ఆందోళనల 'పొగ'

Smoke Relese in HPCL Gas Company Visakhapatnam - Sakshi

కలవరం రేపిన హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ

ఎఫ్‌సీసీయూ–1 యూనిట్‌ వద్ద ఘటన

ఎటువంటి ప్రమాదం లేదని తేలడంతో ఉపశమనం

అయినా తమకు రక్షణ కల్పించాలని పారిశ్రామిక ప్రాంత వాసుల డిమాండ్‌

మల్కాపురం (విశాఖ పశ్చిమ): మిట్ట మధ్యాహ్నం.. సూరీడు నిప్పులు చెరుగుతున్న వేళ.. కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది. ఉక్కుపోత, చెమటతో ఇళ్లలో ఉండలేక.. చాలామంది ఆరుబయటికొచ్చారు. సరిగ్గా అదే సమయంలో సమీపంలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) రిఫైనరీ వద్ద గోధుమ వర్ణంలో దట్టమైన పొగలు ఆకాశాన్ని కమేస్తున్న దృశ్యం చూసి మల్కాపురం, వెంకటాపురం తదితర చుట్టుపక్కల ప్రాంతాలవారు బెంబేలెత్తిపోయారు.

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటన ఇంకా కళ్లముందే మెదులుతుండగానే.. హెచ్‌పీసీల్‌ నుంచి రేగుతున్న ఈ పొగ స్థానికుల్లో ఆందోళనను రాజేసింది. మళ్లీ ఏ విపత్తు ముంచుకొస్తుందోన్న భయంతో ఇళ్లలో ఉన్నవారు సైతం రోడ్లపైకి వచ్చేసి దూరప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా.. ఇంకొందరు రిఫైనరీ గేటు వద్దకు చేరుకొని వాకబు చేయసాగారు. ఇంతలోనే ఐదు పది నిమిషాల వ్యవధిలోనే పొగలు ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇలా పొగలు రావడం సాధారణమేనని.. అయితే ఈసారి కాస్త మోతాదు పెరిగిందని, దీని వల్ల ఎటువంటి ప్రమాదం లేదని హెచ్‌పీసీఎల్‌ అధికారులు వివరించారు. ఎఫ్‌సీసీఎల్‌ యూనిట్‌–1 కంబర్షన్‌ సమయంలో పైప్‌లైన్‌లో నిలిచిన వ్యర్థాల కారణంగా పొగ ఎక్కువగా వచ్చిందని.. ఇందులో ఎటువంటి రసాయనాలు గానీ, విషవాయువులు గానీ లేవని భరోసా ఇచ్చారు.

దాంతో కొంత శాంతించినప్పటికీ.. భవిష్యత్తులో పెనువిపత్తులు సంభవించకుండా తమకు రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.విషయం తెలుసుకున్న కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ ములగాడ తహసీల్దార్‌ రమామణిని అప్రమత్తం చేశారు. వెంటనే హెచ్‌పీసీఎల్‌కు చేరుకున్న ఆమె సంస్థ ప్రతినిధులతో చర్చించి వివరాలు సేకరించారు. స్థానికులకు పరిస్థితిని వివరించి ఆందోళన విరమింపజేశారు.

ఇది ప్రమాదమే కాదు
యూనిట్‌లో కంబర్షన్‌లో స్వల్ప లోపం తలెత్తడం వల్లే ఒక్కసారిగా పొగ వ్యాపించింది. ప్లాంట్‌లో ఇది సర్వసాధారణమే తప్ప ఎలాంటి ప్రమాదం వాటిల్లదు. స్థానికులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం 5 నిమిషాల్లోనే పూర్తిగా పొగను అదుపులోకి తీసుకొచ్చాం. 35 నుంచి 40 డిగ్రీల మధ్యలో ట్యాంకు ఉష్ణోగ్రత ఉంటుంది. దాన్ని హయ్యర్‌ టెంపరేచర్‌ వద్ద మండించి వేపర్‌ చేసి రకరకాల చర్యలతో ఉత్పత్తులు తయారవుతాయి.– నారిశెట్టి రాజారావు, సీనియర్‌ జనరల్‌ మేనేజర్, హెచ్‌పీసీఎల్‌  

ప్రాణాలు పోతాయని భయమేసింది
పొగ చూడగానే ఏడుపు వచ్చింది. ప్రాణాలు పోతాయని భయమేసింది. వీధిలో ఉన్న అందరం బిగ్గరగా అరిచాం. ఇళ్ల నుంచి బయటికి వచ్చి అందరం రోడ్లపై నిలుచున్నాం. పొగ మొత్తం కమ్మేసింది. అయితే కొద్ది నిమిషాల్లోనే మాయమైపోవడంతో ఊపిరి పీల్చుకున్నాం.  – బి.స్వప్న, ప్రియదర్శిని కాలనీ

ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం
మధ్యాహ్నం కరెంట్‌ లేకపోవడంతో ఇంటి నుంచి బయటికి వచ్చాం. ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగ కనిపించడంతో భయపడ్డాం. ఎల్‌జీ పాలిమర్స్‌లోలా ప్రమాదం జరిగిందేమోనని ఉలిక్కిపడ్డాం. ఇళ్ల నుంచి వెళ్లిపోదామనుకునేలోగా పొగ మాయమైపోయింది.  –చట్టి నూకరాజు యాదవ్, మల్కాపురం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top