22 కిలోమీటర్ల దూరంలో... | SI Vamshidhar Dead Body Found At Mangalapuram | Sakshi
Sakshi News home page

22 కిలోమీటర్ల దూరంలో...

Aug 27 2018 3:18 AM | Updated on Sep 2 2018 3:46 PM

SI Vamshidhar Dead Body Found At Mangalapuram - Sakshi

మంగళాపురం (చల్లపల్లి)/కోడూరు : కృష్ణాజిల్లా ఘంటసాల మండలం పాపవినాశనం వద్ద శనివారం గల్లంతైన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎస్‌ఐ కోట వంశీధర్‌ (30) మృతదేహాన్ని మంగళాపురం వద్ద కనుగొన్నారు. ఆదివారం ఉదయం 6:30 గంటల సమయంలో పొలానికి వెళ్తున్న రైతులు మంగళాపురం సమీపంలో 9వ నంబర్‌ పంట కాలువలో బోర్లాపడి ఉన్న మృతదేహాన్ని చూశారు. పోలీసులకు సమాచారమివ్వగా అది వంశీధర్‌దిగా గుర్తించారు. డీఎస్పీ వి.పోతురాజు, సీఐ జనార్ధన్‌ నేతృత్వంలో మృతదేహానికి ఘటనా స్థలిలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. శనివారం గన్నవరంలో తల్లికి వైద్య పరీక్షలు చేయించి స్వగ్రామం ఇస్మాయిల్‌ బేగ్‌పేటకు వస్తుండగా పాపవినాశనం వద్ద వారు ప్రయాణిస్తున్న కారు కాలువలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తల్లిని రక్షించిన ఆయన గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 22 కి.మీ.ల దూరంలో ఉన్న మంగళాపురం వద్దకు వంశీధర్‌ మృతదేహం ప్రవాహంలో కొట్టుకువచ్చింది. ఆదివారం అర్ధరాత్రి వరకు మృతదేహం కోసం నిమ్మగడ్డ లాకుల వద్ద గాలిస్తూనే ఉన్నారు. నీటి ఉధృతి వల్ల మృతదేహం వేగంగా కొట్టుకువెళ్లినట్టు అధికారులు చెబుతున్నారు. 

పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు 
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇస్మాయిల్‌ బేగ్‌పేటకు తీసుకురావడంతో దివిసీమకు చెందిన పోలీసులు వంశీధర్‌కు నివాళులర్పించేందుకు తరలివచ్చారు. జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వంశీధర్‌ మృతదేహాన్ని సందర్శించి, అతని తల్లిదండ్రులను ఓదార్చారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ, రామచంద్రాపురం డీఎస్పీ జేవీ సంతోష్‌లు కూడా వంశీధర్‌కు నివాళులర్పించారు. తనతో పాటు కానిస్టేబుల్, ఎస్‌ఐ శిక్షణ పొందిన వారు కూడా వంశీధర్‌ మృతదేహాన్ని కడసారిగా తిలకించి, కన్నీటి పర్యంతమైయ్యారు. మచిలీపట్నానికి చెందిన ప్రత్యేక పోలీస్‌ దళం వంశీధర్‌ ఇంటి వద్ద శాఖాపరమైన నివాళులర్పించారు. సాయంత్రం కోడూరులో సాయుధ వందనం అనంతరం పోలీసు లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, హోంమంత్రి చినరాజప్ప వంశీధర్‌ కుటుంబీకులను ఫోన్‌ ద్వారా పరామర్శించారు. డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ వంశీధర్‌ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement