‌ కన్సల్టెంట్, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఉద్యోగాలను వదిలేసి ఆర్మీవైపే అడుగులు వేశాడు. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ పూర్తిచేసి శిక్షణ పొంది భారత సైన్యంలో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం అసోంలో కౌంటర్‌ (తిరుగుబాటు) ఆపరేషన్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. వ్యాయామ అధ్యాపకుడు నవీన్‌ అందించిన ప్రోత్సాహంతోనే తాను ఆర్మీలోకి అడుగుపెట్టానని పేర్కొంటున్నాడు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top