సీమాంధ్ర జిల్లాలతో ఏర్పాటు కానున్న కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఈనెల 14న జిల్లాకు రానుంది.
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సీమాంధ్ర జిల్లాలతో ఏర్పాటు కానున్న కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఈనెల 14న జిల్లాకు రానుంది. 1953 ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉన్న కర్నూలు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎంపిక చేయడానికి గల అవకాశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. ఒకప్పుడు రాజధానిగా ఎంపిక చేయాలనే డిమాండ్ ఉన్న నేపథ్యంలో శివరామకృష్ణన్ కమిటీ పర్యటిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కమిటీ వివిధ జిల్లాలను పర్యటిస్తూ ఇందులో భాగంగా కర్నూలుకు వస్తోంది.
ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. కర్నూలు నగరంలో ఇప్పటికే రాజధానికి అవసరమైన భవనాలు, ఓర్వకల్లు, గడివేముల, మిడుతూరు మండలాల్లో 25 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు, కర్నూలు మీదుగా జాతీయ రహదారులు, రైలు మార్గాలు, రాజధాని నిర్మాణానికి తగిన నీటి సదుపాయాన్ని కల్పించేందుకు, భవిష్యత్తులో నీటి అవసరాలను తీర్చేందుకు శ్రీశైలం జలాశయం ఉండటంతో కర్నూలు నగరాన్ని తిరిగి రాజధానిగా చేయడానికి తగిన అర్హతలు ఉండటంతో కర్నూలే రాజధాని అవుతుందని పలువురు ఆశిస్తున్నారు.
1953లో రాజధానిని త్యాగం చేయడంతో కర్నూలు జిల్లా బాగా వెనుకబడిపోయింది. జరిగిన ఈ నష్టాన్ని భర్తీ చేయాలంటే కర్నూలును రాజధానిని చేయాలనే డిమాండ్ ఉంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శివరామకృష్ణన్ కమిటీ రాజధాని ఎంపికలో కర్నూలు గల అవకాశాలను నిశితంగా పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలునే తిరిగి ఎందుకు రాజధానిని చేయాలనే దానిని వివరించేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధమవుతున్నారు.