తమ్ముళ్లు మన్ను తిన్నారు! | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లు మన్ను తిన్నారు!

Published Sat, May 2 2015 1:35 AM

Speaker Kodela References...

గర్నెపూడి(సత్తెనపల్లి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంపై ఆదిలోనే నీలి నీడలు కమ్ముకున్నాయి. భూగర్భ జలాల పరిరక్షణకు చెరువులను అభివృద్ధి చేసుకుని పూడిక మట్టితో కరకట్టల బలోపేతం, పంట పొలాలు, సామాజిక అవసరాలకు వినియోగించు కోవాలని ఇప్పటికే శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు సూచనలు చేశారు. ఆ సూచనలను తెలుగు తమ్ముళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ప్రతి నీటి బొట్టును వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నీరు-చెట్టు కార్యక్రమాన్ని చేపట్టింది.

అందులో భాగంగా పూడిక తీత చేసి గట్లు,  చెరువులను అభివృద్ధి చేయాలన్నది ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశం. అయితే పనులు చేపట్టిన తమ్ముళ్లు మట్టిని సైతం అమ్ముకుంటున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా మా కెందుకులే అని మిన్నకుంటున్నారు తప్ప పట్టించుకోవడం లేదు. సత్తెనపల్లి మండలం గర్నెపూడి గ్రామంలో ఐదు ఎకరాల చెరువును నీరు-చెట్టు కార్యక్రమం కింద అభివృద్ధి చేసేందుకు ఇటీవల పనులు ప్రారంభించారు. ఇక్కడ పనులు ప్రారంభం కావడంతో తమ్ముళ్లకు ఎక్కడా లేని ఆశలు పుట్టుకొచ్చాయి. ట్రక్కు మట్టిని రూ. 300లు చొప్పున 250 ట్రక్కులను ఇప్పటికే విక్రయించారు. ఆ ఆదాయాన్ని గ్రామ పంచాయతీకి జమ చేయకుండా సర్పంచ్, కార్యదర్శికి తెలియకుండానే అన్ని పనులు జరిపించేస్తున్నారు.

పంచాయతీకి సీనరేజీ కూడా జమ చేయడం లేదు. దీనిపై సర్పంచ్ బోగాల బాపిరెడ్డి ఇదేమిటని మాట్లాడితే తాము చేసేది చూస్తుండటం తప్ప మరేమీ మాట్లాడవద్దని, ఎక్కువ చేస్తే చెక్ పవర్ కూడా ఉండదంటూ హెచ్చరికలు చేశారు. జరుగుతున్న అన్యాయంపై ఎంపీటీసీ ఓబయ్య, ఉప సర్పంచ్ బిళ్లా సుజాతలు గ్రామ  కార్యదర్శికి ఫిర్యాదు చేయగా తాను సెలవులో ఉన్నానని తప్పుకున్నారు. ఎంపీడీవో పి.శ్రీనివాస్ పద్మాకర్‌కు ఫిర్యాదు చేయగా పనులకు ఆటంకం కల్గించవద్దని, ప్రస్తుతం తాను సెలవులో ఉన్నానని సమాధానం ఇచ్చారు.

దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్ర వారం చెరువు స్థలంలో మట్టి తీయకుండా పొక్లయిన్‌ను అడ్డుకున్నారు. తమ పనులకు అడ్డు రావద్దంటూ టీడీపీ నాయకులు వాగ్వివాదానికి దిగారు. కొద్ది సేపు  ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఎమ్మెల్యే వద్ద తేల్చుకుంటామంటూ తమ్ముళ్లు సత్తెనపల్లి చేరుకున్నారు. దీనిపై సర్పంచ్ బాపిరెడ్డి, ఎంపీటీసీ ఓబయ్య మాట్లాడుతూ నీరు-చెట్టు కార్యక్రమం కింద చెరువుల అభివృద్ధి సర్పంచ్ చేపడతారని తొలుత చెప్పారని, కేవలం తాము వైఎస్సార్‌సీపీ అనే ఉద్దేశంతో తెలుగు తమ్ముళ్లకు అవకాశం ఇచ్చారన్నారు. అయినప్పటికీ  మట్టి అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసు కోవడంతోపాటు ప్రజాప్రయోజనాలకు చెరువు మట్టి ఉపయోగపడేలా చూడాలని, పంచాయతీకి ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. చివరకు మట్టి అక్రమ విక్రయాలను వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement