వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం గండి పుణ్యక్షేత్రంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరితా రెస్టారెంటులోని..
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య
వేంపల్లె: వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం గండి పుణ్యక్షేత్రంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరితా రెస్టారెంటులోని ఓ గదిలో మదనపల్లెకు చెందిన కుటుంబ యజమాని ఎలమలకుంట మీరావల్లి (45)తోపాటు అతని భార్య హజరాంబి(40), కుమార్తెలు ఆశ(20), యశ్మిత (18), షర్మిల(16), కుమారుడు దస్తగిరి (14) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మీరావల్లి స్వగ్రామం ఎర్రగుంట్ల. పిల్లల చదువుల కోసం అక్కడ ఉన్న ఆస్తుల్ని విక్రయించాడు. అప్పులు తీర్చేసి, మదనపల్లె చెంబుకూరు రోడ్డులోని ఈశ్వరమ్మ కాలనీలో ఏడు నెలల నుంచి నివాసముంటున్నారు. ఈనెల 1న పుణ్యక్షేత్రమైన గండికి మీరావల్లి కుటుంబం సహా చేరుకున్నాడు. మూడు రోజుల పాటు నిద్ర చేసేందుకు వచ్చామని హరితా రెస్టారెంటులోని 4వ గదిని తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు గది అద్దె కూడా చెల్లించారు. శుక్రవారం మధ్యాహ్నం ఎవరూ బయట కనపడకపోవడంతో రెస్టారెంటు సిబ్బంది గది తలుపులు తెరిసి చూడగా ఆరుగురూ విగతజీవులుగా పడి ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా మృతులు ఉన్న గదిలో గోడలపై తమ గదికి కొందరు వచ్చి పురుగుమందు తాగించారని రాసి ఉండటంతో వీరి మృతి అనుమానాలకు దారితీస్తోంది.