‘సైబీరియన్’ అతిథి | 'Siberian' guest | Sakshi
Sakshi News home page

‘సైబీరియన్’ అతిథి

May 10 2014 2:12 AM | Updated on Sep 2 2017 7:08 AM

సైబీరియన్ పక్షుల ఆత్మీయ విడిది వీరాపురంలో వాటికి ఆహార కొరత ఏర్పడింది. ప్రతి ఏటా తమ సంతాన అభివృద్ధి కోసం సైబీరియన్ నుంచి వేల కిలోమీటర్ల దూరంలోని వీరాపురం ప్రాంతానికి పక్షులు వలస వస్తుంటాయి.

చిలమత్తూరు, న్యూస్‌లైన్ : సైబీరియన్ పక్షుల ఆత్మీయ విడిది వీరాపురంలో వాటికి ఆహార కొరత ఏర్పడింది. ప్రతి ఏటా తమ సంతాన అభివృద్ధి కోసం సైబీరియన్ నుంచి వేల కిలోమీటర్ల దూరంలోని వీరాపురం ప్రాంతానికి పక్షులు వలస వస్తుంటాయి. జనవరిలో ఇక్కడికి వలస వచ్చి.. గుడ్లు పెట్టి.. పిల్లలను పొదిగి అవి పెరిగి పెద్దగైన తర్వాత ఆగస్టులో తిరిగి సైబీరియా వెళతాయి. వేలాది పక్షులు కనువిందు చేస్తుండటంతో ఈ ప్రాంతం పర్యాటకంగా పేరుగాంచింది.
 
 గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సైబీరియన్ పక్షులు ఈ ప్రాంతానికి రాలేదు. పర్యాటకులు నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. ఈ ఏడాది ముందస్తుగా కురిసిన వర్షాలతో వీరాపురం పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు నిండాయి. జనవరి రెండో వారంలో దాదాపు రెండున్నర వేల పైచిలుకు పక్షులు గ్రామానికి చేరుకున్నాయి. వీటికి ఆహారంగా రెండు నెలల క్రితం అటవీ శాఖ అధికారులు హుస్సేన్‌పురం, వీరాపురం, వెంకటాపురం, నెమళ్లకుంట చెరువుల్లో చేపల పెంపకం చేపట్టారు.
 
 వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండటంతో కుంటలు, చెరువుల్లో నీటి మట్టం తగ్గిపోయింది. ఆయా చెరువుల్లో పెరుగుతున్న చేపల్ని కూడా గ్రామీణులు పట్టుకెళుతున్నారు. దీంతో పక్షులు తమ పిల్లలకు ఆహారాన్ని సేకరించడం కష్టంగా మారింది. ఇలాగే వదిలేస్తే ఆ పక్షులిక ఈ ప్రాంతానికి రాకపోవచ్చని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం వీరాపురం పక్షుల కేంద్రంపై నిర్లక్ష్యం వహిస్తోందని ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. చెరువుల్లో తక్షణమే ఊట కుంటలు తవ్వించాలని, శాశ్వతంగా సిమెంటు తొట్టెలు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement