సోనియా గాంధీని భారతదేశం నుంచి తరిమికొట్టాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ మండిపడ్డారు.
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : సోనియా గాంధీని భారతదేశం నుంచి తరిమికొట్టాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ మండిపడ్డారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంపై పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి గురువారం రాత్రి ఆయన యూపీఏ, బీజేపీ, టీడీపీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. విభజన కారకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ కుట్రపూరితంగా తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపిందని ధ్వజమెత్తారు. సీమాంధ్రకు న్యాయం చేయాలని చెబుతూనే నట్టేట ముంచిందన్నారు.
స్వార్థ రాజకీయాల కోసం కేంద్రం విభజన జరుపుతోందని, అందులో బీజేపీ, టీడీపీ భాగస్వామ్యులయ్యాయని ఆరోపించారు. అభివృద్ధి గురించి మాట్లాడుతున్న నరేంద్ర మోడీ ఇవాళ విభజనపై ఎందుకు నోరుమెదపడం లేదన్నారు. నరేంద్ర మోడీ పులిచర్మం కప్పుకున్న మేక అని ఎద్దేవా చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి కుమ్మక్కు రాజకీయాలకు తెరలేపారన్నారు. ఈ పార్టీలను బంగాళాఖాతంలో కలపాలన్నారు. వైఎస్సార్‌సీపీ నేత బి.ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో వైఎస్ జగన్ ప్రభావం ఎక్కువవుతుందన్న భావనతోనే ఆంధ్రప్రదేశ్ విభజనకు పాల్పడ్డారని ఆరోపించారు. సమైక్యాంధ్ర కోసం మొదటి నుంచి తమ పార్టీ మాత్రమే కట్టుబడి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డీసీసీబీ అభ్యర్థి లింగాల శివశంకర్‌రెడ్డి, శింగనమల నేత ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జేఎం బాషా, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుసేన్‌పీరా, జిల్లా ఉపాధ్యక్షుడు వాయల శ్రీనివాసులు, విద్యార్థి విభాగం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండిపరుశురాం, జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరేంద్ర రెడ్డి, నగరాధ్యక్షుడు మారుతీ ప్రకాష్, సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జ్ చుక్కలూరు దిలీప్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు యూపీ నాగిరెడ్డి, యువజన విభాగం నగరాధ్యక్షుడు మారుతీనాయుడు పాల్గొన్నారు.