రైతుల ద్రోహి సోమిరెడ్డి

Somireddy Cheat Farmers And Ap People - Sakshi

రైతుల శ్రేయస్సుపై మాట్లాడే అర్హత ఆయనకు లేదు

రైతులను రౌడీలన్నవ్యవసాయ మంత్రి

వైఎస్సార్‌సీపీ నాయకులు, రైతుల ధ్వజం

పొదలకూరు: రైతుల శ్రేయస్సుపై మాట్లాడే అర్హత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి లేదని, ఆయన రైతుల ద్రోహి అని, వ్యవసాయశాఖ మంత్రిగా ఉండి రైతులను రౌడీలుగా అభివర్ణించారని రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. మండలంలోని తోడేరు చిన్నచెరువు కింద సోమవారం వరి పైర్లను పరిశీలించిన ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, ఎంపీటీసీ సభ్యుడు ఏనుగు శశిధర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, గ్రామ రైతులు కలిసి విలేకరులతో మాట్లాడారు. సోమిరెడ్డి పుణ్యమా అని ఈ ఏడాది ఈ ప్రాంతంలో రైతులు పూర్తిస్థాయిలో పంటలు సాగు చేయలేకపోయారని, ఎత్తిపోతల పథకం సాగునీటిపై పెత్తనం చెలాయించిన మంత్రి పార్టీల పరంగా నీటిని విడుదల చేయించారని ఆరోపించారు. గ్రామాల్లో ఉద్రిక్తతలు పెంచి విష బీజాలు నాటి రైతులను రెచ్చగొట్టిన విషయాన్ని గుర్తుచేశారు. సాగునీటి సరఫరాను నిలిపివేస్తే  రైతులు ఆయన దగ్గరకు వెళతారని, తద్వారా రాజకీయ లబ్ధిపొందాలని సాగునీటి రాజకీయాలు చేశారని మండిపడ్డారు.

రైతులకు సాగునీటి రాజకీయాలు నచ్చక పంటలు వేసుకునేందుకు విముఖత చూపారే తప్ప, మంత్రి వద్దకు వెళ్లేందుకు ఇష్టపడ లేదన్నారు. తరచూ చెరువుల చుట్టూ తిరుగుతూ తానే సాగునీటిని అందజేస్తున్నట్టు రైతులను భ్రమింపచేసే ప్రయత్నంలో మంత్రి ఉన్నట్టు విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యం వల్లనే ఎడమగట్టు కాలువ పనులు జరిగాయని, 2008 నుంచి కాలువ కింద రైతులు పంటలు పండించుకుంటున్నట్టు తెలిపారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇచ్చిన భరోసాతోనే వరినాట్లు వేసుకున్నామని, సెంటు పొలం ఎండినా సొంత నిధులు వెచ్చిస్తానని చెప్పినందు వల్లనే ధైర్యంగా సాగు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. సోమిరెడ్డిని నమ్ముకుని పంటల సాగు చేపట్టి ఉంటే తీవ్రంగా నష్టపోయే వారమన్నారు. సొంత నిధులతో కాలువలు తవ్వించిన కాకాణికి సాగునీటి పంపిణీపై పూర్తిస్థాయిలో అవగాహన ఉందన్నారు. రైతుల పొలాల బోర్లలో నీరు పొంగడం లేదని, సోమిరెడ్డి అవినీతి పొంగి ప్రవహిస్తుందని ధ్వజమెత్తారు. అధికారం లేకపోయినా ఎమ్మెల్యే కాకాణి నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో సాగునీటి సంఘం అధ్యక్షుడు మన్నవరం వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్‌ మన్నవరం శ్రీనివాసులు, మాజీ సర్పంచ్‌ అట్ల రవీంద్ర, రైతులు ఎం.రమణయ్య, జీ కృష్ణయ్య, కే వెంగయ్య, వి.వెంకటరత్నం, ఎస్‌.కోటయ్య, ఎ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top