బెట్టింగ్‌రాయుళ్ల బెండుతీస్తున్నారు | Special Intelligence Task Force | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌రాయుళ్ల బెండుతీస్తున్నారు

Feb 18 2015 2:14 AM | Updated on Aug 21 2018 5:46 PM

క్రికెట్ ప్రపంచ కప్ నేపథ్యంలో నగరంలో జోరుగా సాగుతున్న బెట్టింగ్‌లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దృష్టిసారించారు.

టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక నిఘా
గవర్నర్‌పేటలో ఏడుగురి అరెస్ట్
రూ.70వేల నగదు,  20 సెల్‌ఫోన్లు స్వాధీనం
అజ్ఞాతంలోకి కీలక బుకీలు

 
విజయవాడ సిటీ : క్రికెట్ ప్రపంచ కప్ నేపథ్యంలో నగరంలో జోరుగా సాగుతున్న బెట్టింగ్‌లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దృష్టిసారించారు. బుకీలతోపాటు బెట్టింగ్‌రాయుళ్ల బెండు తీసేందుకు నిఘా పెట్టారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు జరిపి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఏడుగురిని మంగళవారం అరెస్ట్‌చేశారు. వీరి నుంచి రూ.70,350 నగదు, 20 సెల్‌ఫోన్లు, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నారు. అయితే, బెట్టింగ్‌ల నిర్వహణలో ప్రముఖులుగా పేరొందిన బుకీలు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. నగరంలో జరిగే క్రికెట్ బెట్టింగ్‌లపై రెండు రోజులుగా ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటుచేసుకొని బుకీలు బెట్టింగ్‌లు నిర్వహించే తీరు.. నగరంలో పేద, మధ్య తరగతి, విద్యార్థులు  బెట్టింగ్ ఊబిలో చిక్కుకుంటున్న వైనాన్ని వివరించిన విషయం విదితమే. ఈ కథనాలపై స్పందించిన నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అన్ని ప్రాంతాల్లో నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే గవర్నరుపేట చేపల మార్కెట్‌లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీలు ఏవీఆర్‌జీబీ ప్రసాద్, మురళీధర్‌ల పర్యవేక్షణలో ఎస్‌ఐలు ఆర్.సురేష్‌రెడ్డి, జి.శ్రీనివాస్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు సహా తదుపరి విచారణ కోసం గవర్నరుపేట పోలీసులకు అప్పగించారు. ఇదే సమయంలో వీరి నుంచి బుకీలకు సంబంధించిన కీలక సమాచారాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు రాబట్టినట్టు తెలిసింది.

గతంలో బెట్టింగ్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని పిలిపించి బైండోవర్ చేశారు. ఇదే జోరు కొనసాగిస్తే మరికొందరు బెట్టింగ్ రాయుళ్లు కూడా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో కీలక మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ రోజుల్లో ఇప్పటి కంటే రెట్టింపు పందేలు జరిగే అవకాశం ఉంది. బెట్టింగ్‌లో కీలక భూమిక పోషించే ప్రధాన బుకీలను కట్టడి చేస్తే అనేక కుటుంబాలు వీధిన పడకుండా ఉంటాయి.
 
అజ్ఞాతంలో బుకీలు..

 పోలీసులు దాడులకు దిగడంతో పలువురు ప్రముఖ బుకీలు అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరు రెండు రోజులపాటు ఇళ్ల నుంచే కార్యకలాపాలు నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగినట్టు తెలిసిన వెంటనే ఇళ్లు వదిలి బయటి ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు తమ అనుచరులతో సంప్రదింపులు జరుపుతూ పోలీసుల కదలికలను తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. నూజివీడు, విస్సన్నపేట, ఇబ్రహీంపట్నం శివారుతోపాటు నగరంలోని పటమట ప్రాంతంలో ఖరీదైన అపార్టుమెంట్లలో వీరు ఆశ్రయం తీసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement